- సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే నరేందర్
- ఏజే మిల్లు మాజీ ఉద్యోగులకు కుడా వెంచర్లలో ప్లాట్లు
Construction of Warangal District Collectorate
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వరంగల్ జిల్లా కలెక్టరేట్(Warangal District Collectorate) భవన నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఆజంజాహిమిల్లు(AzamZahi mill)కు సంబంధించిన 27.08 ఎకరాల స్థలాన్ని రెవెన్యూ శాఖకు అప్పగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గురువారం చేనేత జౌళి శాఖను ఆదేశించారు. ఇంతకాలం ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ఈ ఉత్తర్వులతో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే(MLA) నన్నపునేని నరేందర్(Nannapaneni Narendar) సంతోషం వ్యక్తం చేశారు.
సీఎంకు కృతజ్ఞతలు
వరంగల్ ప్రాంతాన్ని ఒక జిల్లాగా చేసి, ఇప్పుడు కలెక్టరేట్ నిర్మాణానికి స్థలం కేటాయించిన సీఎం కేసీఆర్‌ను గుర్తుంచుకుంటారని చెప్పారు. త్వరలో కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు మొదలు కానున్నాయన్నారు. సీఎంను శుక్రవారం హైదరాబాద్‌లో కలిసి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రక్రియలో సహకరించిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తోడ్పాటు, ఏజే మిల్లు కార్మికుల సహకారం మరువలేనిదని చెప్పారు.
కుడా వెంచర్లలో ప్లాట్లు
ఏజే మిల్లు మాజీ ఉద్యోగులకు కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) అభివృద్ధి చేసిన స్థలంలో ప్లాట్లను కేటాయించాలని సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని, మూడు నెలల్లో మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ధేశించిందని ఎమ్మెల్యే చెప్పారు. ఏజే మిల్లు మాజీ ఉద్యోగులు 318 మందికి మడిపల్లి, అనంతసాగర్ గ్రామాల వద్ద కుడా అభివృద్ధి చేసిన ‘మా సిటీ’లో ప్లాట్లు కేటాయించేందుకు నిర్ణయించినట్లు నరేందర్ తెలిపారు.