- గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాల రద్దు నిర్ణయం బీఎస్పీ విజయం
- నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్ చెలగాటమాడుతున్నాడని మండిపాటు..
- బీఎస్పీ నారాయణ పేట నియోజకవర్గం ఇన్‌చార్జ్ శ్రీనివాస్
విధాత: కేసిఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని బీఎస్పీ నారాయణ పేట నియోజకవర్గం ఇన్‌చార్జ్ బొదిగెలి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ధన్వాడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక పక్క తెలంగాణలో ముప్పై లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం జరగాలని బీఎస్పీ రాష్ట్ర అద్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆమరణ నిరహార దీక్ష చేస్తుంటే మరో పక్క లిక్కర్ మాఫియా 100కోట్ల కుంభకోణంలో నిందితురాలైన కూతురిని కాపాడటం కోసం ముఖ్యమంత్రి కుటుంబం ఢిల్లీ చుట్టూ తిరగడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు.
నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేసిఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత కోల్పోయిందని మండిపడ్డారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాల పరీక్ష రద్దు చేయడం బీఎస్పీ సాధించిన విజయంగా ఆయన పేర్కొన్నారు. బహుజన రాజ్యంలో తెలంగాణ నిరుద్యోగులకు పూర్తి స్థాయి న్యాయం జరుగుతుందని, దోపిడీ దొంగల చెరల నుండి రాష్ట్రాన్ని విముక్తి చేసి బహుజన రాజ్య స్థాపనకు విద్యార్థులు, మేధావులు కృషి చేయాలని కోరారు.
కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వాకిటి ఆంజనేయులు ముదిరాజ్, జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రయ్య, జిల్లా ఇంచార్జ్ వెంకటేష్ ముదిరాజ్, మండల అధ్యక్షుడు రవి యాదవ్, మైనారిటీ కన్వీనర్ సయ్యద్ మహమూద్, కోశాధికారి జడల బాల్ రాజ్, మీడియా ఇన్‌చార్జ్ తిర్మలేష్ తదితరులు పాల్గొన్నారు.