HomelatestCustody Review: కష్టపడ్డారు కానీ.. కష్టమే!

Custody Review: కష్టపడ్డారు కానీ.. కష్టమే!

Custody Review

మూవీ పేరు: ‘కస్టడీ’
విడుదల తేదీ: 12 మే, 2023
నటీనటులు: నాగచైతన్య, కృతిశెట్టి, అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్ కుమార్, సంపత్ రాజ్, వెన్నెల కిశోర్, ప్రేమి విశ్వనాధ్ తదితరులు
సంగీతం: మాస్ట్రో ఇళయరాజా, లిటిల్ మాస్ట్రో యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రాఫర్: ఎస్ఆర్ కతీర్
డైలాగ్స్: అబ్బూరి రవి
ఎడిటర్: వెంకట్ రాజన్
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకట్ ప్రభు

Custody Review: ఇటీవల విడుదలైన నాగచైతన్య సినిమాలు ‘థ్యాంక్యూ’, ‘లాల్ సింగ్ చద్దా’.. బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని చవిచూశాయి. దీంతో అతనికిప్పుడు అర్జెంట్‌గా హిట్ కావాలి.. లేదంటే అతని కెరీర్‌పై కచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. అలాగే అక్కినేని పరువు నిలబడాలంటే.. ఇప్పుడు నాగచైతన్య చేసిన ఈ ‘కస్టడీ’ సినిమా కచ్చితంగా హిట్ కావాలి. ఎందుకంటే.. ఇటీవల వచ్చిన నాగార్జున, అఖిల్ సినిమాలు అక్కినేని అభిమానులను సైతం తీవ్ర నిరాశకు గురి చేశాయి.

‘కస్టడీ’ కనుక హిట్ అయితే వారు కూడా కాస్త ఊపిరి పీల్చుకుంటారు. ఇంకా ఈ సినిమాతో చైతూ తమిళ ఎంట్రీ కూడా ఇస్తున్నాడు. అంతకుముందు తమిళ డైరెక్టర్స్‌తో మహేష్ బాబు, రామ్ వంటి వారు చేసిన స్ట్రయిట్ తమిళ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరైన విజయాన్ని అందుకోలేక పోయాయి. ఇప్పుడు తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో చైతూ ఈ ‘కస్టడీ’ చేశారు. ఆ సెంటిమెంట్‌ని జయించారా? అలాగే.. చైతూ తన లవర్ బాయ్ ఇమేజ్‌ని పక్కన పెట్టి సీరియస్ పాత్రని ఇందులో చేసినట్లుగా.. ‘కస్టడీ’ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్, ట్రైలర్ చెప్పాయి.

వెంకట్ ప్రభు ఇమేజ్, చైతూ కొత్తగా కనిపించిన విధానం.. అరవింద్ స్వామి, ప్రియమణి వంటివారు కనిపించిన తీరు.. అన్నీ సినిమాపై మంచి క్రేజ్‌కి కారణమయ్యాయి. మరి ఈ క్రేజ్ హిట్‌గా మారిందా? అసలీ ‘కస్టడీ’ సినిమాలో ఏముంది? అనేది మన రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

శివ (నాగచైతన్య) ఓ సిన్సియర్ పోలీస్ కానిస్టేబుల్. నిజాయితీకి మారుపేరు. తన స్కూల్ డేస్ నుంచి రేవతి (కృతిశెట్టి)ని ఎంతగానో ఇష్టపడుతుంటాడు. ఆ ఇష్టం ప్రేమగా మారి పెద్దయిన తర్వాత పెళ్లి చేసుకుందామంటే.. కులాల పేరిట పెద్దలు అడ్డుపడతారు. శివని కాదని వేరొకరికి ఆమెను ఇచ్చి పెళ్లి చేయడానికి పెద్దలు ప్రయత్నించగా.. ఆమె శివతో లేచిపోవడానికి సిద్ధమవుతుంది. ఈ క్రమంలో శివ ఆమె కోసం వెళుతుండగా.. ఓ యాక్సిడెంట్ అవుతుంది. ఈ యాక్సిడెంట్‌లో గ్యాంగ్‌స్టర్ రాజు (అరవింద్ స్వామి), సీబీఐ ఆఫీసర్ జార్ట్ (సంపత్ రాజ్) గొడవపడుతుండగా.. వారిద్దరినీ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కింద శివ అరెస్ట్ చేస్తాడు.

