Tuesday, January 31, 2023
More
  Homelatestబ‌ర్రెలు అడ్డు వ‌చ్చాయ‌ని.. క‌లెక్ట‌ర్ ఆగ్ర‌హం.. కాప‌రికి భారీ ఫైన్‌

  బ‌ర్రెలు అడ్డు వ‌చ్చాయ‌ని.. క‌లెక్ట‌ర్ ఆగ్ర‌హం.. కాప‌రికి భారీ ఫైన్‌

  • న‌ల్లా క‌లెక్ష‌న్ తొల‌గింపు
  • హరిత‌హారం మొక్క‌లు తిన్నాయ‌ని ఆరోప‌ణ‌
  • బ‌తిమ‌లాడినా క‌నిక‌రించ‌ని వైనం
  • ములుగు జిల్లాలో ఘటన

  విధాత, వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక ప్రతినిధి: సాధారణంగా కిందిస్థాయి అధికారులు ఏదైనా పొరపాటు చేస్తే తన దృష్టికి తెచ్చినప్పుడు కొంత సానుభూతితో స్పందించి జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకుంటారు. కిందిస్థాయి అధికారులెవరైనా ఆగ్ర‌హానికి గుర‌యితే జిల్లా కలెక్టర్‌గా, ఐఏఎస్ అధికారి కృష్ణ ఆదిత్య కూడా స్పందించేవారేమో!? కానీ ఇక్కడ ఆయనే ఆగ్రహానికి లోనయ్యారు. మ‌రి ఆయ‌న‌ని శాంత‌ప‌రిచేదెవ‌రు..? ఆగ్ర‌హానికి కార‌ణ‌మైన వారి ప‌రిస్థితి ఏమిటి?

  జిల్లా అత్యున్నతాధికారి స్వయంగా ఆదేశించడంతో వీఆర్వో, ఎండీవోలు రంగంలోకి దిగి బర్ల కాపరికి (కాపరి నిర్లక్ష్యం ఉండొచ్చు)రూ. 7500 ఫైన్ విధించిన ఘటన చర్చనీయాంశంగా మారింది. జిల్లా కలెక్టర్ కంటే పెద్ద అధికారి ఇక్కడ లేకపోవడంతో ఎవ‌రికి చెప్పాలో తెలియ‌క బాధితుడు లబోదిబోమంటున్నాడు. ఫైన్ ఒక్కటే కాకుండా తన ఇంటి నల్లా నీటి కనెక్షన్ కట్ చేశారు. ములుగు జిల్లాలో జరిగిన తాజా సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

  ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అధికారిక పర్యటనలో భాగంగా కారులో వెళ్లుతున్నారు. మంగపేట మండలం గంపోనిగూడెం పరిసరాల్లోని ప్రధాన రహదారి పై వెళుతున్న కలెక్టర్ కారుకు అదే రోడ్డు మీద బర్రెల మంద ఎదురైందీ.

  బర్రెలుగాసే బోయిని యాకయ్య ఫోన్‌ మాట్లాడుతూ పట్టించుకోకుండా వెళ్తున్నాడు. హారన్ కొట్టినా స్పందించలేదు. ఆ బర్రెల‌కు ఏమి తెలుసు… అటుగా వెళ్ళేది కలెక్టర్ కారని… ప‌క్క‌కి జ‌ర‌గాల‌ని.. కలెక్టర్ కారైనా… కామన్ మెన్ కారైనా ఒక్కటే అన్నట్లు నిదానంగా నడుస్తూ వెళ్తున్నాయి. దీంతో కలెక్టర్‌కు కోపం వచ్చింది. బర్రెల కాపరి తీరుపై గట్టిగా మండిపడ్డారు.

  కింది అధికారులకు ఆదేశం

  కాపరి నిర్లక్ష్యంగా జవాబు చెప్పడంతో అక్కడికక్కడే కింది అధికారులకు ఫోన్ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు ఆ పశువుల కాపరిపై చర్యలకు ఉపక్రమించారు.

  బర్రెలు హరితహారంలో నాటిన మొక్కలను నాశనం చేస్తున్నాయనే నెపంతో రూ.7,500 జరిమానా విధించారు. లేదంటే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. చేసేదేమీ లేక భయంతో ఆ కాపరి జరిమానా చెల్లించాడు.

  బ్రతిమాలినా పట్టించుకోలేదు: బర్రెల కాపరి బోయిని యాకయ్య

  కారును చూసి బర్రెల‌ను పక్కకు కొడుతుండగా ఎదురుగా లారీ వచ్చిందని చెబుతున్నారు. కారులో ఉన్నది కలెక్టర్ అని తెలవగానే బ్రతిమిలాడినట్లు వివరించారు. ఫైన్ వేసినప్పుడు కూడా వద్దని, పొరపాటైందని పేదోన్ని, బర్లు గాసుకుని బతికెటోన్నని అధికారులకు విన్నవించినా ప‌ట్టించుకోకుండా నిర్ధాక్షిణ్యంగా రూ.7500 ఫైన్ వేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ఫైన్ కట్టకుంటే జైలుకు పోతావని బెదించారని చెప్పారు.

  ఈ ఘటన వెలుగులోకి వచ్చి సర్వత్రా చర్చనీయాంశ‌మ‌వుతోంది. క‌లెక్ట‌ర్ తీరుపై ప‌లువురు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఇలాంటి సంఘటనల్లో ఉన్నతస్థాయి వ్యక్తులు మందలించడానికే పరిమితమైతే హుందాగా ఉండేదంటున్నారు.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular