CM KCR | హైదరాబాద్ : జాతీయ సమైక్యతా దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని యావత్ తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17వ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత బ్రిటిష్ పరిపాలనకు బాహ్యంగా రాజుల ఏలుబడిలో ఉన్న సంస్థానాలను భారత యూనియన్‌లో కలిపే ప్రక్రియను నాటి […]

CM KCR | హైదరాబాద్ : జాతీయ సమైక్యతా దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని యావత్ తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17వ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత బ్రిటిష్ పరిపాలనకు బాహ్యంగా రాజుల ఏలుబడిలో ఉన్న సంస్థానాలను భారత యూనియన్‌లో కలిపే ప్రక్రియను నాటి భారత ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగా మన హైదరాబాద్ సంస్థానం 1948, సెప్టెంబర్ 17వ తేదీన సువిశాల భారతదేశంలో అంతర్భాగమయిందని కేసీఆర్ తెలిపారు.
ఈ పరిణామంతో తెలంగాణలో రాచరికం ముగిసిపోయి పార్లమెంటరీ ప్రజాస్వామ్య పరిపాలన ప్రారంభమైంది. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో అంతర్భాగంగా మారిన ఈ సందర్భాన్ని జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకోవడం సముచితంగా భావించింది తెలంగాణ ప్రభుత్వం అని కేసీఆర్ పేర్కొన్నారు.
అందుకే,ఈరోజున రాష్ట్రవ్యాప్తంగా జాతీయ జెండాను ఎగురవేసి వేడుకలు నిర్వహించుకుంటున్నాం. తెలంగాణ నేలపై పలుసందర్భాలలో అనేక పోరాటాలు జరిగాయి.న్యాయం కోసం, ధర్మం కోసం,రాజ్యాంగ హక్కుల సాధన కోసం ప్రాణాలను కూడా తృణప్రాయంగా భావించి, గుండెలు ఎదురొడ్డినిలిచింది తెలంగాణ సమాజం అని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజాస్వామ్య పాలనలోకి పరివర్తన చెందాలని ఆనాడు యావత్ తెలంగాణ సమాజం ఘర్షించిందని సీఎం తెలిపారు.
ఆనాటి ప్రజా పోరాట ఘట్టాలు, సామాన్యులు అసామాన్యులైచేసిన త్యాగాలు, జాతి తలపుల్లో నిత్యం ప్రకాశిస్తూనే ఉంటాయి. దొడ్డి కొమురయ్య నుండి చాకలి ఐలమ్మ దాకా, కొమురంభీం నుండి రావి నారాయణరెడ్డి దాకా, షోయబ్ ఉల్లాఖాన్ నుండి సురవరం ప్రతాపరెడ్డి దాకా, స్వామి రామానందతీర్థ నుండి జమలాపురం కేశవరావు దాకా, బండి యాదగిరి నుండి సుద్దాల హనుమంతు, కాళోజీ, దాశరథుల దాకా ఎందరెందరో వీరయోధులూ త్యాగధనులు, చిరస్మరణీయులైన వారందరికీ నేటి జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా వినమ్రంగా నివాళులర్పిస్తున్నానని కేసీఆర్ పేర్కొన్నారు.
ఆసేతు హిమాచల పర్యంతం అన్ని ప్రాంతాల వర్గాల ప్రజల్లో విశ్వాసం నెలకొల్పడానికి ఆనాటి భారత పాలకులు చేసిన కీలకమైన కృషి వల్లనే నేడు మనం చూస్తున్న భారతదేశం ఆవిష్కృతమైంది అని కేసీఆర్ తెలిపారు. మహాత్మాగాంధీ నెలకొల్పిన సామరస్య విలువలు, భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ దార్శనికత, మొదటి హోంమంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ చాకచక్యం, మరెందరో నేతల అవిరళ కృషి వల్ల దేశం ఏకీకృతమైంది. నాటి జాతీయోద్యమనాయకుల స్ఫూర్తిదాయక కృషిని సైతం ఈ సందర్భంగా ఘనంగా స్మరించుకుందాం అని కేసీఆర్ సూచించారు.
