విధాత, మెదక్ బ్యూరో: గ్రామాలలో పర్యటించి స్వయంగా కేంద్ర,రాష్ట్ర, ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్ర స్థాయిలో అమలుపై అవగాహన పెంచుకోండి అని భవిష్యత్తులో యువ ఇండియన్ సర్వీసెస్ అధికారులకు ఉపయోగ పడుతుందనీ జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah) హితబోధ చేశారు.
క్షేత్ర స్థాయిలో పర్యటనలు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలతో మమేకం కావడం ద్వారా ఎంతో విలువైన సమాచారం లభిస్తుందని, మంచి అనుభవం వస్తుందని, ఇది ప్రాజెక్ట్ వర్క్‌కు ఎంతో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
ప్రాజెక్ట్ వర్క్‌లో భాగంగా శనివారం మర్రి చెన్నా రెడ్డి మానవ వనరుల కేంద్రం నుండి వారం రోజుల పాటు వివిధ అంశాలపై అధ్యయనం చేయుటకు వచ్చిన 20 మంది ఇండియన్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సర్వీసెస్ అధికారులకు సూచించారు.
ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్‌లో విధులు నిర్వహిస్తున్న 2020, 2021, 2022, 2023 బ్యాచ్‌లకు చెందిన 20 మంది ఇండియన్ సర్వీసెస్ అధికారులు జిల్లాలో ఈ నెల 4 నుంచి 10 వరకు నిర్దేశించిన గ్రామాల్లో విడిది చేసి అక్కడ అమలు జరుగుచున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పధకాలను నిశితంగా పరిశీలించి గ్రామస్థులతో ముఖాముఖి అవుతారు.
ఒక్కో బ్యాచ్ లో 5 మంది అధికారుల చొప్పున జిల్లాలో ఎంపిక చేసిన నార్సింగి మండలం వల్లూరు, తూప్రాన్ మండల మల్కాపూర్, ఇస్లాంపూర్, శివంపేట మండలం ఏదులాపుర్ గ్రామాలలో వారం రోజుల పాటు బస చేసి అక్కడి పరిస్థితులను, కార్యక్రమాలను అధ్యయనం చేస్తారు.
ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్‌తో కలిసి కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. మెదక్ జిల్లా వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, ఇక్కడి ప్రజలు చాలా సౌమ్యులని వారితో మమేకమై ప్రజల జీవనస్థితిగతులు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు వాటి సద్వినియోగం వంటి సమాచారంతో పాటు, గ్రామ పంచాయతీ, అంగన్వాడీ, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వంటి ప్రజోపయోగ సంస్థలు సందర్శించి పనితీరును అధ్యయనం చేయాలని సూచించారు.
పల్లెల అభివృద్ధిని కాంక్షించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామ పంచాయతీలో వైకుంఠధామాలు, సేగ్రిగేషన్ షెడ్లు, నర్సరీలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు , తెలంగాణకు క్రీడా ప్రాంగణాలు, నర్సరీలు వంటి ఏర్పాటుతో పాటు ట్రాక్టర్,ట్రాలీ, డోజర్ల వంటిని అందించిందని అధికారులకు తెలిపారు.
అదేవిధంగా పారదర్శకంగా భూముల రిజిస్ట్రేషన్ కు సంబంధించి ధరణి పోర్టల్ ఏర్పాటు చేసిందని, రైతు బందు, రైతు భీమా, ఆసరా పింఛన్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, కె.సి.ఆర్. కిట్, కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరిత హారం, మన ఊరు మన బడి, కంటి వెలుగు వంటి ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టి పటిష్టవంతంగా అమలు చేస్తున్నదని, గ్రామా స్థాయిలో వాటి ఫలాలు తెలుసుకోవాలని అన్నారు.
తూప్రాన్ మండలంలోని మల్కాపూర్ గ్రామం రాష్ట్ర, జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుందని, అక్కడి యువత ప్రతి ఆదివారం శ్రమదానం చేస్తారని, వీలయితే బృందం శ్రమదానంలో పాల్గొనాలని సూచించారు.
అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఉపాధి హామీ, ప్రధాన మంత్రి కిసాన్ యోజన, మిడ్ డే మీల్స్, జన్ ధన్ యోజన, సుకన్య సమృద్ధి యోజన వంటి పధకాలను పరిశీలించాలన్నారు. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాలు మహిళలు నిర్వహిస్తున్న కార్యకలాపాలను అధ్యయనం చేయాలన్నారు.
మీకు ఏ సమా చారం కావాలన్న, ముఖాముఖి కలవాలనుకున్నా, మీకు కేటాయించిన లయజన్ అధికారైన మండల పరిషద్ అభివృద్ధి అధికారిని గానీ, పంచాయతీ కార్యదర్శిని సంప్రదిస్తే సమకూరుస్తారని కలెక్టర్ తెలిపారు. ఈ వారం రోజులలో అధ్యయనం చేసి పరిశీలించిన అంశాలతో పాటు ఇంకా మెరుగుపరచడానికి సలహాలు, సూచనలు ఇవ్వవలసినదిగా ఇండియన్ సర్వీసెస్ అధికారులకు సూచించారు.
తెలుగు సంస్కృతి, సంప్రదాయ ఆటపాటలైనా బతుకమ్మ, బోనాలు వంటి ప్రదర్శన ఏర్పాటుతో పాటు తెలుగు వంటకాల రుచిని ఇండియన్ సర్వీసెస్ అధికారులకు చూపించవలసినదిగా లయజన్ అధికారులకు సూచించారు. మెదక్ జిల్లాలో ప్రసిద్ధ ప్రాంతాలైన ఏడుపాయల, చర్చి, ఖిల్లా, నరసాపూర్ అర్బన్ పార్క్ ను తిలకించవలసినదిగా ఇండియన్ సర్వీస్ అధికారులకు సూచించారు.
అంతకుముందు జిల్లా సమగ్ర సమాచారం, స్థితిగతులపై డిఆర్ డిఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ డిఓ శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబ, మండల పరిషద్ అధికారులు, మానవ వనరుల అభివృద్ కేంద్ర ప్రాంతీయ శిక్షణా మేనేజర్ బాలయ్య తదితరులు పాల్గొన్నారు.