రేవంత్‌తో కలిసి యాత్రలో పాల్గొన్న మాణిక్‌రావు ఠాక్రే
విధాత: తమపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై చర్యలు తీసుకునేలా చూడాలని రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్ల బాధితులు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (TPCC President Revanth Reddy)కి విన్నవించారు. వారు తంగళ్లపల్లి మండలం పద్మానగర్ క్యాంపు వద్ద ఆయనను కలిశారు.
ఈ సందర్భంగా నేరెళ్ల బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. హాథ్‌సే హాథ్ జోడో (Hathse Hath Jodo) యాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి నిన్న మానకొండూరు (Manakondur) నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పాదయాత్ర చేశారు.
పలు గ్రామాల్లోని రోడ్డు పక్కన ఉన్న కిరాణం దుకాణం వారితో పాటు మహిళలు, వృద్ధులతో మాట్లాడారు. పోరాటాల చరిత్ర కలిగిన కరీంనగర్ కాంగ్రెస్ పార్టీకి అడ్డాగా మారాలని, పార్టీకి పూర్వవైభవం తీసుకు రావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
మానకొండూర్ యాత్రలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే (Manik Rao Thackeray), ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావేద్ (Nadeem Javed)లు పాల్గొన్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ (KCR)పై తమ పార్టీ పోరు కొనసాగిస్తుందని ఈ సందర్భంగా ఠాక్రే అన్నారు.
రేవంత్ పాదయాత్రకు అన్నివర్గాల నుంచి మంచి స్పందన వస్తున్నది. మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్ (Balaram Naik), మాజీ ఎంపీలు పొన్నప్రభాకర్, అంజన్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.
రేవంత్ ను కలిసిన నేరెళ్ల బాధితులు
ఇసుక అక్రమ రవాణా ను అడ్డగించినందుకు తమపై పోలీసులతో థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, కనీసం పని చేసుకునే స్థితిలో కూడా లేమంటూ బాధితులు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఇవాళ సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం లో యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్ర కొనసాగనున్నది. ఉదయం క్యాంపు వద్ద పవర్ లూమ్ వర్కర్స్, ఆసాముల సంఘం, జాపర్ సంఘాలతో రేవంత్ భేటీ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
రాత్రి సిరిసిల్ల పట్టణంలో నేతన్న చౌక్ లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించి, ఆ తరువాత వేములవాడ నియోజకవర్గంలోని రుద్రారం మండలం సంకపల్లి రాత్రి బస చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదంటూ నేరేళ్ల బాధితులు రేవంత్ కు తెలియచేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అయినా పోలీసులపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందచేశారు. న్యాయం జరిగేలా జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ను కోరాతానని రేవంత్ వారికి హామీ ఇచ్చారు.
శ్రీపాద 9వ ప్యాకేజీ కాలువను రేవంత్ రెడ్డి సందర్శించారు. అసంపూర్తిగా ఉన్న కాలువను పరిశీలించి, పనుల ఆలస్యానికి గల కారణాలపై ఇంజనీర్లకు ఫోన్ చేసి తెలుసుకున్నారు. పనులు జాప్యం కావడం మూలంగా అంచనా వ్యయం పెరిగి ప్రజలపై భారం తప్ప మరోటి ఉండదన్నారు. కాలువ పనులు సరిగా చేయడం లేదనే నెపాన్ని ప్రస్తుత కాంట్రాక్టర్ పై మోపి, మంత్రి ktr తన అనుచరులకు పనులు అప్పగించారని ఆరోపించారు.
రాయలసీమలోని కడప జిల్లా వారికి మంత్రి ktr పనులు అప్పగించి చోద్యం చూస్తున్నారన్నారు. పైసలు వచ్చే వరకు పనులు చేసి అసంపూర్తిగా వదిలేశారన్నారు. ఇక్కడి ప్రాంత రైతులకు కడప కాంట్రాక్టర్ కు ప్రేమ లేదని, వారిని మంత్రి మందలించడం లేదన్నారు. కమీషన్ల కోసం రైతులకు తీరని అన్యాయం చేశారని, తక్షణమే 9వ ప్యాకేజీ పనులు పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.