- నానాటికీ కృషించి పోతున్న ఓట్ల శాతం..
- అయినా బీరాలు పోతున్న బీజేపీ
విధాత: గుజరాత్ విజయాన్ని బీజేపీ ప్రపంచానికి బూతద్దంలో చూపుతున్నది. ఇక, వచ్చే సాధారణ ఎన్నికల్లోనూ తమదే విజయమని చెప్పుకొంటున్నది. ఇదంతా మోదీపై ప్రజలకున్న విశ్వాసానికి ప్రతీక అంటున్నది. ఇదే సందర్భంలో ఢిల్లీలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను, హిమాచల్ ప్రదేశ్తో పాటు, యూపీలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను గుజరాత్ మాటున దాచిపెడ్తున్నది. మోదీ సమ్మోహన శక్తి ముందు మరెవరూ నిలువలేరంటూ వాస్తవాలను కప్పి పుచ్చుతున్నది. వాపును బలుపు అని నమ్మబలుకుతున్నది.
కొడి గడుతున్న మోదీ సమ్మోహన శక్తి..
ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న నేత మోదీ అని బీజపీ చెప్పుకొంటున్నది. 2019 లోక్సభ ఎన్నికలు, ఆ తర్వాత వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, వాటిలో బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం చూస్తే మోదీ గ్రాఫ్ ఎలా పడిపోతున్నదో తేటతెల్లం అవుతుంది. హర్యాణా లోక్ సభ ఎన్నికల్లో 58.2శాతం ఓట్లు వస్తే, కొన్ని నెలల్లోనే అది 36.5శాతానికి పడిపోయింది.
ఇక యూపీలో 49.97శాతం ఉంటే అది 41.3శాతానికీ, మహారాష్ట్రలో 27.8 శాతం నుంచి 25.7శాతానికీ, బెంగాల్లో 40.6శాతం నుంచి 37.9శాతానికీ, అస్సాంలో 36.14శాతం ఉంటే, 33.2శాతానికి పడిపోయింది. మొత్తంగా చూస్తే… 2019 లోక్ సభ ఎన్నికల తర్వాత 8 రాష్ట్రాల్లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో బీజేపీ ఓటింగ్ శాతం గణనీయంగా పడిపోయింది. ఢిల్లీ, హర్యాణా, బిహార్, యూపీ, జార్ఖండ్, మహారాష్ట్ర, బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో 2019లో సరాసరి 43.1 శాతంగా ఉంటే, అది 33.3శాతానికి పడిపోవటం మోదీ సమ్మోహనా శక్తికి నిదర్శనమేనా!
ఇది బీజేపీ గెలుపేనా?
గుజరాత్లో బీజేపీ గెలుపు అనటం కంటే, కాంగ్రెస్ సంస్థాగత వైఫల్యం అనటం సబబు. కాంగ్రెస్ నేతల్లో కనీస సఖ్యత, సమన్వయం లోపమే బీజేపీ విజయానికి బాటలు వేసంది. బీజేపీ ఎదురులేని శక్తి అయితే.. అధికారంలో ఉండి కూడా హిమాచల్ ప్రదేశ్లో ఎందుకు ఓటమి పాలైందో వారే చెప్పాలె. అంతే కాదు, ఉత్తర ప్రదేశ్లో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ గల్లంతైంది. సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ ఉప ఎన్నికల్లో విజయదుందుభి మోగించాయి. విపక్షాలు చేతులు కలిపితే బీజేపీ కోరలు పీకటం సులువేనని రుజువు చేశాయి.
అతిపెద్ద పార్టీ బొక్కబోర్లా..
ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీరాలు పలికే బీజేపీ కేజ్రీవాల్ ముందు చతికిల పడింది. ఢిల్లీ మున్సిపాలిటీలో గత పదిహేనేండ్లుగా తిష్ట వేసిన బీజేపీ ఈసారి బోర్లా పడింది. సంక్షేమం, అభివృద్ధి నినాదాలుగా కేజ్రీవాల్ బీజేపీ విభజన రాజకీయాలకు చెక్ పెట్టారు. విద్య, వైద్యం, మంచినీరు, పారిశుధ్యం ప్రచారాస్త్రాలుగా ఆమ్ ఆద్మీపార్టీ బీజేపీ కోరలు పీకింది. మత రాజకీయాలను అభివృద్ధి సంక్షేమాలతో నిలువరించ వచ్చని చాటిచెప్పింది.