Dharani | ధరణి చేస్తున్న దగా! నాడు అన్నీ ఉచితం.. నేడు అన్నీ చార్జ్ (Part-2 )
Dharani Part-2 గతంలో సేవలన్నీ ఉచితమే నేడు ప్రతిదానికీ సర్వీస్ చార్జ్ నిత్యం గ్రామాల్లో భూవివాదాలు పరిష్కరించే వ్యవస్థ ఎక్కడ? ప్రైవేట్ కంపెనీ వద్ద రికార్డులు దుర్వినియోగమైతే ఎవరు బాధ్యులు? విధాత హైదరాబాద్ ప్రతినిధి: ధరణి పోర్టల్ రాష్ట్ర ప్రజలను దగా చేస్తోందన్న ఆరోపణలు తలెత్తుతున్నాయి. గతంలో పట్టాదార్ పాస్ పుస్తకం, ఇతర ఏ విధమైన సేవలైనా ఉచితంగా అందేవి. నేడు ధరణిలో ఏ చిన్న సర్వీసుకు దరఖాస్తు చేయాలన్నా తక్కువలో తక్కువ రూ. వెయ్యి చెల్లించాల్సిన […]

Dharani Part-2
- గతంలో సేవలన్నీ ఉచితమే
- నేడు ప్రతిదానికీ సర్వీస్ చార్జ్
- నిత్యం గ్రామాల్లో భూవివాదాలు
- పరిష్కరించే వ్యవస్థ ఎక్కడ?
- ప్రైవేట్ కంపెనీ వద్ద రికార్డులు
- దుర్వినియోగమైతే ఎవరు బాధ్యులు?
విధాత హైదరాబాద్ ప్రతినిధి: ధరణి పోర్టల్ రాష్ట్ర ప్రజలను దగా చేస్తోందన్న ఆరోపణలు తలెత్తుతున్నాయి. గతంలో పట్టాదార్ పాస్ పుస్తకం, ఇతర ఏ విధమైన సేవలైనా ఉచితంగా అందేవి. నేడు ధరణిలో ఏ చిన్న సర్వీసుకు దరఖాస్తు చేయాలన్నా తక్కువలో తక్కువ రూ. వెయ్యి చెల్లించాల్సిన పరిస్థితి. ఒక వేళ ఇచ్చినా దరఖాస్తు తిరస్కరణకు గురైనా మళ్లీ నగదు చెల్లించి దరఖాస్తులను సమర్పించాల్సిందే.
ఇచ్చిన ఫిర్యాదుకు ట్రాకింగ్ వ్యవస్థ లేదు. సమస్యల పరిష్కారానికి చేసే ప్రతి దరఖాస్తుకు వేలల్లో ఖర్చు అవుతుంది. దరఖాస్తు చేసుకున్నా పరిష్కారం కావడం లేదు, చెల్లించిన సొమ్ము తిరిగి రావడం లేదు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా తిరస్కరిస్తూ.. మళ్లీ దరఖాస్తు చేసుకోమని చెబుతున్నారు తప్ప.. సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు.
ఇప్పటికే లక్షల సంఖ్యలో దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. సుమారు మరో 5-10 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు ప్రచారం. ధరణి అనేది ప్రభుత్వానికి రోజువారి ఆదాయ వనరుగా మారిందనే అభిప్రాయం రైతుల నుంచి వ్యక్తం అవుతున్నది. రాష్ట్రంలో ధరణి వెబ్ పోర్టల్ అందుబాటులోకి వచ్చాక భూ వివాదాలు నిత్యకృత్యంగా మారాయని అనేక మంది రైతులు చెబుతున్నారు.
పరిష్కార వ్యవస్థలు ఎక్కడ?
గతంలో గ్రామాలలో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ యంత్రాంగం ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయింది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏ ఒక్క అధికారికి అధికారాలే లేని కారణంగా ఏ ఒక్క భూ సమస్యను పరిష్కరించలేని పరిస్థితి నెలకొన్నది. దీంతో ప్రతి రోజూ వందల మంది రైతులు రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ కోర్టులను ఆశ్రయిస్తున్నారు. తప్పులు చేసింది ప్రభుత్వం.. కానీ కోర్టు చుట్టూ తిరిగేది మాత్రం రైతులా ఇదెక్కడి న్యాయం అనే ప్రశ్న ఉత్పన్నం అవుతున్నది.
తెలంగాణ తప్ప.. దేశమంతటా ఎన్ఐసీ చేతుల్లోనే..
దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో భూ పరిపాలనా, నిర్వాహణకు సంబంధించిన వెబ్‌సైట్లు, పోర్టల్స్ అన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎన్ఐసీ సంస్థనే నిర్వహిస్తోంది. ఈ సంస్థ అత్యంత పారదర్శకంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడంతోపాటు సమర్థవంతంగా నిర్వహిస్తున్నది.
కానీ ఒక ప్రభుత్వ రంగ సంస్థను కాదని, తెలంగాణ రాష్ట్రంలోని సమగ్ర భూముల వివరాలను, రైతుల భూ యాజమాన్య హక్కుల్ని ఒక ప్రైవేటు కంపెనీ చేతిలో పెట్టడంపై అనేక అనుమానాలున్నాయి. భవిష్యత్తులో ఈ వివరాలు ఇతరుల చేతుల్లోకి వెళితే బాధ్యత ఎవరిదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -(బూడిద సుధాకర్)
