CPI | తాజాగా సీపీఐ సభ రద్దుతో ఆజ్యం అసెంబ్లీ సీట్లపై ఇప్పటికీ లేని స్పష్టత బదులుగా ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ? లెఫ్ట్‌కు ఆఫర్లు ఇస్తున్న గులాబీ నేతలు సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచారం సీట్లపై బ్లాక్‌ మెయిల్‌ సభలని వీడియో నిర్దిష్ట స్థానాలపై పట్టదలతో కామ్రేడ్లు హుస్నాబాద్‌లో పోటీ ఖాయమన్న సీపీఐ అక్కడ ఒడితలకే సీటిస్తామన్న కేటీఆర్‌ సీపీఎం పోటీ చేసే సీట్లపైనా హామీ లేదు సీపీఐ కొత్తగూడెం సభకు అనుమతి రద్దు తీవ్ర ఆవేదనలో కమ్యూనిస్ట్‌ […]

CPI |

  • తాజాగా సీపీఐ సభ రద్దుతో ఆజ్యం
  • అసెంబ్లీ సీట్లపై ఇప్పటికీ లేని స్పష్టత
  • బదులుగా ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ?
  • లెఫ్ట్‌కు ఆఫర్లు ఇస్తున్న గులాబీ నేతలు
  • సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచారం
  • సీట్లపై బ్లాక్‌ మెయిల్‌ సభలని వీడియో
  • నిర్దిష్ట స్థానాలపై పట్టదలతో కామ్రేడ్లు
  • హుస్నాబాద్‌లో పోటీ ఖాయమన్న సీపీఐ
  • అక్కడ ఒడితలకే సీటిస్తామన్న కేటీఆర్‌
  • సీపీఎం పోటీ చేసే సీట్లపైనా హామీ లేదు
  • సీపీఐ కొత్తగూడెం సభకు అనుమతి రద్దు
  • తీవ్ర ఆవేదనలో కమ్యూనిస్ట్‌ నాయకులు
  • పొత్తులపై తేల్చుకునే యోచనలో సీపీఐ!
  • సీపీఎం నేతల్లోనూ తీవ్రస్థాయి అసంతృప్తి
  • అయినా వేచి చూసే ధోరణిలో నాయకత్వం

మునుగోడు ఉప ఎన్నికతో మొదలైన ఎర్ర-గులాబీ స్నేహం.. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ముగింపు దశకు చేరుకునేలా కనిపిస్తున్నది. దోస్తీ కొనసాగుతుందని బీఆర్‌ఎస్‌ అధినాయకత్వం చెబుతున్నా.. క్షేత్ర స్థాయిలో మాత్రం వామపక్షాలకు సీట్లు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. లెఫ్ట్‌ పార్టీలు కర్చీఫ్‌ వేసుకున్న సీట్లపై అప్పటికే బీఆర్‌ఎస్‌ ఆశావహులు తువ్వాళ్లు వేసేసి కూర్చున్నారు.

వామపక్షాలకు సీట్లు ఇచ్చేది లేదని సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలు సైతం సాగుతున్నాయి. వీటన్నింటికి తోడు తాజాగా సీపీఐ సభకు అనుమతి ఇచ్చి మరీ రద్దు చేయడంతో కామ్రేడ్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్‌-బీజేపీ ఒక్కటేనన్న ప్రచారం, దానికి బలం చేకూర్చేలా జరుగుతున్న పరిణామాలు కూడా వామపక్ష నాయకత్వాన్ని పునరాలోచనలో పడేసినట్లు కనిపిస్తున్నది.

విధాత: పొత్తుల దాకా వెళ్లకుండానే బీఆర్‌ఎస్‌-వామపక్షాల ‘మునుగోడు’ బంధం తెగే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు తమతో స్నేహం చేస్తూనే తమను అవమానించేలా బీఆర్‌ఎస్‌ నాయకత్వం తీరు ఉన్నదని కామ్రేడ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టులకు ఇప్పటికీ ప్రాబల్యం ఉన్నదనేది తిరుగులేని సత్యం. ఇక్కడ బీఆర్‌ఎస్‌ సహకారంతో పోటీ చేసి.. అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఆలోచిస్తున్నాయి.

రాష్ట్రంలోని మరికొన్ని నియోజకవర్గాల పైనా ఆ పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. కానీ.. క్షేత్రస్థాయిలో బీఆర్‌ఎస్‌ నాయకత్వం ఆ ఆశలపై నీళ్లు చల్లుతున్నదని లెఫ్ట్‌ పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఆ పార్టీ పెద్దల మాట విని.. ఒకటి రెండు సీట్లు వదులుకున్నా.. ఓట్లు మాత్రం పడే అవకాశం లేదన్న అభిప్రాయాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.

