Congress | కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ తరహాలో.. అన్నీ తామై నడిపిస్తున్న ఏఐసీసీ నేతలు రాష్ట్రానికి రానున్న జాతీయ నాయకత్వం 16, 17 తేదీల్లో హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సోనియాగాంధీ, రాహుల్ గాంధీల రాక 17న రాష్ట్ర రాజధానిలో భారీ బహిరంగ సభ 18న ఇంటింటికీ కాంగ్రెస్ ముఖ్య నేతల ప్రచారం ఈ ఐదూ గ్యారెంటీ! రూ.500కే గ్యాస్ సిలిండర్ సామాజిక పెన్షన్లు రూ.4 వేలకు పెంపు, దివ్యాంగులు, వింతతువులకు అదనంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ జాగా […]

Congress |
- కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ తరహాలో.. అన్నీ తామై నడిపిస్తున్న ఏఐసీసీ నేతలు
- రాష్ట్రానికి రానున్న జాతీయ నాయకత్వం
- 16, 17 తేదీల్లో హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ
- సోనియాగాంధీ, రాహుల్ గాంధీల రాక
- 17న రాష్ట్ర రాజధానిలో భారీ బహిరంగ సభ
- 18న ఇంటింటికీ కాంగ్రెస్ ముఖ్య నేతల ప్రచారం
ఈ ఐదూ గ్యారెంటీ!
రూ.500కే గ్యాస్ సిలిండర్ సామాజిక పెన్షన్లు రూ.4 వేలకు పెంపు, దివ్యాంగులు, వింతతువులకు అదనంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ జాగా ఉండి ఇల్లు లేని వాళ్లు ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షలు యువతకు నిరుద్యోగ భృతి
విధాత, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఐదు గ్యారెంటీలతో అభయ హస్తం అందించేందుకు సిద్ధమైంది. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ మాదిరిగా తెలంగాణలో కూడా తాము అధికారంలోకి రాగానే మొదట అమలు చేయాలనుకున్న ఐదు గ్యారెంటీ పథకాలను ప్రకటించాలని జాతీయ కాంగ్రెస్ నిర్ణయించింది. దీనితోపాటు తెలంగాణ రాష్ట్ర సాకారం వెనుక సోనియాగాంధీ కృషి, దానికి బీఆరెస్ అధినేత కేసీఆర్ హైజాక్ చేసిన తీరును ప్రజలకు వివరించాలనే ఆలోచనలో ఉన్నట్టు చెబుతున్నారు.
వీటితో అధికారం పక్కా అన్న విశ్వాసంతో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. 1. రూ.500కే గ్యాస్ సిలిండర్, 2.సామాజిక పెన్షన్లు రూ.4 వేలకు పెంపు, దివ్యాంగులు, వింతతువులకు అదనంగా, 3.రైతులకు రెండు లక్షల రుణమాఫీ, 4.స్వంత జాగా ఉండి ఇల్లు లేని వాళ్లు ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షల నగదు, 5.యువత కోసం నిరుద్యోగ భృతి.. ఈ ఐదింటినీ ఈ నెల 18న హైదరాబాద్‌లో నిర్వహించే భారీ సభలో గ్యారెంటీ పథకాలుగా ప్రకటించే అవకాశం ఉంది.
కర్ణాటక తరహా విజయానికి కృషి..
కర్ణాటక తరహాలో తెలంగాణలో పూర్తి మెజార్టీతో అధికారాన్ని చేపట్టే దిశగా కాంగ్రెస్ అగ్ర నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం తెలంగాణపై ప్రత్యేకంగా కేంద్రీకరించిందని, అన్నీ తానై నడిపిస్తున్నదని చెబుతున్నారు. డిసెంబర్‌లోగా తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రెండూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలే. ఇవి కాకుండా కాంగ్రెస్ నుంచి బీజేపీ కుట్ర పూరితంగా లాగేసుకున్న మధ్యప్రదేశ్‌తో పాటు ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో కూడా ఎన్నికలు జరుగనున్నాయి.
సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ ఎన్నికల ప్రభావం దేశం మొత్తం మీద పడుతుందనే అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ 5 రాష్ట్రాలలో గెలిచి పార్లమెంట్ ఎన్నికల్లో విజయానికి మార్గం సుగమం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే అమలు చేసే అతికీలకమైన, ప్రజలకు మేలు చేసే ఐదు గ్యారెంటీ పథకాలను ప్రకటించాలని నిర్ణయించింది.
రాష్ట్రం ఏర్పాటు తరువాత..
తెలంగాణ ఇవ్వడంతో రాష్ట్ర ప్రజల కలలు నెరవేరినా.. రాజకీయంగా కాంగ్రెస్ బాగా నష్టపోయింది. ఒక రాష్ట్రంలో తీవ్ర ప్రతికూల ప్రభావాలు ఉంటాయని భావించినా.. ఇచ్చిన రాష్ట్రంలో కూడా పార్టీ తీవ్ర ఇబ్బందులకు గురవటం, రెండుసార్లుగా అధికారంలోకి రాలేకపోవడం కాంగ్రెస్ నాయకత్వాన్ని ఇరుకున పడేసింది. ‘ప్రజలకు ఇచ్చిన మాట కోసం నిలబడి తెలంగాణను యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ సాకారం చేశారన్న వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోయాం.
