Congress | కేంద్రంలో బీజేపీ 2014లో భారీ మెజారిటీతో విజయం సాధించినా ఆ తర్వాత వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలైంది. దేశంలో, రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు అనడానికి ఇదే నిదర్శనం. అయితే కాంగ్రెస్‌ పార్టీలో, ఇతర ప్రాంతీయ పార్టీల్లో నెలకొన్న విభేదాలు, అనైక్యతలనే ఆసరాగా చేసుకుని బీజేపీ వివిధ రాష్ట్రాల్లో అధికారాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిదే. అందుకే హైదరాబాద్‌లో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున […]

Congress |

కేంద్రంలో బీజేపీ 2014లో భారీ మెజారిటీతో విజయం సాధించినా ఆ తర్వాత వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలైంది. దేశంలో, రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు అనడానికి ఇదే నిదర్శనం. అయితే కాంగ్రెస్‌ పార్టీలో, ఇతర ప్రాంతీయ పార్టీల్లో నెలకొన్న విభేదాలు, అనైక్యతలనే ఆసరాగా చేసుకుని బీజేపీ వివిధ రాష్ట్రాల్లో అధికారాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిదే.

అందుకే హైదరాబాద్‌లో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత ప్రయోజనాలు, విభేదాలను పక్కనపెట్టి పార్టీ విజయానికి ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఐక్యత, క్రమశిక్షణ ద్వారానే ఎదుటి పార్టీలను ఓడించగల మన్నారు. ఐక్యంగా పనిచేస్తే ప్రజలు తప్పకుండా ఆదరిస్తారనడానికి హిమాచల్‌ప్రదేశ్‌, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఉదహరించారు.

తెలంగాణలోనూ అదే పరిస్థితి ఉన్నది. కానీ నేతల మధ్య విభేదాల వల్లనే పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అయోయంలో ఉన్నారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని నేతలు ఇష్టం వచ్చినట్లు మీడియా ముందు మాట్లాడుతున్నారు. అందుకే మీడియా ముందు వచ్చే ముందు సంయమనంతో వ్యవహరించాలని సోనియాగాంధీ సూచించారు. ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకోవాలంటే ముందు నేతలు ఐక్యంగా పనిచేయాలి.

ఇది కొరవడటం వల్లనే రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో చేదు ఫలితాలు చూడాల్సి వచ్చిందనేది వాస్తవం. బీజేపీకి రాష్ట్రంలో బలం ఎంత ఉన్నది అన్నది దుబ్బాక, నాగార్జునసాగర్‌, హుజురాబాద్‌, మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలు చూస్తే తెలుస్తుంది. దుబ్బాక, హుజురాబాద్‌లో అభ్యర్థుల ఉద్యమ నేపథ్యం, వ్యక్తిగత పరిచయాలే వారికి విజయాన్ని సాధించిపెట్టిందనేది బీజేపీ వర్గాలే అంగీకరిస్తున్నారు.

పార్టీలో అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్‌ అన్నది సీనియర్‌ నేతలకు తెలియందు కాదు. కానీ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ ఏవైనా వ్యాఖ్యలు చేస్తే దానికి కౌంటర్‌ బీఆర్‌ఎస్‌, బీజేపీ నుంచి కంటే కొంతమంది సొంతపార్టీ నేతల నుంచే వస్తాయి. వాటినే ఆ పార్టీలు సోషల్‌ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. దీన్నే పక్కనపెట్టాలని ఖర్గే నేతలకు దిశానిర్దేశం చేశారు.

అలాగే పార్టీలో అభిప్రాయభేదాలు ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలి. కానీ మీడియా ముందుకు వచ్చినప్పుడు సంయమనం కోల్పోతే అది పార్టీ ప్రయోజనాలకు నష్టం చేస్తుందని సోనియాగాంధీ చెప్పారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌ పట్ల ప్రజల్లో విశ్వాసం ఉన్నది.

ముఖ్యంగా సోనియాగాందీ సంకల్పం వల్లే దశాబ్దాల తమ స్వరాష్ట్ర కల సాకారమైందనే అభిప్రాయం ఉన్నది. కాబట్టి రాష్ట్ర నేతలు విభేదాలు పక్కనపెడితేనే పార్టీ విజయానికి అవకాశాలు చాలా ఉంటాయి. పార్టీ అగ్రనేతల మాటలను కూడా పెడచెవిన పెట్టి వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తే వారితో పాటు పార్టీకి కూడా నష్టం జరుగుతుంది.

Updated On 18 Sep 2023 9:20 AM GMT
krs

krs

Next Story