Tuesday, January 31, 2023
More
  Homelatestసంక్రాంతి రిలీజ్: దిల్ రాజు డామినేషన్ మొదలైంది

  సంక్రాంతి రిలీజ్: దిల్ రాజు డామినేషన్ మొదలైంది

  విధాత‌: మరో పది రోజుల్లో సంక్రాంతి సంబరం మొదలుకానుంది. సంక్రాంతికి పోటా పోటీగా సినిమాలు విడుదల అవుతున్నాయి. ఒకవైపు రెండు భారీ తెలుగు చిత్రాలు నువ్వా నేనా అన్నట్టు కోడిపుంజుల్లా తలపడుతున్నాయి. అందులో ఒకటి మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ కాగా.. రెండోది నందమూరి నట‌సింహం బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’.

  వీరేమీ పాన్ ఇండియా రేంజ్‌లో ఫోకస్ పెట్టడం లేదు. కేవలం తెలుగువారిని, తెలుగు రాష్ట్రాలను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. అందులో నేరుగా తెలుగులో వస్తున్న చిత్రాలు రెండు కాబట్టి ఈ విషయంలో ఆయా చిత్రాల అభిమానులతో పాటు ఈ రెండు చిత్రాలను ఒకేసారి నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ వారు కూడా ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు.

  ప్రమోషన్ల‌ వేగాన్ని పెంచుతున్నారు. ఇప్పటికే మైత్రి నిర్మాతలకు ఈ రెండు చిత్రాల శాటిలైట్, డిజిటల్ హక్కుల ద్వారానే భారీ మొత్తంలో ఆదాయం చేకూరింది. ఈ రెండు సినిమాలు థియేటర్ల వద్ద సందడి చేస్తే మాత్రం మరిన్ని లాభాలు ఖాయం.

  కానీ ఇదే సమయంలో ఈ రెండు చిత్రాలకు పోటీగా అన్నట్టు కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ నటించిన ‘వారిసు’ చిత్రాన్ని దిల్ రాజు ‘వారసుడు’గా తెలుగులో భారీ స్థాయిలో విడుదల చేస్తున్నాడు. ఈ చిత్రం తమిళ వెర్ష‌న్‌కు కూడా దిల్ రాజే నిర్మాత కావడం విశేషం. మరో విశేషమేంటంటే ఈ మూవీకి తెలుగు దర్శకుడైన వంశీ పైడిపల్లి డైరెక్టర్. దాంతో సహజంగానే ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి.

  సంక్రాంతి దిల్ రాజుకు బాగా కలిసి వచ్చిన పండుగ. అలాగే చిరు బాలయ్యలకు కూడా. దీంతో పోటీ కాస్త ద్విముఖం నుంచి త్రిముఖంలోకి మారింది. ఇప్పుడు మూడు ముక్క‌లాట మొద‌లైంది. మరో వైపు అజిత్ కూడా తెగించడానికి సిద్ధమవుతున్నాడు. మొత్తంగా చతుర్ముఖ పోరుకు సంక్రాంతి సిద్ధమైంది.

  ఇక దిల్ రాజు తెలుగులో స్టార్ ప్రొడ్యూసర్, అంతేకాదు భారీ డిస్ట్రిబ్యూటర్, బయ్యర్, ఎగ్జిబిటర్ కూడా. నైజాంతో పాటు ఉత్తరాంధ్రలోని ఎన్నో థియేటర్లు ఆయన చేతిలో ఉన్నాయి. అవి ఆయన కను సైగల ప్రకారం నడుస్తూ ఉంటాయి.. దీంతో వారసుడికి ఎక్కువ థియేటర్లు ఇప్పించే పనిలో ఆయన పడ్డాడు.

  దీనిపై తెలుగు సినీ పరిశ్రమలో ఘాటైన విమర్శలు వస్తున్నప్పటికీ ఆయన లెక్క చేయడం లేదు. కంటెంట్ ఉంటేనే ఇక్కడ నిలబడతాం. కంటెంట్ ఉంటే సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఇక్కడ ఎవరి బిజినెస్ వారిదే అంటున్నాడు.

  దిల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఫస్ట్ వీకెండ్ తర్వాత హిట్ టాక్ వచ్చిన సినిమాలకు అనుగుణంగా ఎగ్జిబిటర్లు థియేటర్ల విషయంలో మార్పులు చేర్పులు చేస్తారు. ఇందుకు సంబంధించి అగ్రిమెంట్లు ఉన్నా వాటిని వారు పట్టించుకోరు అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఈ మూడు చిత్రాలు (అజిత్ సినిమా ఇంకా ఊపందుకోలేదు) పోటాపోటీగా రిలీజ్ కావడం ఖాయమని మూడు చిత్రాలకు భారీ స్థాయిలోనే థియేటర్లు కేటాయించక త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్పడిందని కొందరు విశ్లేషిస్తున్నారు.

  దిల్ రాజు చిత్రం డబ్బింగ్ చిత్రమైనా ఆయనకున్న పలుకుబడి దృష్ట్యా భారీగా థియేటర్లు లభించే అవకాశాలు ఉన్నాయని.. ఈ విధంగా చూసుకుంటే ఈసారి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు మూడు చిత్రాలకు సరి సమానంగానే థియేటర్లో లభించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు.

  ఇలా సినిమాలు విడుద‌లైన తర్వాత శని ఆదివారాలు చూసి ఏ సినిమాకు హిట్ టాక్ వస్తే ఆ సినిమాకు మిగిలిన థియేట‌ర్లు కేటాయించడం జరుగుతుందనేది దిల్ రాజు ఇచ్చిన సారాంశం. ప్రస్తుతం వైజాగ్‌కు సంబంధించి అయితే.. ‘వారసుడు’కే ఎక్కువ థియేటర్లు లభించినట్లుగా తెలుస్తుంది. అంటే దిల్ రాజు డామినేషన్ మొదలైనట్టే అని అనుకోవచ్చు. మిగతా ఏరియాల పరిస్థితి ఏంటో తెలియాల్సి ఉంది. మొత్తంగా అయితే.. సంక్రాంతికి ఏం జరగబోతుందనేది చూడాల్సి ఉంది.

  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular