- టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
- ఖమ్మంలో విద్యార్థి సంఘాల మానవ హారం
విధాత : టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనల హోరు కొనసాగుతూనే ఉన్నది. ఈ వ్యవహారంపై టీఎస్‌పీఎస్సీ (TSPSC) కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. పేపర్ లీకేజీని నిరసిస్తూ ఈ రోజు ఏబీవీపీ (ABVP) ఆధ్వర్యంలో కార్యకర్తలు టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి ముట్టించడానికి యత్నించారు.
లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. పేపర్ లీకేజేకి బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ (CM KCR) రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేయాలన్నారు. ఏబీవీపీ కార్యకర్తలను ఎక్కడిక్కడ అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్టు చేసి బోయిన్‌పల్లి పీఎస్‌కు తరలించారు.
#TSPSCScam పేపర్ లీకేజ్ కి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని, లీకేజీ పై సీబీఐ విచారణ చేపట్టి TSPSC ని ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తూ నాంపల్లిలోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించిన ABVP#TSPSCScam @SabithaindraTRS pic.twitter.com/DRzI6TIpaZ
— Atakari Gireesh (@NaniAtakari) March 15, 2023
ఖమ్మంలో మానవహారం
ఖమ్మం జిల్లాలో పీవైఎల్ (PYL), పీడీఎస్‌యూ (PDSU) ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉద్యోగార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కేంద్ర గ్రంథాలయం నుంచి మయూరీ కూడలి వరకు భారీ ర్యాలీ తీశారు. అనంతరం కూడిలో మానవహారంతో నిరసన వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు.
లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం రాత్రిబవంబళ్లు చదువుతుంటే ఇలాంటి ఘటనలు వారి జీవితాలను నాశనం చేసేలా మారాయి అన్నారు. ఏఈ పేపర్ లీకైందని, అలాగే గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ కూడా లీకైందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.
ఇవే కాదు గతంలో జరిగిన పరీక్షలు కూడా లీకయ్యాయా? అని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని వారు తెలిపారు. లక్షల రూపాయిలు పెట్టి కోచింగ్ తీసుకుని కష్టపడి చదువుకుంటున్నవారి ఆశలు వమ్ము చేశారని, ఇది పెద్ద కుంభకోణంగా తాము భావిస్తున్నామని విద్యార్థి నేతలు ఆరోపించారు.
నిరుద్యోగుల జీవితాలతో టీఎస్‌పీఎస్సీఆటలాడుకుంటున్నదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ లీకేజీ ఘటనలో నిన్న పాత్రధారులనే అరెస్టు చేశారని, వీరి వెనుక ఉన్న సూత్రధారులను అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు.
సిట్‌తో విచారణా?
ప్రశ్నపత్రం లీకేజీపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తప్పుపట్టారు. సిట్‌కు అప్పగించిన కేసులన్నీ నీరుగారి పోయిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. నయీం కేసు, డ్రగ్స్ కేసు, డేటా చోరీ కేసు సహా సిట్ కు అప్పగించిన కేసులన్నీ నీరుగారిపోయాయని విమర్శించారు.
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు కూడా నీరుగార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తున్నదని, ఇందులో భాగంగానే సిట్‌కు అప్పగించారని మండిపడ్డారు. ప్రశ్నపత్రాల లీకేజీపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ఎదుట ఆందోళన చేసిన బీజేవైఎం కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడాన్నిసంజయ్ ఈ సందర్భంగా ఖండించారు.