కాంగ్రెస్ నేతల హాత్ సే హాత్ జోడో భాగస్వామ్యమైన సీనియర్ నాయకులు  నిన్నటి వరకు సీనియర్లు, వలసవాదులు, కోవర్టులు, సేవ్ కాంగ్రెస్ అంటూ విడిపోయిన కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు ఎన్నిఉన్నా, ఒక్కొక్కరు కలిసి వస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర ఏ విధంగా సాగుతుందనే ఉత్కంఠకు తెరదించుతూ విజయవంతంగా ముందుకు సాగుతోంది. యాత్ర ప్రారంభంలో అనేక అనుమానాలు ఉన్నప్పటికీ, అవన్నీ పటాపంచలు చేస్తూ పాదయాత్రలో పార్టీ సీనియర్ […]

  • కాంగ్రెస్ నేతల హాత్ సే హాత్ జోడో
  • భాగస్వామ్యమైన సీనియర్ నాయకులు

నిన్నటి వరకు సీనియర్లు, వలసవాదులు, కోవర్టులు, సేవ్ కాంగ్రెస్ అంటూ విడిపోయిన కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు ఎన్నిఉన్నా, ఒక్కొక్కరు కలిసి వస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర ఏ విధంగా సాగుతుందనే ఉత్కంఠకు తెరదించుతూ విజయవంతంగా ముందుకు సాగుతోంది. యాత్ర ప్రారంభంలో అనేక అనుమానాలు ఉన్నప్పటికీ, అవన్నీ పటాపంచలు చేస్తూ పాదయాత్రలో పార్టీ సీనియర్ నేతలు ఒక్కొక్కరిగా వచ్చి రేవంత్ రెడ్డితో కలిసి అడుగులు వేస్తున్నారు. అండగా నిలుస్తున్నారు. భేదాభిప్రాయాలు ఎన్ని ఉన్నా అంతర్గతంగా పరిష్కరించుకుంటా మంటున్నారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ ను గద్దెదింపడంలో మేమంతా ఒక్కటిగా ఉంటామని ప్రకటిస్తున్నారు. ఇప్పటికే సీనియర్ నాయకులు ఒక్కొక్కరు ఒక్కో నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పాదయాత్రలో పాల్గొంటూ, కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నారు. అయినా ఇప్పటికీ మరి కొంతమంది సీనియర్ నేతలు ఈ యాత్రలో ఇప్పటివరకు భాగస్వామ్యం కాలేదు. రానున్న రోజుల్లో ఇంకెవరూ కలిసివస్తారో చూడాల్సిందే. వీటన్నింటిని పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి తన యాత్రను అప్రతిహతంగా కొనసాగిస్తున్నారు.

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో పాదయాత్ర వరంగల్, ఖమ్మం జిల్లాల పరిధిలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో రెండు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో పూర్తి చేసుకుంది. ఫిబ్రవరి 6వ తేదీన మేడారంలో ప్రారంభమైన పాదయాత్ర వరంగల్, ఖమ్మం జిల్లాలలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో మంగళవారం ముగించి బుధవారం కరీంనగర్ జిల్లాలో ప్రవేశించింది. యాత్ర ప్రారంభం సందర్భంగా ఉన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నేతలు పార్టీ ముఖ్య నాయకులు ఒక్కొక్కరుగా వచ్చి రేవంత్‌తో 'కరచాలనం' చేస్తూ కలిసి అడుగులు వేస్తున్నారు.

తొలి రోజు ఠాగూర్, యాష్కీ, షబ్బీర్

యాత్ర ప్రారంభమైన తొలి రోజు పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్ రావు ఠాకూర్, ఏఐసీసీ నేత మధుయాష్కీ గౌడ్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ హాజరయ్యారు. పస్రా కార్నర్ మీటింగ్లో ప్రసంగించి ఉత్తేజాన్ని నింపారు. ఇక యాత్రలో పార్టీ సీనియర్ నాయకులు ములుగు ఎమ్మెల్యే సీతక్క, మల్లు రవి, అంజన్ కుమార్ యాదవ్, బలరాం నాయక్, అద్దంకి దయాకర్, వేం నరేందర్ రెడ్డి, తేజావత్ బెల్లయ్య నాయక్, కొండా మురళి, కొండా సురేఖ‌ తదితరులు పాల్గొని యాత్రకు సంఘీభావం తెలిపారు.

హనుమకొండలో వీహెచ్ భాగస్వామ్యం

ఆ తర్వాత జోడో యాత్రలో పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు భాగస్వామ్యమయ్యారు. హనుమకొండ లో జరిగిన కార్నర్ మీటింగుల్లో ప్రసంగించారు. మా నాయకుల మధ్య ఉన్న విభేదాలు పట్టించుకోకుండా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు రేవంత్ యాత్రకు మద్దతు ప్రకటించారు. మానుకోట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, నాయకులు రామచంద్రనాయక్, నెహ్రూ నాయక్ తదితరులు యాత్రలో పాల్గొన్నారు.

పాదయాత్ర చేసిన భట్టి విక్రమార్క

ఖమ్మం జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భద్రాచలంలో ఒకరోజు పాదయాత్ర చేసి పాల్గొన్నారు. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో చేపట్టిన యాత్రలో కోదండరెడ్డి, జంగా రాఘవరెడ్డి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, దొమ్మాటి సాంబయ్య, డాక్టర్ లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఇందిరా, నాయిని రాజేందర్ రెడ్డి, నమిండ్ల శ్రీనివాస్, కొండా సురేఖ, ఇనుగాల వెంకటరామిరెడ్డి, గండ్ర సత్యనారాయణ రావు, ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

భూపాల్ పల్లిలో దుద్దిల్ల

భూపాల్ పల్లి లో జరిగిన కార్నర్ మీటింగ్లో ఏఐసీసీ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పాల్గొన్నారు. భూపాల్ పల్లి జిల్లాలో జరుగుతున్న అధికార పార్టీ అవినీతి, అక్రమాలు, హత్యాకాండ గురించి ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ ను గద్దె దింపే వరకు నిద్రపోమని ప్రకటించారు.

యాత్రకు దూరంగా ఉన్న దొంతి, పొన్నాల

ఇదిలా ఉండగా మానుకోట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నర్సంపేటలో పాదయాత్ర జరగలేదు. స్థానిక నేత దొంతి మాధవరెడ్డి రేవంత్ రెడ్డికి సహకరించలేదని చర్చ సాగుతోంది అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ అసెంబ్లీ సెగ్మెంట్ కూడా మిగిలి ఉంది అయితే ఈ నియోజకవర్గ జనగామ పార్లమెంటు పరిధిలోకి వస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మాజీ పీసీసీ అధ్యక్షుడు, జనగామ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పొన్నాల లక్ష్మయ్య మాత్రం ఈ యాత్రకు దూరంగా ఉన్నారు.

Updated On 1 March 2023 9:52 AM GMT
Somu

Somu

Next Story