BRS | హాజీపూర్ లో ఆ ప్రజాప్రతినిధి భర్తకే పెద్దపీట ద్వితీయశ్రేణి నాయకుల్లో వ్యతిరేకత ఇప్పటికే పలువురు పార్టీకి గుడ్ బై అదేబాటలో మరి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: ముచ్చటగా మూడోసారి అధికార పీఠం చేజిక్కించుకునేందుకు గులాబీ నేత కేసీఆర్ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఐతే పార్టీలో క్షేత్రస్థాయి నేతల తీరు ఇందుకు భిన్నంగా ఉంటోంది. ఎన్నికల సమీపంలో ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించేశారు. ఇదే కిందిస్థాయిలో అసమ్మతిని రగిలిస్తోంది. మంచిర్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ […]

BRS |
- హాజీపూర్ లో ఆ ప్రజాప్రతినిధి భర్తకే పెద్దపీట
- ద్వితీయశ్రేణి నాయకుల్లో వ్యతిరేకత
- ఇప్పటికే పలువురు పార్టీకి గుడ్ బై
- అదేబాటలో మరి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు
విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: ముచ్చటగా మూడోసారి అధికార పీఠం చేజిక్కించుకునేందుకు గులాబీ నేత కేసీఆర్ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఐతే పార్టీలో క్షేత్రస్థాయి నేతల తీరు ఇందుకు భిన్నంగా ఉంటోంది. ఎన్నికల సమీపంలో ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించేశారు. ఇదే కిందిస్థాయిలో అసమ్మతిని రగిలిస్తోంది.
మంచిర్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. గత కొంతకాలంగా సిటింగ్ ఎమ్మెల్యే దివాకర్ రావు వైఖరి పట్ల కిందిస్థాయి నాయకత్వం అసంతృప్తితో ఉన్నారు. ఆయన తీరు నచ్చక ఇప్పటికే చాలామంది ముఖ్య నాయకులు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పున్నారు. హాజిపూర్ మండలంలో ఒక నాయకునికే ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇవ్వడం వివాదాస్పదమవుతోంది.
మిగతా ఏ నాయకులూ, క్యాడర్ ను పట్టించుకోకపోవడంతో నిరుత్సాహంగా ఉన్నట్లు సమాచారం. మండలంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఎంతోమంది ఉన్నప్పటికీ ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రజాప్రతినిధి భర్తకే ప్రాధాన్యత ఇవ్వడం అసమ్మతికి ఆజ్యం పోసింది. ఫలితంగా సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు చాలామంది ఎమ్మెల్యేకు దూరమవుతున్నారని తెలుస్తోంది.
ఆ నాయకుడే కీలకం..
హాజిపూర్ మండలంలో ఎమ్మెల్యే దివాకర్ రావు అనుచరుడిగా పేరు ఉన్న ఆ ఒక్క నాయకుడిదే హవా నడుస్తోంది. ఆయన చెప్తేనే ఆ మండలంలో ఏ పనిగాని, ఏ కార్యక్రమాలు గాని జరుగుతాయని, మిగతా వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదనేది చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే కన్నా ఆ నాయకుడి పైన ఉన్న అసంతృప్తితోనే, అధికార పార్టీ క్యాడర్, నాయకులు పార్టీకి దూరమవుతున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి.
మండలంలో సంక్షేమ పథకాలు ఎవరికి ఇవ్వాలన్నా అతడికి తెలియకుండా, ఆమోదం లేనిదే రావని అంటున్నారు. మండలంలో ఏ అధికారి ఎక్కడ సమావేశం ఏర్పాటు చేసినా ఆయనకు ముందుగా సమాచారం ఇస్తారని సమాచారం. ఆ నాయకుని మూలంగా మండలంలోని కొంతమంది సర్పంచులు, వార్డ్ మెంబర్లు, క్యాడర్ సైతం పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.
ఎన్నికల నోటిఫికేషన్ రాలేదని ముందుగానే పార్టీ మారితే అధికార పార్టీ నాయకులతో ఇబ్బందులు ఏర్పడతాయని కొంత ఆచితూచి అడుగులేస్తూ అధికార పార్టీలోనే ఉంటూనే కాంగ్రెస్ పార్టీ నాయకులతో టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. హాజీపూర్ మండలంలో ఎంపీపీ, జడ్పీటీసీ, 9 మంది ఎంపీటీసీ సభ్యులు, 17 మంది సర్పంచులు, వార్డు సభ్యులు ఉన్నప్పటికీ ,ఎమ్మెల్యే ఒకరికే ప్రాధాన్యత ఇవ్వడాన్ని దిగమింగుకోలేకపోతున్నారు. ఆ ఒక్క నాయకుని మూలంగా అతనికి వ్యతిరేకంగా పార్టీ మారుతున్నారని సమాచారం.
పెరుగుతున్న అసంతృప్తులు
ఎమ్మెల్యే దివాకర్ రావు కు టికెట్ ప్రకటించిన నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా ఇప్పటికే హాజీపూర్ మండలంలోని జడ్పీటీసీ శిల్ప శ్రీనివాసరావు, జిల్లా రైతు సమన్వయ కమిటీ చైర్మన్ శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ బొడ్డు శైలజ, బీఆర్ఎస్ హాజీపూర్ మండల అధ్యక్షులు దొమ్మేటి సత్తయ్య, మాజీ సర్పంచ్ గోనె సంజయ్, ఉప సర్పంచ్ ల సంఘం జిల్లా అధ్యక్షులు జితేందర్ రావుతోపాటు వారి అనుచరులు పెద్ద మొత్తంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. హాజిపూర్ మండలంలో ఎమ్మెల్యేకు అతి సన్నిహితుడిగా ఉన్న ఆ వ్యక్తి మూలంగా ఇప్పటికే చాలామంది పార్టీ మారని వాళ్లు.. గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. స్థానిక నాయకుని మీద వ్యతిరేకతతో ఒక్కొక్కరిలో అసంతృప్తి రోజురోజుకి ఎక్కువవుతోంది. ఇప్పటికైనా ఎమ్మెల్యే అసంతృప్తి నాయకులను పిలిపించుకొని, వచ్చే ఎన్నికలకు వారిని కార్యోన్ముఖులను చేయాల్సి ఉంది.
