Cigarette |
ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని అటు ప్రభుత్వాలు, ఇటు ప్రయివేటు ఆర్గనైజేషన్స్ విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ.. ఫలితం లేకుండా పోతోంది. సిగరెట్ కాల్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ధూమపానం చేయడం వల్ల ఊపిరితిత్తులకు ప్రమాదం పొంచి ఉందని తెలుసు. క్యాన్సర్, గుండెపోటు వంటి ప్రమాదాలు సంభవించే అవకాశం కూడా ఉంది. వీటితో పాటు మెదడు కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. నిత్యం సిగరెట్ కాల్చడం వల్ల మెదడు పరిమాణం తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
అయితే శాస్త్రవేత్తలు ధూమపానం చేసేవారు, చేయని వారిపై పరిశోధనలు నిర్వహించారు. సిగరెట్ కాల్చే వారి మెదడు, ధూమపానం చేయని వారి మెదడు కంటే 0.4 క్యూబిక్ అంగుళాలు చిన్నదిగా ఉన్నట్టు ఓ అధ్యయనంలో తేలింది. ఈ పరిశోధన కోసం ధూమపానం అలవాటు ఉన్న వ్యక్తుల మెదడును స్కాన్ చేసి విశ్లేషించారు.
ఇందు కోసం 2006 నుంచి 2010 వరకు, 2012 నుంచి 2013 మధ్య పరిశోధనలు నిర్వహించారు. ఈ రెండు పరిశోధనల్లో ధూమపానం చేస్తున్న వారి మెదళ్లను స్కాన్ చేసి, పరిమాణాన్ని గుర్తించారు. ధూమపానం చేయని వారి కంటే, ధూమపానం చేసే వారిలో మెదడు పరిమాణం తక్కువగా ఉన్నట్టు తేల్చారు. సిగరెట్‌కు దూరంగా ఉన్నవారి మెదడు పెద్దగా ఉన్నట్టు కనుగొన్నారు. అంటే సిగరెట్ కాల్చడం వల్ల మెదడు కుచించుకుపోతుంది అని ఈ పరిశోధన ద్వారా వెల్లడైంది.
ధూమపానం చేయడం వల్ల భావోద్వేగం, జ్ఞాపకశక్తికి సంబంధించిన మెదడులోని భాగం సంకోచిస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. కాబట్టి సిగరెట్ కాల్చే అలవాటు ఉన్న వారు ఇప్పటికైనా మానేస్తే మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మెదడు సంకోచించడం వల్ల కండరాలు బలహీనంగా మారుతాయి. దృష్టి కూడా మసకబారుతుంది. శరీర అవయవాల మధ్య సమన్వయం కోల్పోతుంది. అంటే మతిమరుపు వ్యాధి కూడా సంభవించే అవకాశం ఉంది.