Wednesday, March 29, 2023
More
  Homelatestసీనియర్లలో సయోధ్య వట్టిమాటేనా? రేవంత్‌తో కొనసాగుతున్న దూరం.. రూటు మారిన పాదయాత్ర..!

  సీనియర్లలో సయోధ్య వట్టిమాటేనా? రేవంత్‌తో కొనసాగుతున్న దూరం.. రూటు మారిన పాదయాత్ర..!

  Revant vs Congress Sr Leaders |

  విధాత: టీ. కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు ఒకవైపు పార్టీ రథ సారధిగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) కొనసాగిస్తున్న పాదయాత్రకు జనం నుంచి స్పందన బాగానే లభిస్తున్నప్పటికీ సొంత పార్టీ నేతల ఆదరణ మాత్రం ఆయనకు లభించడం లేదు. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు సీనియర్లతో రేవంత్ రెడ్డి రాజీ ధోరణిలో సాగుతున్నప్పటికీ వారు మాత్రం రేవంత్‌తో అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు.

  రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో (Hath Say Hath Jodo) పాదయాత్ర జిల్లాలో జోష్ మీద సాగుతుండగా ఇప్పటిదాకా ఈ పాదయాత్రలో సీనియర్లు భట్టి (Batti), వీహెచ్ (VH), శ్రీధర్ బాబు (Shridhar Babu)లు మాత్రమే కనిపించారు. భట్టి, వీహెచ్‌లు కూడా యాత్రలో ఒక రోజుకే పరిమితమయ్యారు.

  మిగతా సీనియర్లు పీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి(MP N. Uttam Kumar Reddy), ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి(MP Komati Reddy Venkata Reddy), జగ్గారెడ్డి(Jaggareddy), దామోదరం రాజనర్సింహ, కే. జానారెడ్డి, గీతారెడ్డి, కోదండ రెడ్డి, మధుయాష్కీ వంటి నేతలు ఇంకా రేవంత్ పాదయాత్రలో భాగస్వామ్యం కాలేదు. ఇక మహేశ్వర్ రెడ్డి వంటి వారు సొంత పాదయాత్రకు సిద్ధమవుతుండగా, ఉత్తమ్ ఇప్పటికే సూర్యాపేట జిల్లా కోదాడలో తన పాదయాత్ర ప్రారంభించారు.

  కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పాదయాత్ర చేస్తానని ప్రకటించినా ప్రస్తుతం ఎలాంటి పురోగతి లేదు. మార్చి మొదటి వారంలో ప్రియాంక గాంధీని కలుస్తానన్న వెంకటరెడ్డి ప్రయత్నాల్లో ముందడుగు లేదు. ఆయన పాదయాత్రకు హైకమాండ్ అనుమతిస్తుందో లేదో తెలియడం లేదు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి పట్ల సీనియర్ల అసమ్మతి వ్యవహార శైలి ఎంత మాత్రం మారలేదన్న చర్చ మరోసారి ప్రస్ఫుటమవుతుంది.

  ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా సీనియర్లు జానారెడ్డి, ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆర్. దామోదర్ రెడ్డిలకు, రేవంత్ రెడ్డికి మధ్య ఎంత మాత్రం సయోధ్య నెలకొనని తీరు పార్టీలో అసమ్మతి చిచ్చుకు నిదర్శనంగా కనిపిస్తుంది. కొంతలో కొంత జానారెడ్డి పెద్దరికం మాటున రేవంత్ కు వ్యతిరేకంగా బయటపడటం లేదు.

  తాజాగా రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే సమక్షంలో కోదాడలో ఉత్తంకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నల్గొండ పార్లమెంటరీ పార్టీ కాంగ్రెస్ సమావేశానికి సీనియర్లు దామోదర్ రెడ్డి, జానారెడ్డిలు మాత్రమే హాజరయ్యారు. ఇదే పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ ల నుండి రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన సూర్యాపేట నేత పటేల్ రమేష్ రెడ్డి మినహా అద్దంకి దయాకర్, బీర్ల ఐలయ్య యాదవ్, చెరుకు సుధాకర్, చామల కిరణ్ రెడ్డి, దుబ్బాక నరసింహారెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, పున్న కైలాష్ వంటి రేవంత్ వర్గీయులు ఎవరు హాజరు కాలేదు.

  ఇటీవల ఉత్తమ్ తో కలిసి సాగుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరు కాకపోవడం మరింత ఆసక్తి కరం. ఠాక్రే, బోసు రాజు, రోహిత్ చౌదరి, నిరంజన్ వంటి ఏఐసీసీ నేతలు హాజరైన ఈ సమావేశానికి రేవంత్ వర్గీయులు డుమ్మా కొట్టగా, హాజరైన దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి ల మధ్య విభేదాలు రచ్చకెక్కడం టీ.కాంగ్రెస్ లో వర్గ పోరుకు నిదర్శనంగా నిలిచింది.

  రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే(Manik Rao Thackeray) టీ. కాంగ్రెస్‌లో అంతర్గతంగా ఉన్న వర్గ పోరును బహిర్గతం కాకుండా ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ అసమ్మతి సహజ లక్షణ మన్నట్లుగా వ్యవహరించే సీనియర్ల అసంతృప్తిని మాత్రం ఆయన కట్టడి చేయలేకపోతున్నారు.

  ఇంకోవైపు రేవంత్ రెడ్డి పట్ల సీనియర్ల అసంతృప్తి జ్వాలలు సద్దుమణుగక పోవడంతోనే వరంగల్, ఖమ్మం జిల్లాల మీదుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో అడుగు పెట్టాల్సిన రేవంత్ రెడ్డి పాదయాత్ర రూట్ మారి కరీంనగర్‌(Karimnagar)కు మళ్లీపోయినట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ సాగుతుంది.

  కాంగ్రెస్ సీనియర్లు జానా, ఉత్తమ్, వెంకటరెడ్డి, దామన్నల అడ్డగా ఉన్న నల్గొండ జిల్లాలో రేవంత్ రెడ్డి పాదయాత్ర సాగితే తమ ప్రాబల్యానికి గండిపడుతుందని, రేవంత్ వర్గీయుల ప్రాబల్యం పెరుగుతుందన్న గుబులతోనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేవంత్ పాదయాత్ర సాగకుండా సీనియర్లు అడ్డుపడినట్లుగా భావిస్తున్నారు.

  రేవంత్ రెడ్డి సైతం పాదయాత్ర రాష్ట్రంలో సాఫీగా సాగిపోతున్న క్రమంలో అనవసరంగా నల్గొండ జిల్లా సీనియర్లతో పేచి పెట్టుకుని జనంలో పార్టీ మైలేజ్ ని దెబ్బ తీయడం ఇష్టం లేక పాదయాత్ర రూట్ మార్చుకోక తప్పలేదని తెలుస్తుంది. సీనియర్లతో విభేదాలు సద్దుమణిగాక ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకువచ్చే రీతిలో అంతా కలిసే పాదయాత్రకు ప్లాన్ చేయాలనీ రేవంత్ తలపోస్తున్నారని ఆయన వర్గీయులు చెబుతున్నారు.

  అయితే రేవంత్ వర్సెస్ కాంగ్రెస్ సీనియర్ల వర్గ పోరు అంతర్గతంగా సాగుతున్న తీరుతో వచ్చే ఎన్నికల దిశగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, ఇటు ఉమ్మడి నల్గొండ(Nalgonda) జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో సిట్టింగ్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఓడించి ఎలా గెలుస్తుంది అన్న ప్రశ్న కేడర్‌ను ఆందోళన గురి చేస్తుంది.

  రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్న కాంగ్రెస్ హైకమాండ్, కేడర్ల ఆశలు ఫలించాలంటే ముందుగా రేవంత్ రెడ్డి, సీనియర్లు పరస్పరం హాత్ సే హాత్ జోడించాల్సిన అవసరం ఉందని, లేదంటే మరోసారి పార్టీకి భంగపాటు తప్పదన్న చర్చ కేడర్లో వినిపిస్తుంది.

  spot_img
  RELATED ARTICLES

  Latest News

  Cinema

  Politics

  Most Popular