Comet Nishimura | విధాత: మనం బతికుండగా ఒక సారి మాత్రమే చూడగలిగే అద్భుతాలు కొన్ని ఉంటాయి. వాటిని మనం అనుభూతి చెందకపోతే ఇక మళ్లీ చూడటం అసాధ్యం. అలాంటి ఒక ఘటన ఈ నెల 12 సూర్యోదయానికి కాస్త ముందుగా రానుంది. నిషిమురా అనే తోకచుక్క (Comet) తన గమనంలో భాగంగా ఆ రోజున భూమికి అత్యంత దగ్గరగా రానుంది. దీనిని మానవ కన్నుతోనే చూడొచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ నిషిమురా తోకచుక్క గంటకు ఏకంగా […]

Comet Nishimura |
విధాత: మనం బతికుండగా ఒక సారి మాత్రమే చూడగలిగే అద్భుతాలు కొన్ని ఉంటాయి. వాటిని మనం అనుభూతి చెందకపోతే ఇక మళ్లీ చూడటం అసాధ్యం. అలాంటి ఒక ఘటన ఈ నెల 12 సూర్యోదయానికి కాస్త ముందుగా రానుంది. నిషిమురా అనే తోకచుక్క (Comet) తన గమనంలో భాగంగా ఆ రోజున భూమికి అత్యంత దగ్గరగా రానుంది. దీనిని మానవ కన్నుతోనే చూడొచ్చని పరిశోధకులు పేర్కొన్నారు.
ఈ నిషిమురా తోకచుక్క గంటకు ఏకంగా 3,86,000 కి.మీ. వేగంతో ప్రయాణిస్తోంది. కాంతి కాలుష్యం లేని.. కొన్ని ప్రాంతాల నుంచి ఇప్పటికే ఈ తోక చుక్క కనిపిస్తోందని యూనివర్సిటీ ఆఫ్ హల్ ప్రొఫెసర్ బ్రాడ్ గిబ్సన్ వెల్లడించారు. సూర్యోదయానికి గంట ముందు గంట తర్వాత ఈ ఖగోళ అద్భుతం కనపడుతుందని ఆయన తెలిపారు. ఈశాన్యం వైపు తిరిగి చందమామ, శుక్ర గ్రహాల మధ్యలో చూడాలని సూచించారు.
ఈ తోక చుక్క గురించి ఆయన వివరిస్తూ.. నిషిమురా ప్రతి 500 ఏళ్లకు ఒక సారి భూమి దగ్గరకు వస్తుంది. అందుకే ఇది ఖగోళ అద్భుతం (Space Miracle). గత నాలుగు వందల ఏళ్లలో ఎవరూ చూడలేని దానిని మనం చూడొచ్చు. ఎంత దగ్గరగా వచ్చినా దానికి మనకు మధ్య దూరం సుమారు కోటీ 25 లక్షల కి.మీ. ఉంటుంది. అని పేర్కొన్నారు.
ఇదీ నిషిమురా కథ
ఈ ఏడాది ఆగస్టు వరకు అసలు ఇలాంటి తోకచుక్క ఉందనే విషయమే మన శాస్త్రవేత్తలకు తెలియదు. ఆ నెల 11 వ తేదిన నిశితంగా ఆకాశాన్ని గమనిస్తూ జపాన్‌కు చెందిన ఆస్ట్రో ఫొటోగ్రాఫర్ హిడియో నిషిమురా పలు ఫొటోలను తీశారు. వాటిని పరిశీలించగా ఒక తోకచుక్క భూమి వైపు వస్తున్నట్లు గమనించారు. దీంతో శాస్త్రవేత్తలు దానిపై పరిశోధనలు జరిపి వివరాలు తెలుసుకున్నారు.
మానవాళికి ఈ అద్భుతం గురించి చెప్పిన నిషిమురా పేరునే దానికీ పెట్టారు. సెప్టెంబరు 12న ఇది భూమికి దగ్గరగా ప్రయాణించి.. 17వ తేదీ నాటికి సూర్యునికి అత్యంత దగ్గరగా వెళుతుంది. ఆ వేడికి ఇది పేలిపోయి నాశనమవుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికీ దీని పరిమాణంపై నిర్దిష్ట సమాచారం లేదు. కొన్ని వందల కి.మీ. పొడవుతో కొన్ని కి.మీ. వ్యాసార్థంతో ఉండొచ్చని భావిస్తున్నారు.
