Delhi Liquor Scam
విధాత: దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam)లో రాజకీయ నాయకులు, ఇతరులను ఈడీ(ED) అరెస్టు(Arrest) చేసింది. ఈ కేసులో కీలక పాత్ర ధారిగా ఆప్ నేత మనీశ్ సిసోడియా (Maneesh sisodiya)ను నిన్న కోర్టులో హాజరపరిచి, ఈ కేసుకు సంబంధించి రిమాండ్ రిపోర్టును కూడా ఈడీ సమర్పించింది. ఇందులో ఇప్పటిరవరకు బైటికి వెల్లడికాని అనేక విషయాలను ఈడీ బహిర్గతం చేసింది. ఈ కేసులో ఇవాళ కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారిస్తున్నది. అసలు ఈ కేసులో ఎప్పుడు ఏం జరిగింది అంటే..
ఈ స్కాంలో.. ఎప్పుడు ఏం జరిగింది..
- 2022 ఆగస్టు 17 ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై కేసు నమోదైంది.
- 2022 సెప్టెంబర్ 21న సీబీఐ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది.
- 2022 సెప్టెంబర్ 27న ఈ కేసులో ఆప్ కమ్యూనికేషన్ ఇన్‌చార్జి విజయ్‌నాయర్‌ను ఈడీ అరెస్టు చేసింది. ఈ స్కాంలో ఇదే మొదటి అరెస్టు.
- 2022 సెప్టెంబర్ 28న ఇండో స్పిరిట్స్ యజమాని సమీర్ మహేంద్రు అరెస్ట్.
- 2022 అక్టోబర్ 10న రాబిన్ డిస్టలరీస్ డైరెక్టర్ అభిషేక్ బోయినపల్లి అరెస్ట్.
- 2022 నవంబర్ 11న పి. శరత్‌చంద్రారెడ్డి , బినోయ్‌బాబు అరెస్ట్.
- 2022 నవంబర్ 13న విజయ్ నాయర్ అరెస్ట్.
- 2022 నవంబర్ 26న ఈడీ తొలి ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. సమీర్ మహేంద్రు కంపెనీల్లో రూ. 291 అక్రమ లావాదేవీలను ఇందులో ప్రస్తావించింది.
- 2022 నవంబర్ 29న అమిత్ అరోరాను ఈడీ అరెస్టు చేసింది.
- 2022 నవంబర్ 30 అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించింది
- 2022 డిసెంబర్ 2న విచారణకు హాజరుకావాలని కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది.
- 2022 డిసెంబర్ 3న ఎఫ్‌ఐఆర్ కాపీ కావాలని కవిత సీబీఐకి లేఖ రాసింది.
- 2022 డిసెంబర్ 11న సీబీఐ కవితను ప్రశ్నించింది.
- 2023 జనవరి 6న 13,657 పేజీలతో అనుబంధ ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఇందులో సౌత్‌గ్రూప్ నుంచి రూ. 100 కోట్ల ముడుపులను ప్రస్తావించింది.
- ఈ సప్లిమెంటరీ ఛార్జిషీట్‌లో 17 మంది పేర్లను చేర్చింది. ఈ స్కాం వల్ల ఢిల్లీ ప్రభుత్వ ఖజానాకు రూ.2,873 కోట్ల నష్టం వాటిల్లినట్టు అంచనా వేసింది.
- 2023 ఫిబ్రవరి 2న సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను సీబీఐ ప్రత్యే కోర్టు పరిగణనలోకి తీసుకున్నది. రౌస్ అవెన్యూ కోర్టు నిందితులకు నోటీసులు జారీ చేసింది.
- 2023 ఫిబ్రవరి 8న గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్టు చేసింది. ఇదే రోజు గౌతమ్ మల్హోత్రాను ఈడీ అరెస్టు చేసింది.
ఢీల్ ఏమిటి?
- ఆప్‌కు సౌత్‌గ్రూప్ వందకోట్ల ముడుపులు
- సౌత్ గ్రూప్‌కు ఢిల్లీ లిక్కర్‌లో హోల్‌సేల్, రిటైల్ డీలర్‌షిప్స్
ఇక ఈ కేసులో ఈ నెల 9న విచారణకు హాజరుకావాలని ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఆ రోజు తనకు ముందస్తు షెడ్యూల్ కార్యక్రమాలు ఉన్నందున ఫిబ్రవరి 11న హాజరవుతానని చెప్పిన కవిత ఈరోజు ఈడీ ముందుకు వెళ్లింది.
ప్రస్తుతం ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని ఒక మహిళా అధికారి సమక్షంలోని నలుగురు సభ్యుల బృందం అరుణ్‌పిళ్లై అఫిడవిట్ ఆధారంగా కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు వాట్సప్ ఛాట్ ఆధారంగా ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఈ విచారణను మొత్తం ఈడీ వీడియో తీస్తున్నది. ఈ విచారణ సాయంత్రం వరకు జరుగుతుంది అంటున్నారు. విచారణ అనంతరం ఏం జరగబోతుంది? అనేది ఉత్కంఠ నెలకొన్నది.