విధాత‌: భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) ఆవిర్భావం తరువాత రాజకీయ సమీకరణలు మారిపోయాయి. నిన్న మొన్నటివరకు ఆంధ్రా పార్టీగా ముద్రపడిన తెలుగుదేశం (టిడిపి)కి అడ్డంకులు తొలగిపోయాయి. ఇక క్షణం ఆలోచించకుండా టిడిపి జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడు తెలంగాణలో తిరిగి పార్టీకి పూర్వవైభవం తెచ్చే ప్రయత్నం మొదలుపెట్టాడు. ఇంకేముంది ఖమ్మంలోనే తొలి బహిరంగ సభ నిర్వహించి తమ పార్టీకి ప్రజల్లో ఆదరణ చెక్కుచెదరలేదని నిరూపించాడు. బాబు ర్యాలీకి హాజరైన ప్రజలు, బహిరంగ సభకు వచ్చిన జనాన్ని చూసిన […]

విధాత‌: భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) ఆవిర్భావం తరువాత రాజకీయ సమీకరణలు మారిపోయాయి. నిన్న మొన్నటివరకు ఆంధ్రా పార్టీగా ముద్రపడిన తెలుగుదేశం (టిడిపి)కి అడ్డంకులు తొలగిపోయాయి. ఇక క్షణం ఆలోచించకుండా టిడిపి జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడు తెలంగాణలో తిరిగి పార్టీకి పూర్వవైభవం తెచ్చే ప్రయత్నం మొదలుపెట్టాడు. ఇంకేముంది ఖమ్మంలోనే తొలి బహిరంగ సభ నిర్వహించి తమ పార్టీకి ప్రజల్లో ఆదరణ చెక్కుచెదరలేదని నిరూపించాడు. బాబు ర్యాలీకి హాజరైన ప్రజలు, బహిరంగ సభకు వచ్చిన జనాన్ని చూసిన బిఆర్ఎస్ నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ ఖమ్మం జిల్లాపై దృష్టి సారించక తప్పలేదు. పనిలో పనిగా కమ్యూనిస్టులు ఇంటిని చక్కదిద్దుకునే పనికి శ్రీకారం చుట్టారు.

గత నాలుగేళ్లుగా పార్టీకి దూరంగా ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును మళ్లీ బుజ్జగించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నల్లగొండ జిల్లా మునుగోడు నియోజక వర్గంలో బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపులో ఉభయ కమ్యూనిస్టులు కీలక భూమిక పోషించారు. రెండు పార్టీల మద్దతుతో బిఆర్ఎస్ అభ్యర్థి బయటపడ్డాడు. అప్పుడే కమ్యూనిస్టులు తమ సీట్లను ఖరారు చేసుకునే పనిలో పడ్డారు. ఖమ్మంతో పాటు నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో కమ్యూనిస్టు నాయకులు పాత సీట్లను దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఖమ్మం జిల్లాలో ఆరు నియోజకవర్గాలపై కన్నేశారు. కొత్తగూడెం, వైరా, భద్రాచలం, పాలేరు, ఇల్లందుతో పాటు మధిర నియోజకవర్గాల కోసం పట్టుబట్టనున్నారు.

పాలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన కందాల ఉపేందర్ రెడ్డి బిఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సీటు కోసం తుమ్మల నాగేశ్వర్ రావు కాచుకు కూర్చున్నారు. మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిజెపి చేరతారనే ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో తనకు సీటు తథ్యమనే ధీమాలో నాగేశ్వర్ రావు ఉండగా, సిట్టింగ్ ఎమ్మెల్యేగా మరోమారు అవకాశం ఉంటుందని ఉపేందర్ ధీమాతో ఉన్నారు. వీరిద్దరిని కాదని తమకే కేటాయించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరుతున్నారు. పాలేరు నుంచి పోటీ చేయడం ఖాయమని ఆయన పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు.

ఇక కొత్తగూడెం సీటుపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివ రావు ఆశలు పెట్టుకున్నారు. ఈ నియోజకవర్గం నుంచి బిఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన కూడా కాంగ్రెస్ నుంచి గెలుపొంది ఆ తరువాత బిఆర్ఎస్ లో చేరారు. పొత్తులో భాగంగా తమకు కేటాయించాలని సిపిఐ కోరనున్నది.

వైరా నియోజకవర్గం నుంచి లావుడ్యా రాములు, ఇల్లందు నుంచి హరిప్రియా నాయక్ లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భద్రాచలం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పొడెం వీరయ్య, మధిర నుంచి మల్లు భట్టి విక్రమార్క గెలుపొంది అదే పార్టీలో కొనసాగుతున్నారు. ఈ రెండు స్థానాల నుంచి పోటీ చేసేందుకు కమ్యూనిస్టులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అదే జరిగితే బిఆర్ఎస్ నాయకుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముంది. మధిర నుంచి జిల్లా పరిషత్ ఛైర్మన్ లింగాల కమల్ రాజ్, బొమ్మెర రామ్మూర్తి పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు.

భద్రాచలం సీటు కోసం తెల్లం వెంకట్రావు, బోదెపొయిన పిచ్చయ్య, మానె రామకష్ణారావు లు ఎదురుచూస్తున్నారు. ఇల్లందు నియోజకవర్గం కోసం సిపిఐ పట్టుబడితే హరిప్రియా నాయక్ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారనున్నది. వీరే కాకుండా బిఆర్ఎస్ నాయకులైన మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్, బానోత్ చంద్రావతి కూడా తమ భవిష్యత్తుపై ఇప్పటి నుంచే ఆలోచనలు మొదలుపెట్టే అవకాశం ఉంది. కమ్యూనిస్టుల రాకతో బిఆర్ఎస్ ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఆశావహులు టెన్షన్ కు లోనవుతున్నారు. తమ సీటు పదిలంగా ఉంటుందా లేదా అనే గందరగోళంలో ఉన్నారు.

Updated On 14 Jan 2023 1:24 AM GMT
krs

krs

Next Story