దీనికి నిదర్శనంగా కొన్ని రోజుల క్రితం ఖమ్మం జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసిన వీడియోను ప్రస్తావిస్తున్నారు. వామపక్షాలకు ఎమ్మెల్సీ పదవి మాత్రమే ఉంటుందని, పొత్తులో భాగంగా అసెంబ్లీ సీట్లు ఇవ్వబోవడం లేదని అందులో పేర్కొన్నారని వారు చెబుతున్నారు. ఇది ఖమ్మం జిల్లాలో మాత్రమే కాదని, వామపక్షాలు పోటీ చేయాలని భావిస్తున్న ప్రతి చోటా ఇలాంటి ప్రచారాలే జరుగుతున్నాయని అంటున్నారు.

ఇటీవల రాష్ట్ర సీపీఎం అగ్రనేత ఒకరితో మాట్లాడిన ఒక మంత్రి.. ఎమ్మెల్సీ సీట్లు ఇస్తాం.. సరిపోదంటూ రాజ్యసభ సీట్లు ఇస్తాం.. అంతేకానీ.. ఎమ్మెల్యే స్థానాలపై ఆశపెట్టుకోవద్దని అన్నారని సీపీఎం నేత ఒకరు తెలిపారు. దీంతో మంత్రి వద్ద సీట్ల ప్రస్తావన దండగని ఊరుకున్నారని చెప్పారు.

పొత్తు కావాలి.. కానీ సీట్లు ఇవ్వం!

పొత్తు పెట్టుకోవాలి.. కానీ సీట్లు అడగవద్దన్నట్లుగా బీఆర్‌ఎస్‌ పార్టీ నేతల తీరు ఉన్నదని కమ్యూనిస్టు పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. లెఫ్ట్‌ పోటీ చేయాలని భావిస్తున్న ప్రతి చోటా బీఆర్‌ఎస్‌ నాయకులు ఏకంగా అభ్యర్థులనే ప్రకటించేస్తున్నారని చెబుతున్నారు. హుస్నాబాద్‌లో సీపీఐ పోటీ చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నది. ఇక్కడ ఆ పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి పోటీ చేస్తారని సమాచారం.

అయితే.. అక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే ఒడితల సతీశ్‌ మళ్లీ పోటీ చేస్తారని కేటీఆర్‌ ఏకపక్షంగా ప్రకటించడాన్ని సీపీఐ నేతలు ప్రస్తావిస్తున్నారు. అలాగే సీపీఎం పోటీ చేసే అవకాశం ఉన్న పాలేరు, మిర్యాలగూడెంలలో తామే పోటీ చేస్తున్నామని బీఆర్‌ఎస్‌ నేతలు ప్రకటించారు. కొత్తగూడెం, భద్రాచలంలో కూడా తామే పోటీ చేస్తున్నామని బీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు.

వామపక్షాలతో పొత్తు ఉంటుందని, సీట్ల కేటాయింపు కూడా ఉంటుందని కేసీఆర్‌ సంకేతాలు పంపిస్తున్నారని, కానీ, కొందరు మంత్రి స్థాయిలో ఉన్నవారు సీట్లు ఉండవని చెబుతున్నారని సీపీఎం నేత ఒకరు తెలిపారు. సంకేతాలు పంపడం కాకుండా స్వయంగా పిలిచి హామీ ఇస్తేనే నమ్మకం ఉంటుందని అన్నారు.

మునుగోడు.. తర్వాత కలిసిందెక్కడ?

మునుగోడు ఉప ఎన్నిక తరువాత బీఆర్‌ఎస్‌ అధినేత సీఎం కేసీఆర్‌ వామపక్ష నేతలను దాదాపుగా కలువలేదనే చెప్ప వచ్చునని ఆ పార్టీలకు చెందిన నేతలే అంటున్నారు. ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా కలిసి ఒక వేదిక పంచుకోవడమే కానీ, ప్రత్యేకంగా చర్చలు చేసిన సందర్భాలు లేవంటున్నారు.

మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఒకటికి పదిసార్లు కలిసిన సీఎం.. ఆ తరువాత ప్రత్యేకంగా కలువలేదని, పిలుపు లేదని గుర్తు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో సీపీఐ అత్యున్నత స్థాయి నేతకు చెందిన భూమి సమస్య చెపితే ‘అదెంత పని?’ అన్న కేసీఆర్‌.. ఆ తరువాత పరిష్కరించలేదని, ఫోన్‌ చేస్తే కనీసం లిఫ్ట్‌ చేయలేదని ఆ పార్టీ నేత ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజాగర్జన సభలపైనా కామెంట్లు

ప్రజాగర్జన పేరుతో వామపక్షాలు నిర్వహించే సభలపై బీఆర్‌ఎస్‌ నేతలు కామెంట్లు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. తాము నిర్వహించే సభలు సీట్ల కోసం చేస్తున్న బ్లాక్‌ మెయిల్‌గా బీఆర్‌ఎస్‌ నేతలు కామెంట్లు చేస్తున్నారని లెఫ్ట్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా జూన్‌ 4న భద్రాద్రి జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణంలో సీపీఐ నిర్వహించ తలపెట్టిన సభకు మొదట అనుమతి ఇచ్చిన ప్రభుత్వం.. ఆ తరువాత అనుమతి రద్దు చేసింది. అన్ని ఏర్పాట్లు చేసుకున్న తరువాత అనుమతి రద్దు చేయడం పట్ల సీపీఐ తీవ్ర ఆగ్రహంతో ఉన్నది.

పొత్తుల సంగతి ఏమిటో తేల్చుకోవాలన్న ఆలోచనలో సీపీఐ నేతలున్నారని సమాచారం. జూన్‌1న నిర్వహించే రాష్ట్ర సమితి సమావేశంలో పొత్తులపై చర్చించి, ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తున్నది. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో లెఫ్ట్ పార్టీల క్యాడర్‌ బీఆర్‌ఎస్‌తో పొత్తును వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం.

గుడిసెల పోరాటంలో సీపీఐ నేతలపై కేసులు

కమ్యూనిస్టులు తమ దోస్తులని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించారు. వారితో పొత్తు ఉంటుందన్నారు. మునుగోడులో పొత్తు పెట్టుకున్నారు. బీఆర్‌ఎస్‌ ఇక్కడ గెలవడానికి కమ్యూనిస్టులతో పొత్తే కారణమన్నది బహిరంగ రహస్యమే. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేసే కమ్యూనిస్టులు.. నిలువ నీడలేని నిరు పేదలు చేసే భూపోరాటాలకు సైతం మద్దతు ఇస్తుంటారు.

వారు ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకునేందుకు ఉద్యమిస్తే.. అండగా నిలుస్తుంటారు. ఇదే తీరుగా హైదరాబాద్‌ శివారు ప్రాంతంతో పాటు మహబూబాబాద్‌, కోరుట్లలో పేదలు గుడిసెలు వేసుకుంటే వారికి సీపీఐ నేతలు అండగా నిలిచారు. దీనితో పోలీసులు కమ్యూనిస్టు నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టారు.

ఓ వైపు తమను దోస్తులు అంటూనే.. పేదల గుడిసెల పోరాటానికి అండగా నిలిచినందుకు కేసులు పెట్టడంపై సీపీఐ నేతలు గరంగరంగా ఉన్నారు. బీఆర్‌ఎస్‌ పెద్దల తీరు ఇదే విధంగా ఉంటే కలిసి ముందుకు వెళ్లడం కష్టమేనన్న అభిప్రాయాన్ని సీనియర్‌ నేత ఒకరు వ్యక్తం చేశారు.

బీజేపీ-బీఆర్‌ఎస్‌ సంబంధాలపై పరిశీలిస్తున్నాం: సీపీఎం నేత

బీఆర్‌ఎస్‌, బీజేపీ సంబంధాలపై నిశితంగా పరిశీలిస్తున్నామని సీపీఎం నేత ఒకరు అన్నారు. కర్ణాటక ఎన్నికల తరువాత బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య సఖ్యత ఉందన్న ప్రచారం జరుగుతున్నదని, అయితే దీనిపై నిర్దష్టమైన ఆధారాలు లేవని చెప్పారు. అంతమాత్రాన ఈ ప్రచారాన్ని కొట్టిపారేయలేమని పేర్కొన్నారు.

అన్నింటినీ జాగ్రత్తగా గమనిస్తున్నామని, ఏ మాత్రం తేడా వచ్చినా బీఆర్‌ఎస్‌తో కలిసి ముందుకు వెళ్లడం కష్టమేనని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీతో సన్నిహితంగా ఉన్నట్లు అర్థమైతే మాత్రం ఏ మాత్రం ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

Updated On 31 May 2023 4:17 PM GMT
krs

krs

Next Story