తెలంగాణ ఇస్తే అప్పటి టీఆరెస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని కేసీఆర్ సంకేతాలు ఇచ్చారు. బిల్లు ఆమోదం తర్వాత కుటుంబంతో సహా సోనియాను ఆమె నివాసానికి వెళ్లి మరీ కలిశారు. కానీ.. ఆ తర్వాత అప్పటి టీఆరెస్ రాజకీయ పార్టీగా కొనసాగుతుందని ప్రకటించడమే కాకుండా.. ఎన్నికల్లో దిగి.. తెలంగాణ సెంటిమెంట్‌తో విజయం సాధించారు’ అని సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు. విశేషం ఏమిటంటే.. రెండో పర్యాయం కూడా తెలంగాణ సెంటిమెంట్‌ను ఆధారం చేసుకునే కేసీఆర్ విజయం సాధించారని పరిశీలకులు అంటున్నారు.
‘ఇక్కడ రాష్ట్రం ఇచ్చినా ఫలితం లేకపోగా.. మరోవైపు రాష్ట్రాన్ని చీల్చారన్న కోపంతో ఏపీలో కాంగ్రెస్ కోలుకోలేని దెబ్బతిన్నది. ఈ పరిణామంతో అప్పటి వరకూ బలంగా ఉన్న కాంగ్రెస్ బలహీనంగా మారిపోయింది. దానికి తోడు రాజకీయ పునరేకీకరణ పేరుతో ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను ఎల్పీల విలీనం పేరుతో తన పార్టీలోకి తీసుకుని.. ఇతర పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలూ ఆయా పార్టీలకు దక్కకుండా చేశారు’ అని ఓ విశ్లేషకుడు చెప్పారు.
‘కానీ.. కనుమరుగు అవుతుందనుకున్న కాంగ్రెస్.. అనూహ్యంగా పుంజుకున్నది. వివిధ సందర్భాల్లో ఆ పార్టీ చేసిన ఉద్యమాలు, సమస్యలను అందిపుచ్చుకుని ఆందోళనలకు దిగిన తీరు.. ప్రజల్లో కాంగ్రెస్ పట్ల నమ్మకాన్ని తిరిగి కల్పించింది’ అని ఆయన చెప్పారు. దీనిని మంచి సానుకూల పరిణామంగా భావిస్తున్న కాంగ్రెస్.. తెలంగాణ ఇవ్వడంలో కాంగ్రెస్ ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటన్నింటినీ అధిగమించి బిల్లు ఆమోదం పొందేలా చేసేందుకు చేపట్టిన చర్యలు అన్నింటినీ ప్రజలకు హత్తుకునేలా చెప్పాలని నిర్ణయించినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వరుస డిక్లరేషన్లతో
కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ మొదలుకొని, చేవెళ్ల వరకు పలు డిక్లరేషన్లు వెలువరించింది. ఇంకా బీసీ, మహిళా డిక్లరేషన్‌లను ప్రకటించడానికి సన్నాహాలు చేస్తున్నదని సమాచారం. కాంగ్రెస్ ఇప్పటి వరకు ధరణి రద్దు, సామాజిక పెన్షన్ల పెంపు, రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ, యూత్ డిక్లరేషన్, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లతో ఆయా సామాజిక వర్గాలకు ఇప్పటికే దగ్గరైందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.
తరలి వస్తున్న జాతీయ నాయకత్వం
కాంగ్రెస్ జాతీయ నాయకత్వం హైదరాబాద్‌కు తరలి రానున్నది. కొత్తగా ఏర్పడిన సీడబ్ల్యూసీ మొదటి సమావేశం ఈ నెల 16వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ఈ సమావేశం దిగ్విజయం అయ్యేందుకు పీసీసీ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ సమావేశం సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత, పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు జాతీయ నాయకత్వం అంతా రెండు రోజులపాటు తెలంగాణలోనే ఉండనున్నది. 16వ తేదీన సీడబ్ల్యూసీ సమావేశం జరగుతుంది.
17వ తేదీన సీడబ్ల్యూసీ, ప్రత్యేక ఆహ్వానితులు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల పీసీసీల అధ్యక్షులు, సీఎల్‌పీల నేతలు, పార్లమెంటరీ పార్టీ నాయకులతో సమావేశం ఉంటుంది. అదే రోజు సాయంత్రం హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నది. ఈ బహిరంగ సభలో ఐదు గ్యారెంటీలను ప్రకటించనున్నది. అలాగే బీఆరెస్ ప్రభుత్వ వైఫల్యాలపై చార్జిషీట్‌ను విడుదల చేయనున్నది. ఈ మేరకు జాతీయ కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.
మరుసటి రోజు 18వ తేదీన ప్రత్యేక పార్లమెంటు సమావేశాలకు సభ్యులు వెళతారు. మిగిలిన నాయకులంతా తెలంగాణలోని 119 నియోజకవర్గాలలో పర్యటిస్తారు. ఇంటింటికీ తిరిగి, కాంగ్రెస్ ప్రకటించిన 5 గ్యారెంటీలను వివరించడంతోపాటు, బీఆరెస్ ప్రభుత్వ వైఫల్యాలపై చార్జిషీట్‌ను ప్రజలకు తెలియజేస్తారు. అలా దేశ నాయకత్వం చేత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఇంటింటికి ప్రచారం చేయించనున్నది.
కృతజ్ఞతలు తెలిపిన రేవంత్‌రెడ్డి
కొత్తగా ఏర్పాటైన సీడబ్ల్యూసీ మొదటి సమావేశాన్ని తమపై నమ్మకంతో తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నందుకు సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్, ప్రియాంక, కేసీ వేణుగోపాల్‌లకు తెలంగాణ కాంగ్రెస్ టీమ్ తరపున పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. తమకు ఇంతటి గౌరవాన్ని అందించినందుకు కృతజ్ఞతలు చెప్పారు తామంతా ఈ సమావేశాన్ని విజయవంతం చేస్తామంటూ రేవంత్ ట్వీట్ చేశారు.
