- ఉత్తర్వులు జారీ
- కొత్త సీఎస్‌పై సీఎం కేసీఆర్ కసరత్తు
- సోమేశ్‌కుమార్.. కిం కర్తవ్యం..?
విధాత: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ఈనెల 12వ తేదీలోగా ఆంధ్ర ప్రదేశ్‌కు రిపోర్ట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు తీర్పు వెలువడిన కొద్ది గంటల్లోనే కేంద్రం ప్రభుత్వం డిఓపీటీ ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం తన ఉత్తర్వులతో పాటు హైకోర్టు తీర్పు కాపీని కూడ జత చేసింది.
రాష్ట్ర విభజన సందర్భంగా సోమేశ్‌కుమార్‌ను ఏపీకి కేటాయించారు. ఏపీకి వెళ్లడం ఏమాత్రం ఇష్టంలేని సోమేశ్‌కుమార్ క్యాట్‌ను ఆశ్రయించారు. క్యాట్ తెలంగాణలో ఉండేందుకు అనుమతి ఇచ్చింది. దీనిపై కేంద్రం హైకోర్టుకు వెళ్లింది. సుధీర్ఘంగా విచారణ తర్వాత హైకోర్టు మంగళవారం క్యాట్ ఉత్తర్వులను కొట్టి వేసింది. సోమేశ్‌కుమార్ ఏపీకి వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. అప్పీల్‌కు వెళ్లడానికి అనువుగా మూడు వారాలు గడువు ఇవ్వాలని సోమేశ్‌కుమార్ తరపు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తోసి పుచ్చింది.
ఉత్తర్వుల కాపీ అందగానే రిలీవ్ కావాలని స్పష్టం చేసింది. హైకోర్టు ఉత్తర్వులు వెలువడిన నేపథ్యంలో వెంటనే రిలీవ్ అయి శుక్రవారంలోగా ఏపీకి రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర డిఓపీటీ కార్యదర్శి అంషుమన్ మిశ్రా ఉత్తర్వులు జారీ చేయటం గమనార్హం.
ఏపీకి వెళ్లడానికి విముఖత..
తెలంగాణకు సీఎస్‌గా కొనసాగుతున్న సోమేశ్‌కుమార్ ఏపీకి వెళ్లడానికి విముఖత చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. క్యాట్ ఉత్తర్వుల నేపథ్యంలో సీఎస్‌ను వెంటనే రిలీవ్ చేసి కొత్త సీఎస్‌ను నియమించా ల్సిన పరిస్థితి తెలంగాణ ప్రభుత్వానికి ఏర్పడింది. ఈ ఏడాది డిసెంబర్లో రిటైర్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏపీకి వెళ్లడం కంటే వీఆర్ఎస్ తీసుకోవడమే మేలన్న అభిప్రాయంలో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు సోమేశ్‌కుమార్ వీఆర్ఎస్ తీసుకోవడమే మేలన్న అభిప్రాయంలో ఉన్నట్లు తెలుస్తోంది.
నూతన సీఎస్‌కు కసరత్తు..
సోమేశ్‌కుమార్‌పై హైకోర్టు తీర్పు, వెంటనే కేంద్రం ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో కొత్త సీఎస్‌ను నియమించుకోవడమే మేలన్న అభిప్రాయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులు వచ్చిన నేపథ్యంలో సీనియర్ అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కాగా సీనియర్ అధికారులుగా ఉన్న రామకృష్ణారావు, అరవింద్ కుమార్ పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అయితే ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న రామకృష్ణారావు వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
సీఎంను కలిసిన సీఎస్..
హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే సీఎస్ సోమేశ్‌కుమార్ ప్రగతి భవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిశారు. దాదాపు అరగంటకు పైగా సీఎంతో సమావేశమైన సీఎస్ తిరిగి బీఆర్కే భవన్‌కు వచ్చారు. జీఏడీ అధికారులతో సమావేశమయ్యారు.