ప్రధాన పార్టీలలో పెరిగిన అసహనం ఇప్పుడే ఇలా ఉంటే.. ఎన్నికల నాటికి ఎలా? సామాన్యుల్లో వ్యక్తమవుతున్న ఆందోళన విపక్ష పార్టీలు తీవ్రమైన విమర్శలు చేస్తూ పరిధి దాటుతుండగా, అసహనానికి లోన‌వుతున్న అధికార పార్టీ నేతలు అంగ, అధికార బలాన్ని ఉపయోగించి ప్రతిపక్షాలపై దాడులకు తెగబడుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెలకొన్న రాజకీయ వాతావరణాన్ని చూసి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రానున్న […]

  • ప్రధాన పార్టీలలో పెరిగిన అసహనం
  • ఇప్పుడే ఇలా ఉంటే.. ఎన్నికల నాటికి ఎలా?
  • సామాన్యుల్లో వ్యక్తమవుతున్న ఆందోళన

విపక్ష పార్టీలు తీవ్రమైన విమర్శలు చేస్తూ పరిధి దాటుతుండగా, అసహనానికి లోన‌వుతున్న అధికార పార్టీ నేతలు అంగ, అధికార బలాన్ని ఉపయోగించి ప్రతిపక్షాలపై దాడులకు తెగబడుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెలకొన్న రాజకీయ వాతావరణాన్ని చూసి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రానున్న ఎన్నికల నాటికి రాజకీయ మంటలు ఎగిసిపడే అవకాశాలు ఉన్నాయి. పరస్పర దాడులతో పరిస్థితి తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ వ్యవహారంలో అధికార పార్టీకి పోలీసులు అండగా నిలుస్తున్నారని విమర్శ ఎదుర్కొంటున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పరిస్థితిని అదుపు చేయడం పోలీసులకు అగ్నిపరీక్షగా మారుతోంది. అధికార పార్టీ నేతల నుంచి ఒత్తిడిలు, ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు, ప్రజల నుంచి ఆగ్రహం చవిచూస్తున్నారు. గత రెండు, మూడు నెలలుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, రానున్న రాజకీయ వివాదాల తీవ్రతకు సూచికగా భావిస్తున్నారు.

Criticism opposition.. Attacks by the ruling party..

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయ సెగలు, పగలకు కేంద్రంగా మారుతుంది. విపక్ష, అధికార పక్షాల మధ్య రాజకీయ విభేదాలు భౌతిక దాడులకు దారితీస్తున్నాయి. దీంతో ఆయా రాజకీయ పార్టీల శ్రేణుల మధ్య కూడా విభేదాలు తీవ్ర రూపం దాల్చి నువ్వా నేనా అనే రీతిలో దాడులకు సిద్ధమవుతున్నారు. గతం లోను ఈ విభేదాలు ఉన్నప్పటికీ ఇటీవల పరిస్థితి మరింత దిగజారుతోంది.

నర్సంపేట సెగ్మెంట్లో షర్మిల పై..

వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గంలో యాత్ర కొనసాగుతుండగా స్థానిక ఎమ్మెల్యే, టిఆర్ఎస్ పార్టీ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి పై షర్మిల చేసిన ఘాటైన వ్యాఖ్యలు, అవినీతి ఆరోపణలతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. నెక్కొండలో టిఆర్ఎస్(TRS) శ్రేణులు దాడి చేసి ఫ్లెక్సీలు, పార్టీ జెండాలు ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. షర్మిల కారోవ్యాన్ దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు. ఈ స్థితిలో పోలీసులు ఆమెను అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించారు.

హుజురాబాద్ సెగ్మెంట్లో ఈటలపై..

మంత్రి కేటీఆర్ ఈ మధ్య బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. ఆయన పర్యటన ముగిసిన రెండు రోజులకే ఈటల కమలాపూర్ మండలంలోని పంగిడిపల్లి గ్రామంలో పర్యటిస్తుండగా బిజెపి, టిఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవ జరిగింది. ఈ సంఘటనలో బిజెపి కార్యకర్తలపై కేసుపెట్టి జైలుకు పంపారు.

మానుకోట కేంద్రం రేవంత్ సభలో..

టిపిసిసి రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర సందర్భంగా మహబూబాబాద్‌లో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య విమర్శల వేడి పెరిగింది. మహబూబాబాద్ కార్నర్ మీటింగ్‌లో రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా టిఆర్ఎస్ కార్యకర్త తాగి గొడవచేసి, సభ విచ్ఛినం చేసేందుకు ప్రయత్నించారు. సభలో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై చేసిన ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు జరిగింది.

మానుకోట సెగ్మెంట్లో బీజేపీ పై..

మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నైనాల గ్రామంలో బిజేపి కార్నర్ మీటింగ్ జరుగుతుండగా బిఆర్ఎస్ నాయకులు ఘర్షణకు దిగారు. మద్యం సేవించిన బీఆర్ఎస్ కార్యకర్త ఒకరు సభ మీదికి మోటార్ సైకిల్ తీసుకు వచ్చారు. అతనిపై బీజేపీ కార్యకర్తలు మూకుమ్మడి దాడి చేశారు. పోలీస్ స్టేషన్ ఎదుట బిజేపి నాయకులు బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు.

వరంగల్ పశ్చిమ సెగ్మెంట్లో రేవంత్ పై..

వరంగల్ పశ్చిమ సెగ్మెంట్‌ హనుమకొండలో రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ జరుగుతుండగానే యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్ పై విచక్షణారహితంగా దాడి జరిగింది. ఈ దాడి నేపథ్యంలో హనుమకొండలో హై టెన్షన్ నెలకొంది. ఈ దాడికి పాల్పడింది అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ అనుచరులనేది కాంగ్రెస్ ఆరోపణ. పరస్పర విమర్శల నేపథ్యంలో రాజకీయ వేడి పెరిగిపోయింది.

మానుకోట సెగ్మెంట్లో షర్మిల పై..

కోర్టు అనుమతితో యాత్ర కొనసాగించిన వైయస్ షర్మిల యాత్ర పై మానుకోటలో దాడి జరిగింది. స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్, షర్మిల పరస్పరం చేసిన విమర్శలు ఉద్రిక్తతకు దారితీసాయి. మానుకోట శివారులో టిఆర్ఎస్ కార్యకర్తలు షర్మిల ఫ్లెక్సీలు, జెండాలు కాలబెట్టి రాస్తారోకో నిర్వహించారు.దీంతో పోలీసులు షర్మిలను అరెస్టు చేసి హైదరాబాద్ తరలించారు.

భూపాలపల్లి సెగ్మెంట్లో రేవంత్ సభపై..

రేవంత్ రెడ్డి భూపాల్ పల్లిలో కార్నర్ మీటింగ్ నిర్వహిస్తుండగా బీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లు, టమాటాలు, కోడిగుడ్లు విసరడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. మరునాడు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బహిరంగ చర్చకు సిద్ధం కావడంతో టెన్షన్ నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డిని, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి గండ్ర సత్యనారాయణ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేయాల్సి వచ్చింది.

వరుస ఈ సంఘటనల నేపథ్యంలో రాజకీయ పక్షాల విమర్శలు పరిధి దాటుతుండగా, అధికార పార్టీ కూడా అదే స్థాయిలో విమర్శలు చేస్తూనే దాడులకు సిద్ధమవుతోంది. పరిస్థితి ఇప్పుడే అదుపుతప్పినట్లు ఉంటే రానున్న రోజుల్లో మరింత దిగజారే ప్రమాదం ఉందని స‌ర్వ‌త్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.

Updated On 5 March 2023 9:08 AM GMT
CH RAJITHA

CH RAJITHA

Next Story