Wednesday, March 29, 2023
More
    Homelatestచౌరస్తాలో చకిలం.. టచ్‌లో కాంగ్రెస్, BJPలు! రాజకీయ భవిష్యత్తుపై అంతర్మథనం..?

    చౌరస్తాలో చకిలం.. టచ్‌లో కాంగ్రెస్, BJPలు! రాజకీయ భవిష్యత్తుపై అంతర్మథనం..?

    విధాత: బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసినప్పటికీ, వరుసగా రెండు పర్యాయాలు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా తగిన గౌరవం పదవులు దక్కలేదన్న నిరాశతో ఆ పార్టీతో 22 ఏళ్ల సుదీర్ఘ అనుబంధాన్ని తెంచేసుకున్న చకిలం అనిల్ కుమార్ భవిష్యత్తు రాజకీయ అడుగులు ఏ పార్టీ వైపు వేయాలన్న నిర్ణయంపై రాజకీయ చౌరస్తాలో నిలబడి అంతర్మథనం సాగిస్తున్నారు.

    ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాలను శాసించిన తన తండ్రి దివంగత చకిలం శ్రీనివాసరావు పంతులు రాజకీయ వారసుడిగా తగిన పదవులు అందుకోవడంలో విఫలమైన అనిల్ కుమార్ భవిష్యత్తులోనైనా ఈ దిశగా ఆశించిన లక్ష్యాలు సాధించాలన్న కసితో ఉన్నారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన అనిల్‌తో ఇప్పటికే అటు బీజేపీ నాయకత్వం, ఇటు కాంగ్రెస్ నాయకత్వం తమ పార్టీల్లోకి ఆహ్వానిస్తూ సంప్రదింపులు అరంభించాయి.

    చకిలం శ్రీనివాసరావు కుటుంబ రాజకీయ వారసత్వ నేపథ్యంతో పాటు తెలంగాణ ఉద్యమంలో, బిఆర్ఎస్ పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేసిన రాజకీయ నేపథ్యంతో ఏర్పడిన బలమైన అనుచర గణం ఉన్న అనిల్ కుమార్‌ను తమ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్‌లు ఆసక్తి చూపుతున్నాయి.

    తాను ఏ పార్టీలో చేరితే తన రాజకీయ ఆశయాలు నెరవేరుతాయన్న దానిపై అనుచరులు, మద్దతు దారులతో అనిల్ కుమార్ మల్లగుల్లాలు పడుతూ తరచూ వారితో సమాలోచనలు సాగిస్తున్నారు. భవిష్యత్తు రాజకీయ అడుగులపై నెలకొన్న అనిశ్చితికి తెరదించి చివరకు ఏ పార్టీ వైపు అనిల్ కుమార్ మొగ్గు చూపుతారన్న అంశం నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

    జిల్లా రాజకీయ చరిత్రలో కాంగ్రెస్ ఉద్దండ నేతల్లో ఒకడిగా పేరోందిన తన తండ్రి శ్రీనివాసరావు పంతులు వారసుడిగా తాను తిరిగి కాంగ్రెస్ లో చేరడానికి అనిల్ అధికంగా మొగ్గుచూపుతున్నారు. అనిల్ కాంగ్రెస్ నుండి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా ఆనాడు బీఆర్ఎస్‌లో చేరారు.

    రానున్న రోజుల్లో రాష్ట్రంలో అధికార సాధన దిశగా బిజెపితో పోల్చితే కాంగ్రెస్‌కే అవకాశాలు మెండుగా ఉన్నాయని నమ్ముతున్న అనిల్ కుమార్ ఆ పార్టీలో చేరేందుకు సానుకూలంగా ఉన్నారని తెలుస్తుంది. నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్ కాంగ్రెస్ టికెట్ లేదా పార్లమెంట్ టికెట్ పై తనకు స్పష్టమైన హామీ కాంగ్రెస్ అధిష్టానం నుండి లేదా రేవంత్ రెడ్డి నుండి వస్తే తాను కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమేనంటూ ఆయన తాజాగా వ్యాఖ్యానించారు.

    అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ తనకు ఎమ్మెల్యే టికెట్,ఎమ్మెల్సీ పదవిపై స్వయంగా ఇచ్చిన వాగ్దానాలను, హామీలను నమ్మి 22ఏళ్లుగా మోసపోయానంటున్న అనిల్ కుమార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి హామీని నమ్మి కాంగ్రెస్‌లో చేరితే మళ్లీ తన విషయంలో పాత కథనే పునరావృతం అవుతుందా అన్న సందేహాలు కాంగ్రెస్‌లో చేరికపై అనిల్‌ను అయోమయానికి గురి చేస్తున్నాయి.

    అదిగాక నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్ రాజకీయాల్లో ఆ పార్టీ సీనియర్ నేతగా ఉన్న మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చే ఎన్నికల్లో తాను మరోసారి ఇక్కడి నుండే పోటీ చేస్తానంటూ ఇప్పటికే ప్రకటించారు. వెంకటరెడ్డి కాకపోతే దుబ్బాక నరసింహ రెడ్డి కూడా కాంగ్రెస్ టికెట్ రేసులో ఉండనే ఉన్నారు. వారిద్దరినీ కాదని అనిల్‌కు కాంగ్రెస్ నుంచి ఈ సీట్లో టికెట్ దొరకడం అసాధ్యంగానే కనిపిస్తుంది.

    ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో చేరాల వద్ద అన్న మీమాంస అనిల్ ను అంతర్మథనానికి గురిచేస్తుంది. ఇక బిజెపిలో చేరితే కాంగ్రెస్ నేపథ్యం నుండి వచ్చిన తాను, తన వర్గం ఆ పార్టీలో ఇముడలుగుతారా లేదా అన్న సందేహం అనిల్ ను ఆలోచనలో పడేస్తుంది.

    అదిగాక బీజేపీ నుంచి నల్గొండ అసెంబ్లీ టికెట్ పై హామీ వస్తుందో లేదో అన్న సందేహం కూడా అనిల్‌ను బీజేపీ వైపుగా వెనుకడుగు వేయిస్తుంది. ఈ నేపథ్యంలో చకిలం అనిల్ కుమార్ ఏ పార్టీలో చేరుతారన్న అంశం నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయ వర్గాలతో పాటు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular