BRS | బీజేపీకి అండగా మాజీ మంత్రి చిత్తరంజన్ కార్యకర్తలను కూడగడుతున్న కాంగ్రెస్ విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: కల్వకుర్తి నియోజకవర్గంలో త్రిముఖ పోటీ తప్పేట్టు లేదు. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ బలంగా ఉన్నాయి. ఈ మూడు పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉంటోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీజేపీకి ప్రజాబలం ఉన్న నియోజకవర్గాల్లో కల్వకుర్తి ఒకటి. ఆ పార్టీ అధిష్టానం ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. 2014లో […]

BRS |

  • బీజేపీకి అండగా మాజీ మంత్రి చిత్తరంజన్
  • కార్యకర్తలను కూడగడుతున్న కాంగ్రెస్

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: కల్వకుర్తి నియోజకవర్గంలో త్రిముఖ పోటీ తప్పేట్టు లేదు. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ బలంగా ఉన్నాయి. ఈ మూడు పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉంటోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీజేపీకి ప్రజాబలం ఉన్న నియోజకవర్గాల్లో కల్వకుర్తి ఒకటి. ఆ పార్టీ అధిష్టానం ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. 2014లో గెలుపు అంచులకు చేరుకుని, చతికిలపడింది. ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డికి బీజేపీ అభ్యర్థి ఆచారి చుక్కలు చూపించారు.

ఆ తర్వాతి 2018 ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ ను కాదని ఓటర్లు బీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ కు పట్టం కట్టారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు మళ్ళీ ఈ ముగ్గురూ టికెట్లు సాధిస్తే, వీరి మధ్య పోటీ రసవత్తరంగా మారనుంది. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ జైపాల్ యాదవ్ కు టికెట్ ప్రకటించింది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల పేర్లు ఖరారు కాలేదు. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి, బీజేపీ నుంచి ఆచారి కే టికెట్ దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు.

జైపాల్ యాదవ్ (ప్రస్తుత ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి)

కల్వకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్గ పోరుతో సతమతమవుతోంది. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, సీనియర్ నాయకుడు బాలాజీ సింగ్, పలువురు నాయకులు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన కసిరెడ్డికి, అధిష్టానం ఎమ్మెల్సీ ఇచ్చి సముదాయించింది. తాజాగా జైపాల్ యాదవ్ కు టికెట్ నూ అడ్డుకునే ప్రయత్నచేసినా, ఫలితం దక్కలేదు.

దీంతో కసిరెడ్డి, మరికొంత మంది బీఆర్ఎస్ నాయకులు వేరుకుంపటి పెట్టారు. జైపాల్ యాదవ్ కు వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహించడం చర్చనీయాంశమైంది. పార్టీ రెండు వర్గాలుగా చీలింది. జైపాల్ యాదవ్ అసమ్మతి నేతలను పట్టించుకోవడం లేదు. సొంత బలంతో గెలుస్తాననే ధీమాలో ఉన్నారు. వ్యతిరేక వర్గం నాయకులు మాత్రం ఓడించే వరకు పట్టువదలమని అంటున్నారు. ఇక్కడ గట్టెక్కేందుకు బీఆర్ఎస్ కు పాట్లు తప్పవు.

వంశీచంద్ రెడ్డి (మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ టికెట్ ఆశావహులు)

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆశీస్సులు పుష్కలంగా ఉన్న వంశీచంద్ రెడ్డికి కల్వకుర్తి టికెట్ వస్తుందనే అభిప్రాయం అందరిలో ఉంది. 2014లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి, బీజేపీ అభ్యర్థి చేతిలో స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. నియోజకవర్గంలో తమదైనా ముద్ర వేశారు. ప్రతిపక్షంలో ఉండి కల్వకుర్తి ప్రాంతాన్నిఅభివృద్ధి పథంలో నడిపేందుకు తీవ్రంగా కృషి చేశారు. ప్రజల మధ్య ఉంటూ మంచి గుర్తింపు పొందారు.

2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ చేతిలో ఓటమి చెందారు. ఓటమి చెందినా ప్రజల మధ్య ఉంటూ వచ్చారు. మళ్ళీ రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. పార్టీలో వర్గపోరు లేకపోవడంతో ఆయనకు లైన్ క్లియర్ గా ఉన్నట్లు ఆ పార్టీ నాయకులే అంటున్నారు. బీఆర్ఎస్ లో వర్గ పోరును, కాంగ్రెస్ విజయావకాశాలుగా మార్చుకునేందుకు కసరత్తు చేస్తోంది.

ఆచారి (బీజేపీ టికెట్ ఆశావహులు)

2014 ఎన్నికల్లో ఆచారి బీఆర్ఎస్, కాంగ్రెస్ కు చెమటలు పట్టించారు. ఈ ఎన్నికల్లో అనూహ్యంగా గెలుపు వద్దకు వచ్చి వెనుతిరిగారు. ఇద్దరి మధ్య స్వల్ప తేడా ఓట్లు రావడంతో చివరకు ఒక తండాలో రీ పోలింగ్ జరిగింది. ఈ ఓట్లు వీరిద్దరి గెలుపును నిర్ణయించాయి. కాంగ్రెస్ కు అధిక ఓట్లు రావడంతో వంశీచంద్ రెడ్డినే గెలుపు వరించింది. అప్పటి నుంచి ఆచారి పేరు ఒక్క బీజేపీలో కాకుండా అన్ని పార్టీల్లో నామస్మరణ చేశారు. ఆచారి ఇప్పటివరకు కల్వకుర్తి నియోజకవర్గంలో సుమారు ఐదు సార్లు పోటీ చేసి ఓటమి చెందారు.

ప్రజల మధ్య తన జీవితం అని, ఎప్పుడూ ప్రజా సమస్యలపై పోరాటం సాగిస్తూనే ఉంటారు. ప్రస్తుతం ఆయన కు మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ అండ లభించింది. ఇటీవల చిత్తరంజన్ బీజేపీలో చేరారు. గతంలో ఆయన టీడీపీ అధినేత, మహానటుడు ఎన్టీఆర్ ను ఓడించిన ఘనత ఉంది. ఎన్టీఆర్ పై గెలిచిన చిత్తరంజన్ అప్పట్లో చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం ఆయన బీజేపీ లో చేరడం ఆ పార్టీ కి మరింత బలం చేకూరింది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ బీజేపీకి ఎదురులేదనే ధీమాలో పార్టీ శ్రేణులు ఉన్నారు.

Updated On 5 Sep 2023 9:40 AM GMT
somu

somu

Next Story