Congress | షర్మిల పార్టీ విలీనంపై సందిగ్థత విధాత: సెప్టెంబర్‌ 17న కాంగ్రెస్‌ పార్టీ హైద్రాబాద్‌లో నిర్వహించనున్న సోనియాగాంధీ బహిరంగ సభలో పార్టీ తీర్దం పుచ్చుకునేందుకు వలస నేతలు క్యూ కడుతున్నారు. 16,17తేదీలలో సీడబ్ల్యుసీ సమావేశాల నిర్వాహణ, సోనియాగాంధీ సభతో కాంగ్రెస్‌లో కదనోత్సాహం కనిపిస్తుంది. రాష్ట్ర రాజకీయాలలో బీఆరెస్‌ను గద్దె దించాలంటే కాంగ్రెస్‌తో నే సాధ్యమని భావిస్తున్న బీఆరెస్‌, బీజేపీ సహా ఇతర పార్టీల నాయకులు, బీఆరెస్‌లో టికెట్లు దొరకని ఆశావహులు, మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్‌లో చేరేందుకు […]

Congress |

  • షర్మిల పార్టీ విలీనంపై సందిగ్థత

విధాత: సెప్టెంబర్‌ 17న కాంగ్రెస్‌ పార్టీ హైద్రాబాద్‌లో నిర్వహించనున్న సోనియాగాంధీ బహిరంగ సభలో పార్టీ తీర్దం పుచ్చుకునేందుకు వలస నేతలు క్యూ కడుతున్నారు. 16,17తేదీలలో సీడబ్ల్యుసీ సమావేశాల నిర్వాహణ, సోనియాగాంధీ సభతో కాంగ్రెస్‌లో కదనోత్సాహం కనిపిస్తుంది.

రాష్ట్ర రాజకీయాలలో బీఆరెస్‌ను గద్దె దించాలంటే కాంగ్రెస్‌తో నే సాధ్యమని భావిస్తున్న బీఆరెస్‌, బీజేపీ సహా ఇతర పార్టీల నాయకులు, బీఆరెస్‌లో టికెట్లు దొరకని ఆశావహులు, మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్‌లో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

ఇప్పటికే ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మహాబూబ్‌ నగర్‌కు చెందిన జూపల్లి కృష్ణారావు, ఖమ్మం డీసీసీబీ చైర్మన్‌ మువ్వా విజయ్‌బాబు, కూచుమళ్ల రాజశేఖర్‌రెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్‌, గద్వాల జడ్పీ చైర్‌ పర్సన్‌ సరిత, భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ చైర్మన్‌ కోరెం కనకయ్య, వంటి వారు కాంగ్రెస్‌లో చేరారు.

సెప్టెంబర్‌ 17న పార్టీలో చేరేందుకు ఖమ్మంకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సిద్ధమవుతున్నారు. అలాగే మల్కాజిగిరికి చెందిన బీఆరెస్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు రోహిత్‌లు పార్టీలో చేరుతారని సమాచారం. మహబూబ్‌నగర్‌కు చెందిన బీజేపీ మాజీ నేత యెన్నం శ్రీనివాస్‌రెడ్డి కూడా అదే రోజు కాంగ్రెస్‌లో చేరుతారని తెలుస్తుంది.

స్టేషన్‌ ఘనపూర్‌ ఎమ్మెల్యే రాజయ్య, నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, ఖమ్మంకు చెందిన మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, వైరా మాజీ ఎమ్మెల్యే చంద్రావతిలు కాంగ్రెస్‌లో చేరికలపై చర్చలు సాగుతున్నాయి. మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్‌, మంచిర్యాలకు చెందిన మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్ లు కూడా కాంగెస్‌లో చేరుతారని సమాచారం.

షర్మిల పార్టీ విలీనంపై సందిగ్ధత

వైఎస్సార్టీపీ పార్టీ అధినేత వైఎస్ షర్మిల కూడా తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే విషయమై సెప్టెంబర్ 17సభకు ముందే స్పష్టతనిచ్చిన పక్షంలో సోనియాగాంధీ సభా వేదికపై ఆమె కూడా కనిపించవచ్చు. పార్టీ విలీనం దిశగా ఇప్పటికే షర్మిల కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలతో చర్చలు కూడా జరిపారు.

అయితే పార్టీ విలీనం తర్వాతా ఏపీ, తెలంగాణలలో ఆమె సేవలు ఎక్కడా ఉపయోగించుకోవాలన్న అంశం, ఆమె ఎక్కడ పోటీ చేయాలన్న అంశాలపై స్పష్టత రాకపోవడంతో పార్టీ విలీనం కూడా ఆలస్యమవుతుంది. సెప్టెంబర్ 17లోగా వీటిపై స్పష్టత వస్తే సోనియాగాంధీ సభకు షర్మిల కూడా హాజరుకావచ్చని భావిస్తున్నారు.

మరోవైపు ఎన్నికలకు ముందు సీమాంధ్ర నేతగా ముద్ర ఉన్న షర్మిలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటే గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబునాయుడుతో కాంగ్రెస్ పొత్తుతో ఏర్పడిన నష్టమే ఎదురుకావచ్చని కొందరు పార్టీ నేతలు కలవరపడుతున్నారు.

గత ఎన్నికల్లో కాంగ్రెస్‌, చంద్రబాబుల బంధాన్ని అస్త్రంగా చేసుకుని సీఎం కేసీఆర్ ప్రాంతీయ సెంటిమెంట్‌ను రగిలించి లబ్ధి పొందినట్లుగా మరోసారి అదే తరహా ప్రయత్నం చేయవచ్చన్న వాదన వినిపిస్తున్నారు. షర్మిలతో ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయంగా లాభం మాటేమోగాని బీఆరెస్‌కు అస్త్రంగా మారకుండా ఉంటే చాలన్న భావనను కొందరు కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు.

Updated On 8 Sep 2023 11:26 AM GMT
somu

somu

Next Story