civils results
- తెలంగాణలో మొదటి ర్యాంక్
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: యూపీఎస్సీ 2022 ఫలితాల్లో హన్మకొండకు చెందిన శాఖమూరి శ్రీ సాయి ఆశ్రిత్ 40 వ ర్యాంకు సాధించారు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో తెలంగాణ రాష్ట్రంలోనే శ్రీ సాయి ఆశ్రిత్ మొదటి ర్యాంకును సాధించారు.
హన్మకొండకు చెందిన శాఖమూరి అమర లింగేశ్వర్ రావు, పద్మ దంపతుల కుమారుడైన శ్రీ సాయి ఆశ్రిత్ తొలి ప్రయత్నంలోనే సివిల్స్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకు సాధించడం విశేషం. హన్మకొండలోని వరంగల్ పబ్లిక్ స్కూల్ లో టెన్త్ క్లాస్ వరకు చదువుకొని, ఇంటర్మీడియట్ హైదరాబాద్ శ్రీ చైతన్య కాలేజీ లో, బిట్స్ పిలానిలో బీటెక్ పూర్తి చేశారు. వివిధ అకాడమిలో సివిల్స్ కోచింగ్ తీసుకున్నారు.
శ్రీ సాయి ఆశ్రిత్ ఉత్తమ ర్యాంకు సాధించడం పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా శ్రీ సాయి ఆశ్రిత్ మాట్లాడుతూ తొలి ప్రయత్నంలోనే సివిల్స్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకు సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. తన తల్లి దండ్రులు, ఉపాధ్యాయులు ఎంతగానో ప్రోత్సహించారన్నారు. ముఖ్యంగా ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ వరకు ఎల్లప్పుడూ ప్రేరణ కల్గించి, సక్సెస్ కు కారణమైన గురువులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.