Saturday, April 1, 2023
More
    HomelatestDelhi Liquor Scam | నేడు ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత.. అరుణ్ పిళ్ళై, బుచ్చిబాబు...

    Delhi Liquor Scam | నేడు ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత.. అరుణ్ పిళ్ళై, బుచ్చిబాబు వాంగ్మూలాలు కీలకం..!

    Delhi Liquor Scam | ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసు (Delhi Liquor Scam) లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) గురువారం ఈడీ (ED) విచారణకు హాజరవనున్నారు. గత శనివారం కవితను ఈడీ ప్రశ్నించిన విషయం తెలిసిందే. దాదాపు తొమ్మిది గంటల పాటు సాగిన విచారణలో ఈడీ అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానం దాటవేసినట్లు ఈడీ పేర్కొంది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విచారణ జరిపిన అధికారులు 16న మరోసారి విచారణకు రావాలని ఆదేశించారు. విచారణ నేపథ్యంలో కవిత బుధవారమే ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అలాగే పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ సైతం ఢిల్లీకి బయలుదేరారు. ఈడీ విచారణను సవాల్‌ చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఎమ్మెల్సీకి అనుకూలంగా మధ్యంతర బెయిల్‌ ఇచ్చేందుకు కోర్టు బుధవారం నిరాకరించింది. అయితే, పిటిషన్‌ లిస్ట్‌ చేసేందుకు కోర్టు అంగీకరించింది. ఈ పిటిషన్‌పై ఈ నెల 24న విచారించనున్నది.

    మోదీ సర్కారుపై కవిత ఫైర్‌

    మోదీ ప్రభుత్వంపై కవిత మండిపడ్డారు. ప్రధానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా పిలిచి ప్రశ్నిస్తున్నారని, ఇది ఏమాత్రం సరికాదన్నారు. ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, ఏజెన్సీలు మొదట వ్యాపార సంస్థలపై దాడి చేసి వాటిని నియంత్రించడానికి ప్రయత్నించాయని.. ఆ తర్వాత రాజకీయ పార్టీలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. తాము ఏ తప్పూ చేయలేదని, పోరాడుతామని స్పష్టం చేశారు.

    బీఆర్‌ఎస్‌-బీజేపీ పోస్టర్ల వార్‌

    ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవిత విచారణ సందర్భంగా హైదరాబాద్‌లో మరోసారి పోస్టర్లు కలకలం సృష్టించాయి. బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య పోస్టర్ వార్ నడుస్తున్నది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌ ‘కనబడుటలేదు’ అంటూ పోస్టర్లు వేశారు. ‘ఎమ్మెల్యేల కొనుగోలులో సిద్ధహస్తుడు’.. ‘బహుమానం మోదీ రూ.15లక్షలు’ అంటూ పోస్టర్లు వెలిశాయి. ఇంతకు ముందు కవిత విచారణ సందర్భంగా.. ఈడీ, సీబీఐలతో బీజేపీ బెదిరింపులకు పాల్పడుతుందంటూ హైదరాబాద్‌లో పోస్టర్లు వెలిశాయి. బీజేపీలో చేరక ముందు, చేరిన తర్వాత అంటూ నగరంలో పలుచోట్ల పోస్టర్లు ప్రదర్శించారు. కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింథియా, అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ, వెస్ట్ బెంగాల్ బీజేపీ నేత సువేంధు అధికారి, ఏపీలో సుజనాచౌదరి, కేంద్ర మాజీ మంత్రి నారాయణ్ రాణే ఫొటోలు ఫ్లెక్సీలో ఉన్నాయి. అలాగే సీఐఎస్‌ఎఫ్‌ రైజింగ్‌ డే సందర్భంగా హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన సమయంలో ‘వాషింగ్‌ పౌడర్‌ నిర్మా’ అంటూ పోస్టర్లు వెలిశాయి.

    మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును ప్రశ్నించిన ఈడీ

    లిక్కర్‌ పాలసీ వ్యవహారంలో బుధవారం ఈడీ బీఆర్‌ఎస్‌ నాయకురాలు కవిత మాజీ ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబును విచారించింది. ఈ కేసులో సీబీఐ అరెస్టు చేయడంతో బుచ్చిబాబు బెయిల్‌పై బయటకు వచ్చారు. వ్యాపారవేత్త అరుణ్‌ రామచంద్రన్‌ పిళ్లైని కలిపి విచారించినట్లు తెలిసింది. అయితే, ఈ ఇద్దరు చెప్పిన సమాధానాల ఆధారంగా ఇవాళ కవితను విచారించనున్నట్లు సమచారం. లిక్కర్‌ పాలసీ రూపకల్పన, హోటల్స్‌లో జరిగిన సమావేశాలు, డ్రాఫ్ట్ పాలసీ తొలుత నిందితులకు రావడం, రూ.100 కోట్ల ముడుపులు వ్యవహారం, ఆధారాల ధ్వంసం సహా అనేక అంశాలపై నిందితుల నుంచి ఈడీ సమాధానాలు రాబట్టనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఫిబ్రవరి 28వ తేదీ తిహార్ జైలులో బుచ్చిబాబు నుంచి కీలక సమాచారాన్ని ఈడీ రాబట్టింది. ఈ క్రమంలో కవిత విచారణకు అరుణ్ పిళ్ళై, బుచ్చిబాబు వాంగ్మూలాలు కీలకంగా మారనున్నాయి.

    spot_img
    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular