విధాత: కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఫిరాయించి బీఆర్‌ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలపై మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో కాంగ్రెస్‌ నేతలు ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు తిరిగి చట్టసభలకు రాకుండా కాంగ్రెస్‌ న్యాయ పోరాటం చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. 18 ఎమ్మెల్యేల్లో 12 మంది బీఆర్‌ఎస్‌లో చేరుతూ కాంగ్రెస్‌ విలీనం లేఖ ఇచ్చారు. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదు చేసినా స్పీకర్‌ పట్టించుకోలేదు. 2018లో బీఆర్‌ఎస్‌ తరఫున 88 ఎమ్మెల్యేలు గెలిచారు. పాలనపై దృష్టి […]

విధాత: కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఫిరాయించి బీఆర్‌ఎస్‌లో చేరిన 12 మంది ఎమ్మెల్యేలపై మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో కాంగ్రెస్‌ నేతలు ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు తిరిగి చట్టసభలకు రాకుండా కాంగ్రెస్‌ న్యాయ పోరాటం చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. 18 ఎమ్మెల్యేల్లో 12 మంది బీఆర్‌ఎస్‌లో చేరుతూ కాంగ్రెస్‌ విలీనం లేఖ ఇచ్చారు. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదు చేసినా స్పీకర్‌ పట్టించుకోలేదు.

2018లో బీఆర్‌ఎస్‌ తరఫున 88 ఎమ్మెల్యేలు గెలిచారు. పాలనపై దృష్టి సారించాల్సిన కేసీఆర్‌ ఫిరాయింపులను ప్రోత్సహించారని, అందులో సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి ఇచ్చి, మిగిలిన వారికి లంచాలు ఇచ్చి బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారని రేవంత్‌ ఆరోపించారు. తమ ఎమ్మెల్యేలు సత్యహరిచంద్రులని కేసీఆర్‌ మీడియా సమావేశంలో చెప్పారు.

ఆయన మాత్రం ప్రమాణాన్ని ఉల్లంఘించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రశ్నించకుండా కేసీఆర్‌ కుట్ర చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేశామని, లబ్ధి పొందిన అంశాలను కూడా సీబీఐకి బదిలీ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. దీనిపై సీబీఐ వెంటనే విచారణ చేపట్టాలని, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సీబీఐ, ఈడీకీ ఫిర్యాదు చేస్తామన్నారు.

బీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్‌ పార్టీ చర్యలు తీసుకోవాలని మూడున్నరేళ్ల తర్వాత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నాడు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్‌ గాని, ఇంకా రేవంత్‌పై ఒంటి కాలిపై లేచే నేతలు నాడు ఈ పని చేసి ఉంటే కనీసం సగం మంది ఎమ్మెల్యేలు అయినా వెనక్కి తగ్గే వారు.

అంతేకాదు కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచినా వాళ్లంతా బీఆర్‌ఎస్‌లో చేరుతారనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లింది. ఫలితంగానే బీజేపీకి కొంత ఆదరణ పెరిగింది అంతే గానీ ఆ పార్టీకి సంస్థాగతంగా పెద్దగా బలమేమీ లేదు. కేసీఆర్‌ ప్రభుత్వంపై గట్టిగా కొట్లాడగలరు, అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయగలరు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టరనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించగలిగి ఉంటే పార్టీ పరిస్థితి ప్రస్తుతం ఇలా ఉండేది కాదని సాధారణ కాంగ్రెస్‌ కార్యకర్తలు చెబుతున్నారు.

అయితే ఇప్పటికైనా అలసత్వాన్ని వీడినందుకు వాళ్లు కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వాన్ని అభినందిస్తున్నారు. ఇదే స్ఫూర్తితో పనిచేసుకుంటూ వెళ్తే రానున్న రోజుల్లో పార్టీకి పూర్వ వైభవం వస్తుంది అంటున్నారు. ప్రజల ఆదరణతో 2024లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. అదే టీఆర్‌ఎస్‌ నుంచి లేదా కాంగ్రెస్‌ పార్టీ నుంచి బీజేపీలో చేరిన నేతలు వాళ్ల పార్టీ అధిష్ఠానంపై బహిరంగ విమర్శలు గాని, తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఎక్కడైనా ప్రస్తావిస్తున్నారా? అలా చేసినా వాళ్లను పట్టించుకునే వారు ఉన్నారా? అని కొందరు నేతలు గుర్తు చేస్తున్నారు.

పార్టీ ఇచ్చిన స్వేచ్ఛను పార్టీ పటిష్టత కోసం ఉపయోగించి ఉంటే ఇవాళ బీఆర్‌ఎస్‌, బీజేపీ ఆటలు సాగేవా? అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఇప్పుడు చూపిస్తున్న ఐక్యతను ఇక ముందు కూడా కొనసాగించాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. విభేదాలు పక్కన పెట్టి పార్టీని అధికారంలోకి తేవడానికి రానున్న రోజులు చాలా కీలకమంటున్నారు. నేతలు ముందుంటే వాళ్ల వెంట నడవడానికి తాము సిద్ధంగా ఉన్నామని కార్యకర్తలు అంటున్నారు.

Updated On 6 Jan 2023 5:07 PM GMT
krs

krs

Next Story