CM KCR | హైదరాబాద్: స్వాతంత్య్ర భారతదేశంలో ఇప్పటికీ ఆర్థికంగా వెనుకుబాటుతనం,పేదరికం, నిరుద్యోగం, సాంఘిక వివక్షలు మన దేశాన్ని పట్టిపీడిస్తుండటం దురదృష్టకరం అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారిన తర్వాత 1948 నుంచి 1956 వరకూ హైదరాబాద్ రాష్ట్రంగా వెలుగొందిందని కేసీఆర్ తెలిపారు. 1956లో జరిగిన రాష్ట్రాల పునర్విభజనలో […]

CM KCR |
హైదరాబాద్: స్వాతంత్య్ర భారతదేశంలో ఇప్పటికీ ఆర్థికంగా వెనుకుబాటుతనం,పేదరికం, నిరుద్యోగం, సాంఘిక వివక్షలు మన దేశాన్ని పట్టిపీడిస్తుండటం దురదృష్టకరం అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారిన తర్వాత 1948 నుంచి 1956 వరకూ హైదరాబాద్ రాష్ట్రంగా వెలుగొందిందని కేసీఆర్ తెలిపారు. 1956లో జరిగిన రాష్ట్రాల పునర్విభజనలో భాగంగా తెలంగాణ ప్రాంత ప్రజల మనోభీష్టానికి విరుద్ధంగా తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలను కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయడం, దాని దుష్పరిణామాలు మనందరికీ తెలిసినవే. అందుకే, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి,ప్రజానీకానికీ జరిగిన తీరని అన్యాయాలను,అక్రమాలను, సమైక్య పాలకుల ఆధిపత్యాన్ని ఎదిరించి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం ఉద్యమబావుటా ఎగురవేశాం.
ఆ మహోద్యమానికి నేనే స్వయంగా సారథ్యం వహించడం చరిత్ర నాకందించిన మహదవకాశం. మీ అందరి సహకారంతో ఉద్యమాన్ని విజయతీరం చేర్చగలిగాను. స్వరాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే గురుతర బాధ్యతను సైతం మీరు నా భుజస్కంధాలపైనే మోపారు. తెలంగాణ సాధనతోనే నా జన్మ చరితార్థమైందని భావించాను.ఆ తర్వాత ప్రజల అనుజ్ఞను శిరసావహించి పునర్నిర్మాణ కార్యాన్ని సైతం నిబద్ధతతో నిర్వహిస్తున్నాను అని కేసీఆర్ వివరించారు.
2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం సాకారమైన నాటినుంచి జరుగుతున్న అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచాయని కేసీఆర్ పేర్కొన్నారు. నూతన రాష్ట్రం తెలంగాణ అనుసరిస్తున్న విధానం సమగ్రమైనదని అన్నివర్గాల ప్రయోజనాలను నెరవేరుస్తూ సాగుతున్న సమ్మిళిత, సమీకృత అభివృద్ధి నమూనా ఆదర్శవంతమైనదని యావత్ దేశం ప్రశంసిస్తున్నది. భారతదేశం విభిన్న మతాలు, సంస్కృతులు, జాతులు, భాషలు, కులాలు, తెగల సమ్మేళనం. భౌగోళిక ప్రత్యేకతలకు నిలయం.
Live: సెప్టెంబర్ 17, జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేస్తున్న సీఎం శ్రీ కేసీఆర్. https://t.co/1PL0CQIrhL
— BRS Party (@BRSparty) September 17, 2023
జాతీయ సమైక్యత అనేది రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, మనోవైజ్ఞానికి రంగాలకు సంబంధించిన అంశం. జాతీయ సమైక్యతకు ఎదురవుతున్న సమస్యలను విశాల దృక్పథంతో పరిశీలిస్తే, వాటిలో ముఖ్యమైనవి ఆర్థిక సమస్యలేనని స్పష్టమవుతున్నది. 76 సంవత్సరాల స్వాతంత్య్రం తరువాత కూడా ఇప్పటికీ ఆర్థికంగా వెనుకుబాటుతనం,పేదరికం, నిరుద్యోగం, సాంఘిక వివక్షలు మన దేశాన్ని పట్టిపీడిస్తుండటం దురదృష్టకరం. ఈ రుగ్మతలను పారద్రోలటంతో పాటు, ప్రజల అవసరాలు, ఆకాంక్షలు తెలిసింది తెలంగాణ ప్రభుత్వం. అందుకే, రాష్ట్ర త్వరాభివృద్ధితోపాటు,“సంపద పెంచాలి. పెరిగిన సంపదను అవసరమైన వర్గాల ప్రజలకు పంచాలి” అన్న ధ్యేయంతో తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేస్తున్నదని కేసీఆర్ తెలిపారు.
మానవీయ కోణంలో పథకాలను రూపొందించి అమలు చేస్తున్నదని కేసీఆర్ పేర్కొన్నారు. సకలజనులకూ సంక్షేమ ఫలాలు అందిస్తున్నది. రాష్ట్రంలో నేడు ప్రభుత్వ పథకాల లబ్ధి పొందని కుటుంబమేదీ లేదని ఘంటాపథంగా చెప్పవచ్చు. ప్రభుత్వ పథకాల ఫలితంగానే నేడు రాష్ట్రంలో పేదరికం తగ్గి, తలసరి ఆదాయం పెరిగింది. 2015-18 నాటికి తెలంగాణలో 13.18 శాతంగా ఉన్న పేదరికం, 2019-21 నాటికి 5.88 శాతానికి దిగివచ్చింది.
మరోవైపు తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో నిలిచింది. నిరంతరం శ్రమించి రాష్ట్రంలోని అన్నిరంగాలనూ బలోపేతం చేయడంతోపాటు, అభివృద్ధి అంటే ఏమిటో అనతికాలంలోనే దేశానికి చాటిచెప్పగలిగాం. “తెలంగాణ ఆచరిస్తున్నది-దేశం అనుసరిస్తున్నది” అన్నమాట అక్షర సత్యం. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు మన రాష్ట్ర పథకాలను అనుసరించడం, తెలంగాణలో సాగుతున్న సుపరిపాలనను తమతమ రాష్ట్రాల్లో సైతం సాగాలని అక్కడి ప్రజలు కోరుకోవడమే ప్రత్యక్ష ఉదాహరణ అని కేసీఆర్ తెలిపారు.