అయితే శివ ‘కస్టడీ’లో ఉన్న ఇద్దరిలో సీబీఐ ఆఫీసర్ చనిపోతాడు. శివ ‘కస్టడీ’లో ఉన్న గ్యాంగ్‌స్టర్ రాజు‌ను చంపేందుకు సీఎం దాక్షాయణి (ప్రియమణి) ఆదేశాలతో పోలీస్ కమిషనర్ నటరాజన్ (శరత్ కుమార్) ఎంటరవుతాడు. అయితే పోలీస్ కమిషనర్ బారి నుంచి రాజును కాపాడేందుకు సాధారణ కానిస్టేబుల్ అయిన శివ ఏం చేశాడు? అతనిని బెంగళూర్ తీసుకువెళ్లాలని శివ ఎందుకు ప్రయత్నించాడు? అసలు సీఎం ఎందుకు రాజును చంపమంటుంది? ఈ కథకి, రేవతి ఎలా లింక్ అవుతుంది? చివరికి శివ, రేవతిల ప్రేమ గెలుస్తుందా? అనేది తెలియాలంటే.. థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా చూడాల్సిందే.

నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు:

ఈ సినిమా కోసం నాగచైతన్య మేకోవర్ అయిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పవచ్చు. సాధారణ కానిస్టేబుల్‌గా, నిజాయితీపరుడిగా నాగచైతన్య పాత్రని దర్శకుడు చక్కగా మలిచాడు. అంతే చక్కగా నాగచైతన్య తన నటనతో మెప్పించాడు. నటుడిగా అతని స్థాయిని ఓ మెట్టు ఎక్కించే చిత్రమే కానీ.. కంటెంట్‌లో ఉన్న చిన్న చిన్న లోపాలతో.. అతని కష్టం అంతగా ఎలివేట్ కాలేదనిపిస్తుంది.

కృతిశెట్టి ఇందులో ప్రత్యేకంగా చేసింది ఏమీ లేదు. కాకపోతే ఆమె పాత్రకు కూడా యాక్షన్ సన్నివేశాలను జోడించారు. అదొక్కటే కాస్త కొత్తగా ఉంటుంది తప్పితే.. మిగతా అంతా ఇంతకు ముందు ఆమె సినిమాలలో కనిపించినట్లే ఉంటుంది. కరడుగట్టిన, భయంకరమైన విలన్‌గా అరవింద్ స్వామి, కమిషనర్ పాత్రలో శరత్ కుమార్ మెప్పిస్తారు. వారి పాత్రలు కూడా ఈ సినిమాకి హైలెట్ అనేలా ఉంటాయి.

అతిథి పాత్రలో రాంకీ, జీవా కనిపిస్తారు. ఇద్దరి పాత్రలో దర్శకుడు చక్కగా డిజైన్ చేశాడు. కాకపోతే ఇంకాస్త సేపు వాళ్లు ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఇంకా ఇతర పాత్రలలో నటించిన ప్రియమణి, సంపత్ రాజ్, ప్రేమి, వెన్నెల కిశోర్, జయప్రకాష్ వంటి వారంతా.. తమ పాత్రల పరిధి మేర ఈ సినిమాకు హెల్ప్ అయ్యే ప్రయత్నం చేశారు.

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే..

సాంకేతికంగా ఈ సినిమాకు ప్రధాన హైలెట్ నిర్మాణ విలువలు అనే చెప్పుకోవాలి. ఆ తర్వాత కెమెరా వర్క్. ఈ రెండూ ఈ సినిమాని థియేటర్లలో చూసే ప్రేక్షకులని మెప్పిస్తాయి. పాటలు, నేపథ్య సంగీతం విషయంలో ఇళయరాజా, వాళ్లబ్బాయి యువన్ శంకర్ రాజాలు పనిచేసినా.. అంత గొప్పగా లేవనే చెప్పుకోవాలి. పాటలైతే అస్సలు అర్థమే కాలేదు. ఒక్క పాట మాత్రం ఓకే అనిపిస్తుంది.

ఎడిటింగ్ పరంగా ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు, సెకండాఫ్‌లో కొన్ని సీన్లకు కత్తెర పడాల్సింది. మరీ ముఖ్యంగా చైతూ, కృతిశెట్టిల లవ్ ట్రాక్‌ని పూర్తిగా లేపేసినా.. సినిమా ఫ్లో బాగుండేది. ఆర్ట్ డైరెక్టర్ తన పనితనం కనబరిచాడు. జైలు సెట్, అండర్ వాటర్ సీక్వెన్స్ కోసం అతను వాడిన సెట్స్ బాగుంటాయి. ఇంకా ఇతర సాంకేతిక నిపుణులు వారి పనితనం కనబరిచారు.

ఇక దర్శకుడు వెంకట్ ప్రభు సినిమాలకు స్క్రీన్‌ప్లే పెట్టింది పేరు. ఆయన సినిమాలకు కథ ఎలా ఉన్నా.. స్క్రీన్‌ప్లే‌తో మ్యాజిక్ చేస్తుంటాడు. కానీ ఈ సినిమాలో అతను చేసిన ప్రయోగం వర్కవుట్ కాలేదనిపిస్తుంది. అద్భుతం అనే రేంజ్‌లో రావాల్సిన టాక్.. ఓకే పర్లేదు అనేలానే వస్తుంది అంటే.. కచ్చితంగా ఇది అతని లోపమనే చెప్పుకోవాలి.

విశ్లేషణ:

ఈ సినిమా మెయిన్ పాయింట్ గురించి చెప్పుకోవాలంటే.. విలన్‌ని హీరో కాపాడుకోవడమే. సాధారణ కానిస్టేబుల్.. ఓ కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ని.. తన ‘కస్టడీ’‌లో ఎలా కాపాడాడు? అనేదే మెయిన్ కథాంశం. దీనిని చెప్పడానికి దర్శకుడు వెంకట్ ప్రభు రాసుకున్న స్క్రీన్‌ప్లే అంతగా ఆకట్టుకోలేదు. ముఖ్యంగా చైతూ, కృతిల లవ్ ట్రాక్, అలాగే సినిమాలో వచ్చే ఓ ప్లాఫ్‌బ్లాక్ ఎపిసోడ్ ఏమంత ఆసక్తికరంగా ఉండవు.

ఇక రాజును కాపాడుకోవడానికి చైతూ చేసే ప్రతి పనీ.. ప్రేక్షకుడిని మెప్పిస్తుంది. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్‌కు ముందు వచ్చే అండర్ వాటర్ యాక్షన్ ఎపిసోడ్ ప్రేక్షకులకు మంచి కిక్ ఇస్తుంది. అయితే సెకండాఫ్‌లో ఈ స్టోరీపై దర్శకుడు ఇంట్రస్ట్‌ని కలిగించేలా చేయలేకపోయాడు. అదే ఈ సినిమా ప్రధాన మైనస్‌గా మారింది. ఇంకాస్త ఇంట్రస్టింగ్‌గా కథని నడిపించగలిగినట్లయితే.. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ లిస్ట్‌లోకి చేరేది.

ముఖ్యంగా ఫ్లాప్‌బ్యాక్ ఎపిసోడ్‌తో.. మొదటి నుంచి ఉన్న ఇంట్రస్ట్‌ని పోగోట్టేశాడు. ఏదో ఊహించుకున్న ప్రేక్షకులకి.. ఇంకేదో తెరపై జరుగుతున్నట్లుగా.. మరీ ముఖ్యంగా అంతా తెలిసిపోయినట్లుగా.. రొటీన్ అనిపిస్తుంది. కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ మినహా.. సెకండాఫ్‌లో దర్శకుడు కొత్తగా చెప్పిందేం లేదు. మధ్యలో హీరోహీరోయిన్ల లవ్ సీన్లు వెగటు పుట్టిస్తాయి. అలాగే సినిమా ముగించిన తీరు కూడా మరీ రొటీన్‌గా అనిపిస్తుంది. మొత్తంగా అయితే.. ‘కస్టడీ’ అంత గొప్పగా ఏం లేదు కానీ.. ఓకే. కాకపోతే.. యాక్షన్ ఎపిసోడ్స్ కోసం, అలాగే చైతూ యాక్టింగ్ కోసం మాత్రం ఒకసారి చూడొచ్చు. అంతే తప్ప, ఇందులో చెప్పుకోవడానికి పెద్దగా మ్యాటర్ అయితే ఏం లేదు.

కాకపోతే.. ‘ఏజెంట్‌’తో పోల్చుకుంటే అక్కినేని అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు. అలాగే తమిళ దర్శకుడితో చేసిన సినిమాల సెంటిమెంట్‌ కూడా జయించినట్లే. తమిళ ప్రేక్షకులకి ఈ సినిమా ఎక్కే అవకాశాలే ఉన్నాయి. ఓవరాల్‌గా అయితే సినిమా కోసం చైతూ బాగా కష్టపడ్డాడు.. కానీ కంటెంట్ నడిచిన తీరు మాత్రం కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తుంది.

ట్యాగ్‌లైన్: కష్టపడ్డారు కానీ.. కష్టమే!
రేటింగ్: 2.5/5

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular