CPM | బెంగాల్‌లో తృణమూల్‌పైనా పోరాటం కేరళలో కాంగ్రెస్‌తోనే సీపీఎం పోరు సీనియర్ నేత సుజన్ చక్రవర్తి వ్యాఖ్యలు న్యూఢిల్లీ: ఇండియా కూటమిని జాతీయ స్థాయిలో బలపరుస్తూనే.. బెంగాల్‌లో తృణమూల్, బీజేపీలకు వ్యతిరేకంగా పోరాడుతామని సీపీఎం సీనియర్ నేత, ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సుజన్ చక్రవర్తి చెప్పారు. ఇండియా కూటమి సమన్వయ కమిటీలో సీపీఎం భాగస్వామి కావడం లేదని, కానీ.. బీజేపీని ఎదుర్కొనడానికి తమ శాయశక్తులూ ఒడ్డుతామని ప్రకటించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. […]

CPM |
- బెంగాల్‌లో తృణమూల్‌పైనా పోరాటం
- కేరళలో కాంగ్రెస్‌తోనే సీపీఎం పోరు
- సీనియర్ నేత సుజన్ చక్రవర్తి వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఇండియా కూటమిని జాతీయ స్థాయిలో బలపరుస్తూనే.. బెంగాల్‌లో తృణమూల్, బీజేపీలకు వ్యతిరేకంగా పోరాడుతామని సీపీఎం సీనియర్ నేత, ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సుజన్ చక్రవర్తి చెప్పారు. ఇండియా కూటమి సమన్వయ కమిటీలో సీపీఎం భాగస్వామి కావడం లేదని, కానీ.. బీజేపీని ఎదుర్కొనడానికి తమ శాయశక్తులూ ఒడ్డుతామని ప్రకటించారు.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘బీజేపీని, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాడాలని మేం తీసుకున్న వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. అదే సమయంలో బెంగాల్‌లో కాషాయ పార్టీతోపాటు అధికార టీఎంసీతో కూడా మేం తలపడతాం’ అని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కూడా ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే.
‘ప్రతి రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో వాస్తవాలు విభిన్నంగా ఉంటాయి. కేరళ, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో పరిస్థితులు ఇతర ఉత్తరభారతదేశ రాష్ట్రాల మాదిరిగా ఉండదు. కాంగ్రెస్ తరహాలోనే మాది కూడా జాతీయ పార్టీ. ప్రాంతీయ పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ లా కాకుండా బీజేపీపై పోరాటంలో మేం గొప్ప, కీలక పాత్ర నిర్వహించాల్సి ఉన్నదని భావిస్తున్నాం’ అని ఆయన ఒక వార్తా సంస్థకు చెప్పారు.
అవినీతిలో కూరుకుపోయి, వేల మంది యువతకు ఉద్యోగాలను దూరం చేస్తున్న తృణమూల్‌పై పోరాటాన్ని మెత్తబర్చలేమని ఆయన అన్నారు. ప్రస్తుతం కేంద్ర దర్యాప్తు సంస్థ నిఘాలో ఉన్న కొందరు నేతలను కాపాడుకునేందుకు కేంద్రంలోని బీజేపీతో తృణమూల్ రహస్య అవగాహనతో ఉన్నదని సుజన్ చక్రవర్తి ఆరోపించారు.
దీనిపై తృణమూల్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ స్పందిస్తూ.. అది వామపక్షాల ఇష్టమని, తాము మాత్రం బీజేపీపై పోరులో భావ సారూప్యం ఉన్న పార్టీలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. సీపీఎం నిర్ణయం ఆ పార్టీ అవకాశవాదాన్ని బయటపెడుతున్నదని బీజేపీ బెంగాల్ అధికార ప్రతినిధి సమిక్ భట్టాచార్య అన్నారు.
