Tuesday, January 31, 2023
More
  Homeతెలంగాణ‌మాస్టర్ ప్లాన్ రద్దుకు పౌర హక్కుల సంఘం డిమాండ్

  మాస్టర్ ప్లాన్ రద్దుకు పౌర హక్కుల సంఘం డిమాండ్

  విధాత, నిజామాబాద్: పచ్చని పంట పొలాల్లో మాస్టర్ ప్లాన్‌తో మంటలు రేపుతుందని ప్రభుత్వంపై పౌర హక్కుల సంఘం నేతలు ధ్వజమెత్తారు. ఫలితంగానే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఇందులో భాగంగానే అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో పయ్యావుల రాములు ఘటన చోటు చేసుకుందని పౌర హక్కుల సంఘం నేతలు ఆరోపించారు.

  కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీ సోమవారం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా పౌర హక్కుల సంఘం రాష్ట్ర, ఉమ్మడి జిల్లా కమిటీ సభ్యులు పయ్యావుల రాములు కుటుంబాన్ని పరామర్శించారు.

  రాములు మృతిపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులను కలిసి ఆరా తీశారు. అనంతరం రాత్రి కామారెడ్డి ఆర్ అండ్ బి అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు. పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ మాట్లాడుతూ పయ్యావుల రాములు ఆత్మహత్యకు ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. రాములు కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేసియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ఆయన కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, భూమికి ప్రత్యామ్నాయంగా భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

  నెల రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నప్పటికి రాములు ఇంటిని ఏ అధికారి సందర్శించలేదని, కనీసం ఓదార్చనూ లేదన్నారు. రెండు పంటలు పండే పచ్చని పొలాలను ఇండస్ట్రియల్ జోన్ లో కలపడం పట్ల రైతుల జీవనాధారం అగమ్యగోచరంగా మారిందన్నారు.

  తాము ఎలా బతికేది, దేశానికి అన్నం పెట్టేదెలా అని ఆవేదన చెందుతున్నారన్నారు. మళ్ళీ పయ్యావుల రాములు వంటి సంఘటనలు పునరావృతం అవుతాయేమోనన్న భయం రైతుల్లో నెలకొందన్నారు. భూములు లాక్కొని సరైన నష్ట పరిహారం ప్రభుత్వం ఇవ్వడం లేదని, ఇది రాష్ట్ర వ్యాప్తంగా సమస్యగా పేర్కొన్నారు.

  ప్రభుత్వం ఒక రియల్ ఎస్టేట్ సంస్థగా మారి రైతుల భూములు గుంజుకునే ప్రక్రియకు స్వస్తి చెప్పాలని ప్రొఫెసర్ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్ కు బాధ్యులైన ఎమ్మెల్యేలు గంప గోవర్దన్, సురేందర్ లు ఇప్పటికైనా మానవతా దృక్పథంతో వ్యవహరించి మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని సూచించారు.

  జిల్లా కలెక్టర్ రైతుల వద్ద నుండి కనీసం వినతి పత్రం తీసుకో లేదని, పైగా పోలీసులతో జులుం చేసి ఈ నెల 5న లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు. స్వామి అనే రైతుకు గాయాలు కాగా మూడు రోజులు ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని తిరిగి వచ్చాడన్నారు.

  కలెక్టర్ వ్యవహారం విచిత్రంగా ఉందన్నారు. ఎంత మంది ప్రాణాలు తీయాలని భావిస్తున్నారని లక్ష్మణ్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఇకనైనా ముఖ్య మంత్రి స్వయంగా ఇక్కడికి వచ్చి సమస్యను పరిష్కరించాలన్నారు.

  రైతుల శవాల మీది నుంచి దాటడానికి సిద్దపడి మాస్టర్ ప్లాన్ ను తయారు చేశారని పౌర హక్కుల సంఘం ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్గొట్ రవీందర్ అన్నారు. ఇది సరైన చర్య కాదని, వెంటనే మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి పట్టణానికి రెండు వైపులా పాత, కొత్త జాతీయ రహదారులు ఉన్నాయని, అదనంగా వంద అడుగుల రహదారి అవసరం లేదన్నారు.

  నిట్టు వేణుగోపాల్, ముజీబ్ లు కొన్న భూముల కోసమే ఈ మాస్టర్ ప్లాన్ చేశారని ఆరోపించారు. దీన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డికి 5, 6 కిలోమీటర్ల దూరంలో ఇండస్ట్రియల్ జోన్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.

  బంగారు పంటలు పండే భూములను ప్రభుత్వం, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు వందలాది ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే మాస్టర్ ప్లాన్ రూపొందించాని, ఇందు కోసం వంద అడుగుల రోడ్ ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు.

  రైతుల శవాలను చూడాలనుకుంటేనే ప్రభుత్వం ముందుకెళ్లాలని, లేని పక్షంలో మాస్టర్ ప్లాన్ వెంటనే రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో పౌర హక్కుల నేతలు నారాయణరావు, కుమారస్వామి, క్యాతం సిద్దిరాములు, తిరుమలయ్య, ప్రకాష్, దేవీసింగ్ తదితరులు పాల్గొన్నారు.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular