- అన్ని వివాదాలకు చిరునే టార్గెట్ చేస్తే ఎలా?
విధాత: కొందరు దుందుడుకు వీరాభిమానుల వలన మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్‌కి మచ్చ ఏర్పడుతోంది. గతంలో కూడా ఇలాంటివి చాలా జరిగాయి. రాజశేఖర్ విషయంలో అప్పుడు అతను సికింద్రాబాద్‌లో రైలు దిగి కారులో వస్తున్న సమయంలో కొందరు మెగా వీరాభిమానులు ఆయనపై దాడి చేయడం సంచలనం సృష్టించింది.
ఆ తర్వాత కూడా ఆంధ్రజ్యోతి పత్రిక ఆఫీస్‌పై దాడి చేయడం, చిరంజీవిని విమర్శించిన వారిపై దాడులకు దిగడం వంటివి చేస్తూ ఉండడం వల్ల ఆ ప్రభావం చిరుపై పడుతుంది. ఫిలింనగర్ దైవ సన్నిధానంలో మెగాస్టార్ చిరంజీవి నాడు ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టడానికి మొదట ముందుకు వచ్చారు. కానీ అంతకుముందే తాను దానికి అనుమతి పొందానని దర్శకుడు తేజ వివాదం సృష్టించాడని నాడు పత్రికల్లో వార్తలు వచ్చాయి.
ఇక మోహన్ బాబు, చిరు గురించి ఏవేవో మాట్లాడినా.. చిరు మౌనంగా ఉన్నప్పటికీ ఆయన అభిమానులు ఆయనను టార్గెట్ చేయడంతో మంచు ఫ్యామిలీ కాస్త వాటన్నింటిని మెగాస్టార్ చేయిస్తున్నాడని ఆయనపై మండి పడుతున్నారు. నిజానికి పక్క వాళ్ళు చేస్తే తప్పులు కానిది.. చిరంజీవి చేయకపోయినా కూడా తప్పు అవుతుండటం ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి.
ఉదాహరణకు మహేష్ బాబు థమ్సప్ యాడ్‌లో నటిస్తే అభ్యంతరాలు ఎదురు కాలేదు. కానీ చిరంజీవి థమ్సప్ యాడ్‌లో నటిస్తే నాడు పలు సామాజిక కార్యకర్తలు దాన్ని తప్పుపట్టారు. ఇక చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అండ్ ఐ బ్యాంక్‌లో అక్రమాలు జరుగుతున్నాయని, మోసాలు జరుగుతున్నాయని ఆరోపణలు చేసే వారు ఎందరో ఉన్నారు.
వీరందరూ చిరునే టార్గెట్ చేస్తూ ఉంటారు. అభిమానుల నుంచి రక్తాన్ని తీసుకొని, కళ్ళను దానం తీసుకొని తన పేరు సంపాదించుకోవడం ఏమిటని చిరుపై విమర్శలు గుప్పించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక తాజా విషయానికి వస్తే పుణ్యం చేయపోతే పాపం ఎదురైనట్టుగా ఉంది మెగాస్టార్ చిరంజీవి పరిస్థితి.
తనకు పెద్దరికం, సినీ పెద్ద కుర్చీలు, పదవులు అక్కర్లేదని మెగాస్టార్ ఎప్పుడో ప్రకటించారు. ఇదే విషయాన్ని ఆయన బహిరంగంగా పెద్ద పెద్ద వేడుకలలోనే ఓపెన్‌గా చెప్పాడు. రీసెంట్గా చిత్రపురి కాలనీలో కార్మికుల ఇళ్లు ఓపెనింగ్ కార్యక్రమలో కూడా అదే చెప్పాడు.
20 ఏళ్ల కిందట ప్రారంభించిన చిత్రపురి కాలనీలో కార్మికుల ఇళ్లు ఇంతకాలానికి పూర్తవ్వడంతో ఈ ఇళ్ల ప్రారంభోత్సవానికి చిరుని ముఖ్య అతిథిగా పిలిచారు. ఈ సందర్భంగా కాలనీలో ఆసుపత్రి నిర్మిస్తానని చిరు ప్రకటించారు. ఇది చాలా మంచి కార్యక్రమం.
వాస్తవానికి చిత్రపురి కాలనీ నిర్మాణానికి ఆద్యుడు నటుడు ప్రభాకర్ రెడ్డి. ఆయన పేరు మీదనే ఈ కాలనీకి పేరు కూడా పెట్టారు. తాజాగా చిరు అక్కడ ఆసుపత్రి నిర్మిస్తానని వాగ్దానం చేశారు. ఈ క్రమంలో ప్రభాకర్ రెడ్డి కూతురు శైలజా రెడ్డి ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు.
అక్కడ ఆసుపత్రి నిర్మించాలని మేము ఎప్పుడో నిర్ణయించుకున్నామని.. కానీ కొంతమంది చిరంజీవి పేరు చెప్పి అడ్డుకుంటున్నారని, అక్కడ ఆసుపత్రి నిర్మిస్తే అది కేవలం చిరంజీవి మాత్రమే నిర్మించాలంటూ మమ్మల్ని ఆపేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీ నిర్మాణానికి మా తండ్రి కారణమని రోజూ చెబుతుంటారని కానీ దాని ప్రారంభోత్సవానికి మాకు కనీసం ఆహ్వానం కూడా పంపలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే సినీ పెద్దలు కాలనీలో ఇళ్ల ప్రారంభోత్సవానికి అతిథులను పిలిచే క్రమంలో ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్ని ఆహ్వానించడం మర్చిపోవడంతో ఇప్పుడు ఆ అపవాదు కూడా చిరంజీవిపై పడింది. ఇలా తాను చేయని తప్పులకు ఇలా మెగాస్టార్ మరోసారి బలి అయ్యారు.
నిజానికి ఆనాడు ప్రభాకర్ రెడ్డి గానీ నేడు చిరంజీవి గానీ కార్మికుల సంక్షేమమే కోరుకున్నారు. వారికి మెరుగైన సౌకర్యాలు అందుబాటులో ఉండాలని భావించారు. కానీ చిరు తనకు తెలియకుండా కొందరు చిల్లర అభిమానుల మూలంగా చిక్కుల్లో పడుతున్నారు. దీంతో దానినే ఆయుధంగా తీసుకుని కొందరు మెగా ఇమేజ్‌ని డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు.
వారికి ఇలాంటివి అస్త్రాలుగా పని చేస్తుంటాయి. ఇలాంటి వారి కారణంగా ఇండస్ట్రీలో గౌరవంగా ఉన్న చిరంజీవికి మచ్చ ఏర్పడుతోంది. ఇప్పటికైనా మెగా వీరాభిమానులు కాస్త అత్యుత్సాహం తగ్గించుకొని తాము చేసే పనులకు మెగాస్టార్ బాధ్యులవుతారని గ్రహిస్తే మంచిది. ఈ విషయంలో చిరు కూడా తనను అభిమానించే వారికి గట్టిగానే తనకు తెలియకుండా ఏ పని చేయవద్దని ఆదేశిస్తే ఇలాంటి అనవసర అపవాదులు చిరుపై రావని కొందరు విశ్లేషకులు సూచిస్తున్నారు.