CWC | ఐక్యతే కాంగ్రెస్‌కు శ్రీరామరక్ష విభేదాలను విడిచిపెట్టండి టికెట్లకు పైరవీలు చేయకండి ఇది విశ్రాంతి సమయం కాదు నిత్యం ఓటర్ల మధ్యనే ఉండండి విధాత, హైదరాబాద్: తెలంగాణ మనదే.. ఢిల్లీ మనదే.. కొద్ది కాలం కష్ట పడి పని చేయండి.. అని ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. సీడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా తెలంగాణ పార్టీ నాయకులతో అగ్రనేతలు ప్రత్యేకంగా మాట్లాడినట్లు తెలిసింది. తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాలలో […]

CWC |
- ఐక్యతే కాంగ్రెస్‌కు శ్రీరామరక్ష
- విభేదాలను విడిచిపెట్టండి
- టికెట్లకు పైరవీలు చేయకండి
- ఇది విశ్రాంతి సమయం కాదు
- నిత్యం ఓటర్ల మధ్యనే ఉండండి
విధాత, హైదరాబాద్: తెలంగాణ మనదే.. ఢిల్లీ మనదే.. కొద్ది కాలం కష్ట పడి పని చేయండి.. అని ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. సీడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా తెలంగాణ పార్టీ నాయకులతో అగ్రనేతలు ప్రత్యేకంగా మాట్లాడినట్లు తెలిసింది. తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తున్నామని, అలాగే పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఇండియా కూటమి గెలుస్తుందని రాహుల్ గాంధీ స్పష్టం చేసినట్లు సమాచారం.
ట్రాప్‌లో పడకండి.. ఏమి చేస్తామో అదే చెప్పండి
మనం గెలుస్తున్నాం.. ఎదుటి వాడి ట్రప్‌లో పడకండని నేతలను రాహుల్ ప్రత్యేకంగా హెచ్చరించినట్లు తెలిసింది. పరిపాలనలో బీజేపీ ఘోరంగా విఫలమైందని, దీనిని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే సనాతన ధర్మం పేరిట సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్నదని, మనం ఆ ట్రాప్‌లో పడవద్దని చెప్పారని సమాచారం. తమిళనాడు మంత్రి ఉదయ నిధి స్టాలిన్ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు, చివరకు ప్రధాని మోదీ కూడా దిగజారి విమర్శలు చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారని తెలిసింది.
వాళ్ల విమర్శలకు మనం కౌంటర్ ఇవ్వాల్సిన పనిలేదని, మనం ప్రజలకు సుపరిపాలన అందించాలని, రోటి, కప్‌డా, మకాన్ కల్పించాలని చెప్పారని సమాచారం. ఈ మేరకు మనం ప్రజలకు ఏమి చేయాలనుకు న్నామో అదే చెప్పాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటనూ అమలు చేయాలని, అప్పుడే ప్రజల మన్నన పొందాతామని రాహుల్ నేతలకు స్పష్టం చేశారని తెలిసింది.
మార్పు కోరుకుంటున్న దేశం
దేశం మార్పు కోరుకుంటుంది. సంకేతాలు మన ముందే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో జరిగిన కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో గెలిచాం. డిసెంబర్‌లో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తున్నాం. పార్లమెంటులోనూ గెలుస్తాం… ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇది విశ్రాంతి తీసుకునే సమయం కాదు.. రేయింబవళ్లు కష్టపడి పని చేయాలని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నేతలకు నిర్దేశం చేశారు.
ఇగోలు వద్దు - కలిసి పని చేయండి
నేను పెద్దా? నువ్వు పెద్దా?.. ఎవరు సీనియర్? ఎవరు జూనియర్? ఇలాంటి ఇగోలు వదిలేయాలని పార్టీ నాయకత్వానికి అగ్రనేతలు విస్పష్టంగా చెప్పారని తెలిసింది. ‘ఇగోలకు పోయి విమర్శలు చేసుకొని ఒకరికొకరు సహకరించుకోక పోవడంతో నష్టపోయాం.. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తరువాత కూడా ఇక్కడ గెలువలేక పోయాం. ఇలాంటి నష్టాలు జరుగకుండా విజయంతో ముందుకు పోవాలంటే నాయకులంతా ఇగోలు వదలండి… విమర్శలు మానుకోండి.. మంచి ఫలితం వస్తుంది’ అని చెప్పారని సమాచారం.
తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలు అంతా మనవైపు చూస్తున్నారని, మనం రావాలని కోరుకుంటున్నారని, ఈ సమయంలో మనం ఐక్యంగా, దృఢంగా నిలబడాలని కోరుకుంటున్నారని నేతలకు రాహుల్ స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రజల్లో మనం గెలువాలన్న బలమైన ఆకాంక్ష ఉన్నదని మరోసారి నేతలకు తెలియ జేశారు.
మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ మనందరి జీవితాల్లో ఒడిదుడుకులుంటాయని, అన్ని సందర్భాల్లో నాయకులు క్రమశిక్షణతో ఉండాలని అన్నారు. పార్టీ నష్టపోయేలాగా ఎలాంటి ఇగోలకు, విమర్శలకు పాల్పడవద్దని హెచ్చరించారు. క్రమశిక్షణ లేకుండా ఎవ్వరూ నాయకులు కాలేరన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలువడానికి ఐక్యతే కారణం. అక్కడ వచ్చిన ఫలితాలను మీరే చూశారు కదా.. అని మల్లిఖార్జున ఖర్గే నేతలకు విశదీకరించారు.
