విధాత: కంబోడియాలో ఘోరం జరిగింది. మొసళ్ల (crocodile) ఎన్‌క్లోజర్‌లో పడిపోయిన ఓ వ్యక్తిని ఏకంగా 40 మొసళ్లు చుట్టుముట్టి దాడి చేయడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. మృతుడు ఆ ప్రాంతంలో మొసళ్ల పెంపంకందార్ల సంఘానికి అధ్యక్షుడు కావడం గమనార్హం. ఇక్కడ మొసళ్ల పెంపకం సాధారణమైన విషయం.
అదే విధంగా 72 ఏళ్ల లువాన్ నామ్ తన ఫాం హౌస్‌లో మొసళ్లను పెంచుతున్నాడు. శుక్రవారం ఉదయం గుడ్లు పెట్టిన ఓ మొసలిని బోను నుంచి నీళ్ల ఎన్‌క్లోజర్ లోకి తీసుకెళ్లాలని ప్రయత్నించాడు. కర్రతో అదిలిస్తూ తీసుకెళ్తుండగా.. మొసలి ఒక్క సారిగా కర్రను నోట కరుచుకుని తన వైపుకు లాక్కుంది.
దీంతో లువాన్ పట్టుతప్పి మొసళ్లను పెంచతున్న కొలనులో పడిపోయాడు. అంతే ఒక్కసారిగా అందులో ఉన్న 40కి పైగా మొసళ్లు ఆయన్ను చుట్టుముట్టి కొరికేశాయి. గాయాల ధాటికి ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
అయితే.. బంధువులు వచ్చి చూసేసరికి ఆయన రెండు చేతులను మొసళ్లు ఆరగించేశాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడి కొలనులో శరీర భాగాలను వెతికి బయటకు తీశారు. 2019లో ఇదే ఫాం హౌస్‌లో రెండేళ్ల బాలికను మొసళ్లు దాడి చేసి తినేసినట్లు పోలీసులు వెల్లడించారు.