విధాత: తెలంగాణ రాష్ట్రంలో నాగార్జునసాగర్ కృష్ణానది తీరంలో 274 ఎకరాలలో అంతర్జాతీయ స్థాయిలో నిర్మించిన బుద్ధవనం (Buddhavanam) సందర్శించడానికి దలైలామా (Dalai Lama) ఆసక్తి కనబర్చారని బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య (Mallepally Lakshmaiya) తెలిపారు. మార్చి 13న ధర్మశాలలో దలైలామాను కలుసుకొని బుద్ధ వనాన్ని సందర్శించవలసిందిగా ఆహ్వానించినట్లుగా ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా 2006లో కాలచక్ర పూజ యాత్రలో భాగంగా దలైలామా బుద్ధ వనంలో నాటిన రావి మొక్క వృక్షంగా మారిందని దానికి సంబంధించిన ఫోటోలను వారికి అందించి బుద్ధవనం జ్ఞాపికను అందజేశారు. బుద్ధవనం ప్రత్యేకతలు, నిర్మాణ శైలి, అపూర్వమైన శిల్ప సంపద గురించి దలైలామాకు వివరించారు.
బుద్ధవనం కన్సల్టెంట్ బౌద్ధ విషయ నిపుణులు ఈమని శివనాగిరెడ్డి ఈ సందర్భంగా ఆయన రాసిన బుద్ధిస్టు ఆర్కియాలజీ ఇన్ తెలంగాణ చారిత్రక పుస్తకాన్ని దలైలామాకు బహూకరించారు. వీరితో పాటు ఓ ఎస్ డి కే.సుధాన్ రెడ్డి, సలహాదారు ఆచార్య సంతోష్ రౌత్, బౌద్ధ అభిమానులు కేకే రాజా, రామకృష్ణoరాజులు తదితరులు పాల్గొన్నారు.