Saturday, January 28, 2023
More
  Homelatestవరంగల్ తూర్పులో 'రంగుల' రాజకీయం

  వరంగల్ తూర్పులో ‘రంగుల’ రాజకీయం

  • BJP పోస్టర్లపై కార్పొరేషన్ కలర్
  • BRS BJP మధ్య ఉప్పూనిప్పూ..

  విధాత, వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ జిల్లా కేంద్రమైన వరంగల్ తూర్పు అసెంబ్లీ సెగ్మెంట్లో ‘రంగుల’ రాజకీయం తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్ సిట్టింగు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కు బిజెపి నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు పోటాపోటీ రాజకీయాలు చేస్తున్నారు.

  ఈ క్రమంలో మంగళవారం బీజేపీ పోస్టర్ల పై ‘రంగు’ వేసిన సంఘటన అగ్నికి ఆజ్యం పోసినట్లు తోడైంది. ఎవరికివారు ఆధిపత్యం కోసం,తూర్పులో పట్టు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. రెండు అధికార పార్టీలు నువ్వా నేనా అన్నట్లు పోటాపోటీగా ముందుకు సాగుతున్నాయి. బిఆర్ఎస్, బిజెపి నాయకులు ఒకరికొకరు పరస్పరం పోటీ పడుతూ తూర్పులో రాజకీయ వేడిని రగిలిస్తున్నారు.

  భారీ సైజు పోస్టర్లు వేసిన బిజెపి

  బిజెపి పోస్టర్లపై రంగులు వేసిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల కాలం లో తూర్పులో తన పట్టును పెంచుకునేందుకు ఎర్రబెల్లి ప్రదీప్ రావు ప్రధాని మోడీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర నేత ఈటెల రాజేందర్‌తోపాటు ప్రదీప్‌రావు తన ఫోటోలతో భారీ సైజులో మిగిలిన నాయకుల ఫోటోలతో పోస్టర్లను వరంగల్ తూర్పు నియోజకవర్గ వ్యాప్తంగా వేశారు.

  ఈ పోస్టర్లో బీజేపీలో చేరండి, దేశ భద్రతను కాపాడండి, ఒక టోల్‌ఫ్రీ సెల్‌నెంబర్‌ను ఇచ్చారు. తూర్పు నియోజకవర్గంలో ప్రచారాన్ని చేపట్టారు. ప్రతి సెంటర్లో వేసిన ఈ భారీ సైజు పోస్టర్లు ఆకర్షణీయంగా కనిపించడం అధికార పార్టీకి గిట్టనట్లుందీ. తన ఇలాఖాలో మరొక పార్టీ పెత్తనమేందని నాయకులు భావించినట్లుంది.

  రంగులేసిన పారిశుద్ధ్య కార్మికులు

  బిజెపి పోస్టర్లు కలవరపెట్టడంతో రంగంలోకి దిగిన అధికార పార్టీ నాయకులు తమ చేతులు కాల్చుకోవడం ఎందుకని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందిని పురమాయించారు. అధికార పార్టీ నేతల ఆదేశాలతో రంగంలోకి దిగిన పారిశుధ్య కార్మికులు తెల్లవారకముందే రంగుల డబ్బాలతో ప్రత్యక్షమయ్యారు. ప్రదీప్ రావు వేసిన పోస్టర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని గుర్తించి, వాటిపై రంగులు వేసే కార్యక్రమాన్ని మంగళవారం చేపట్టారు.

  కార్మికులకు బీజేపీ లీడర్ బెదిరింపులు

  తమ పోస్టర్లపై రంగులు వేస్తున్న విషయాన్ని తెలుసుకున్న బిజెపి నాయకులు రంగులు వేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల ఫోటోలు, రంగు డబ్బాలు, రంగులు వేసిన పోస్టర్లు ఫోటో తీసి బి ఆర్ ఎస్ నాయకులను విమర్శిస్తూ ప్రచారం చేపట్టారు.

  ఈ సమయంలోనే ప్రదీప్ రావు అనుచరుడు, బిజెపి చోటా లీడర్ ఒకరు రంగులు వేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు బాధ్యునిగా ఉన్న జవాన్ కు ఫోన్ చేసి వివరాలు కనుక్కోవడమే కాకుండా, తనని బెదిరించే ప్రయత్నం చేశారు.

  తమ పోస్టర్లపై రంగులు వేసిన మీ నలుగురి ఉద్యోగాలు ఊడుతాయంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీనికి ప్రతిస్పందిస్తూ జవాన్ తమ ఉన్నతాధికారి ఆదేశాల మేరకే ఈ రంగులు వేసే కార్యక్రమాన్ని తమ సిబ్బంది చేపట్టినట్లు వివరించే ప్రయత్నం చేపట్టాడు. తమ అధికారితో మాట్లాడుకోవాలని చెప్పినా వినకుండా ఒక విధంగా ఆయనను బెదిరించారు.

  ఈ మొత్తం ఎపిసోడ్ తూర్పులో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక నన్నపనేని నరేందర్ హస్తము ఉందనేది బిజెపి నాయకుల ఆరోపణ. ఏదైనా ఉంటే రాజకీయంగా చూసుకోవాలి తప్ప, పోస్టర్లపై రంగులు వేసి చీపు ట్రిక్స్ వల్ల జనాన్ని గెలుచుకోలేరని హెచ్చరించారు. ఇలాంటి సంఘటనలకు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నారు.

  ఏమలుపు తీసుకుంటుందో?

  ఈ పోస్టర్ల రంగుల రాజకీయం ఏ మలుపు తీసుకుంటుందోనని చర్చ సాగుతోంది. వాస్తవానికి గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ చట్టం మేరకు పబ్లిక్ ప్లేసులలో ఇష్టానుసారంగా గోడ రాతలు కానీ, పోస్టర్లు కానీ వేయకూడదు. ఈ కారణాన్ని చూపెట్టి మునిసిపల్ కార్మికులు వాటిపై రంగులు వేసినట్టు సమర్ధించుకునేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ దీని వెనుక రాజకీయ దురుద్దేశమే ప్రధానమని పేర్కొంటున్నారు.

  తమ అనుచరుల ఇళ్ల వద్ద వేసిన వాటికి కూడా రంగులు పూయడమేంటంటూ బిజెపి నాయకులు వేస్తున్న ప్రశ్నకు మున్సిపల్ సిబ్బంది నుంచి సరైన జవాబు లేదు. ఇతర పార్టీల, వ్యాపార సంస్థల పోస్టర్లను తొలగించకుండా, వాటిపై రంగులు వేయకుండా, కేవలం ఎర్రబెల్లి ప్రదీప్ రావు వేసిన పోస్టర్లపై మాత్రమే రంగులు వేయడంతో బీజేపీ ఆరోపణలకు ఊతం లభిస్తుంది. కాగా, కార్పోరేషన్ చేపట్టిన చర్యలను తమకు ఆపాదించడమేమిటని నరేందర్ వర్గం అంటుందీ.

  నరేందర్ వర్సెస్ ప్రదీప్‌రావు

  వరంగల్ తూర్పు టిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే నరేందర్‌కు ఇటీవల బి ఆర్ ఎస్ కు రాజీనామా చేసి బిజెపిలో చేరిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేస్థితి నెలకొంది. బీఆర్ఎస్ పార్టీలో ఉండగానే నన్నపనేని వ్యతిరేక గ్రూప్లో ప్రదీప్ రావు కీలకపాత్ర నిర్వహించారు.

  ఇప్పుడు బిజెపిలో చేరి ప్రత్యర్థిగా మారారు. వాస్తవానికి ప్రదీప్‌రావు బిజెపిలో చేరేంతవరకు ఒక విధంగా నియోజకవర్గంలో రాజకీయ ప్రశాంత వాతావరణమే నెలకొన్నది. అయితే తన పట్టు నిలబెట్టుకునేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే నరేందర్, ప్రజల్లో తన పలుకుబడిని పెంచుకునేందుకు బిజెపి నాయకుడు ప్రదీప్ రావు చేస్తున్న కార్యక్రమాలతో నియోజకవర్గంలో రాజకీయ అలజడి నెలకొందని చెప్పవచ్చు.

  ఒక విధంగా ఒకరంటే ఒకరు గిట్టని స్థితికి చేరుకొని ఎవరు ఎక్కడ దొరుకుతారా? విరుచుకపడాలని ప్రయత్ని స్తున్నారు. దీనివల్ల ఇటీవల డివిజన్ స్థాయిలో తూర్పు ప్రజల మధ్య కూడా విభేదాలు పెరిగిపోతున్నాయి.

  ఏ చిన్న అంశం చేతికి చిక్కినా పరస్పరం విమర్శలు చేసుకుంటూ ఉద్రిక్తత స్థితికి చేరుకుంటున్నాయి. ఈ పరిస్థితి ఎటు దారి తీస్తుందోనని పలువురు ఆందోళన చెందుతున్నారు.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular