Tuesday, January 31, 2023
More
  Homelatestకుంగుతున్న దేవ‌భూమి జోషి మ‌ఠ్‌! భయాందోళనలో ప్రజలు

  కుంగుతున్న దేవ‌భూమి జోషి మ‌ఠ్‌! భయాందోళనలో ప్రజలు

  • భవిష్యత్‌లో నైనిటాల్‌, ఉత్తరకాశీలో కూడా..
  • జోషిమఠ్‌లో పరిస్థితులపై అప్రమత్తమైన కేంద్రం..!
  • సీఎం పుష్క‌ర్ సింగ్‌ధామి ప‌ర్య‌ట‌న‌..
  • ఇళ్లకు బీట‌లు.. సుర‌క్షిత ప్రాంతాల‌కు ప‌లు కుటుంబాలు త‌ర‌లింపు
  • ప్ర‌కృతితో పోరాడి గెల‌వ‌లేమని హెచ్చ‌రిస్తున్న జియాల‌జిస్టులు

  డెహ్రాడూన్‌: దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్‌ని జోషిమఠ్‌ పట్టణం కుంగిపోతున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమతమయ్యాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి జోషిమఠ్‌లో పర్యటించారు.

  ఈ సందర్భంగా ప్రమాదం అంచున ఉన్న కుటుంబాలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు ఇప్పటి వరకు 500 ఇండ్లకుపైగా ఇండ్లు పగుళ్లు, బీటలు వారాయి. మరో వైపు జోషిమఠ్‌లో పరిస్థితులపై ప్రధానమంత్రి కార్యాలయం ఉన్నతస్థాయి సమావేశమై చర్చిస్తున్నది.

  ఈ భేటీలో ఉత్తరాఖండ్ అధికారులు, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అధికారులు పాల్గొన్నారు. జోషిమఠ్ పరిస్థితిని ప్రధాని మోదీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు.

  జోషిమఠ్‌లో పరిస్థితులపై ఉన్నత స్థాయి సమీక్ష

  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రిన్సిపల్ సెక్రెటరీ పీకే మిశ్రా, క్యాబినెట్ సెక్రెటరీ, సీనియర్ ప్రభుత్వ అధికారులు, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సభ్యులతో ఉన్నత స్థాయి సమీక్షా జరుగుతుండగా.. జోషిమఠ్ జిల్లా అధికారులు, ఉత్తరాఖండ్ సీనియర్ అధికారులు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో హాజరయ్యారు.

  ఉత్తరాఖండ్ ప్రభుత్వం చమోలీ జిల్లాలో సేఫ్టీ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ కోసం సర్కారు అదనంగా రూ.11 కోట్లు విడుదల చేసింది. నిపుణుల వివరాల ప్రకారం.. జోషిమఠ్ దశాబ్దం కిందట భూకంపం వల్ల ఏర్పడిన శిలలపై నిర్మింతమైంది. ఈ రాళ్లకు తక్కువ బేరింగ్ కెపాసిటీ ఉంటుంది. దీంతో నిర్మాణాలు ప్రమాదంలో ఉన్నాయి.

  దీనికి తోడు జోషిమఠ్ పట్టణం బద్రీనాథ్, హేమకుండ్ సాహిబ్ వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు ప్రవేశ ద్వారంగా ఉండగా.. అక్కడ నిర్మాణాలు పెరగడం, రోడ్డు విస్తరణ, జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాలు ఆ ప్రాంతాన్ని అస్థిరంగా మారుస్తున్నాయి. దీనికి తోడు హిమాలయాల నుంచి వచ్చే నదీ ప్రవాహాలతో నేల కోతకు గురవుతున్నది.

  జోషిమఠ్‌కే పరిమితం కాదు..

  ప్రస్తుతం జోషిమఠ్‌లో ఉన్న పరిస్థితులు ఇక్కడికే పరిమితం కాదని, రానున్న రోజుల్లో నైనిటాల్, ఉత్తరకాశీలకు కూడా ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హిమాలయాల దిగువన ఉన్న అనేక పట్టణాలు కూడా నేలలో కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

  భూమి స్వభావంతో సంబంధం లేకుండా ఈ మధ్యకాలంలో హిమాలయ పట్టణాల్లో విపరీతంగా ఇళ్ల నిర్మాణాలు పెరిగిపోయాయి. ప్రకృతి పరిణామాలు, వాతావరణం కూడా ఈ పట్టణాల మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి.

  విపరీతంగా కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా అక్కడ బలహీనమైన భూమి కోతకు గురవుతున్నది. ఈ ప్రాంతంలో భూమి అంతర్భాగంలో టెక్టానిక్ ప్లేట్ల కదలికలు ఎక్కువగా ఉండడం, ఇండియన్ టెక్టానిక్‌ ప్లేట్, యూరేషియన్ టెక్టానిక్ ప్లేట్‌ను ప్రతీ ఏడాది ఒక సెంటీమీటర్ ముందుకు నెడుతున్నది.

  ప్రకృతితో పోరాడి గెలువలేరు..

  లక్షల ఏళ్ల క్రితం ఈ టెక్టానిక్ ప్లేట్ల యాక్టివిటీ కారణంగానే ఇప్పుడున్న హిమాలయాలు ఏర్పడ్డాయి. ఈ ప్రాంతంలోనే ఉత్తరాఖండ్ లోని పలు పట్టణాలు ఉన్నాయి. మెయిన్ సెంట్రల్ థ్రస్ట్(ఎంసీటీ-2) కారణంగా భూమి అస్థిరంగా ఉంది. భూమి, ప్రకృతితో పోరాడి గెలవలేరని పలువురు జియాలజిస్టులు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.

  ప్రసిద్ధ వేసవి విడిది నైనిటాల్ కూడా జోషిమఠ్ లాగే ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ పట్టణం కుమౌన్ లెస్సర్ హిమాలయాల్లో ఉన్నది. 2016 నివేదిక ప్రకారం ఈ పట్టణంలోని కొన్ని ప్రాంతాలు కొండచరియలు విరిగిపడిన శిథిలాలపై నిర్మితమై ఉన్నది. నైనిటాల్ పట్టణం, షెల్, స్లేట్‌లతో కూడిన సున్నపురాయిని కలిగి ఉంది.

  ఈ రాళ్లు తక్కువ బలాన్ని కలిగి ఉంటాయి. ఇప్పుడు జోషిమఠ్‌లో మనం చూస్తున్నదే నైనిటాల్, ఉత్తరకాశీ, చంపావల్‌లో జరిగే ఆస్కారం ఉందని వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియాలజీ అండ్‌ గ్రాఫిక్ ఎరా హిల్ యూనివర్శిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular