Tuesday, January 31, 2023
More
    Homeతెలంగాణ‌నూతన సంవత్సరంలో జిల్లా మరింత పురోగతి సాధించాలి: కలెక్టర్ నారాయణరెడ్డి

    నూతన సంవత్సరంలో జిల్లా మరింత పురోగతి సాధించాలి: కలెక్టర్ నారాయణరెడ్డి

    • సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు

    విధాత, నిజామాబాదు: నూతన సంవత్సరంలో నిజామాబాద్ జిల్లా అన్ని రంగాల్లో మరింత పురోగతి సాధించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆకాంక్షించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఆదివారం న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి.

    జిల్లా పాలనాధికారి సి.నారాయణరెడ్డి ముందుగా న్యూ ఇయర్ కేక్ కట్ చేశారు. అధికారులు, అనధికార ప్రముఖులు, రాజకీయ నాయకులు, వివిధ సంఘాల బాధ్యులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, స్వచ్చంద సంస్థల నిర్వాహకులు తదితరులు జిల్లా కలెక్టర్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

    నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కే.ఆర్.నాగరాజు, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, ఆయా శాఖలకు చెందిన జిల్లా అధికారులు కలెక్టర్ ను కలిసి న్యూ ఇయర్ విషెస్ తెలిపారు. నూతన సంవత్సర సంబరాలతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఉత్సాహభరిత వాతావరణం కనిపించింది.

    ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ జిల్లా ప్రజలందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో వుండాలని, అనుకున్న కార్యక్రమాలన్ని విజయవంతం కావాలని మనసారా కోరుకుంటున్నానన్నారు.

    సంక్షేమాభివృద్ధి పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాను మరింత సుసంపన్నం చేసేందుకు కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు.

    కలెక్టర్ ను కలిసిన వారిలో జెడ్పి సీఈఓ గోవింద్, డీఆర్డీఓ చందర్, ఆర్డీఓ రాజేశ్వర్, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, వివిధ శాఖల జిల్లా అధికారులు జయసుధ, శశికళ, రాములు, యోహాన్, మల్లారెడ్డి, రతన్, డాక్టర్ సుదర్శన్, నర్సయ్య, రాములు, తిరుమల ప్రసాద్, అదనపు డీసీపీ అరవింద్ బాబు, నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

    అలాగే టీఎన్జీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు కిషన్, రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు రమణ్, పెన్షనర్ల సంఘం బాధ్యుడు రవీందర్, సీనియర్ సిటిజన్స్ సంఘం ప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఆఫీసర్స్ క్లబ్ కార్యవర్గం, ప్రముఖ వైద్యుడు ఆకుల విశాల్, ఈగ గంగారెడ్డి, బీ.దేవిదాస్, భక్తవత్సలం తదితరులు కలెక్టర్ ను కలిసి న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తెలిపారు.

    విద్యార్థులకు దుప్పట్లు, నోట్ బుక్కులు అందజేత

    నూతన సంవత్సర అభినందనలు తెలిపేందుకు వచ్చిన అధికార, అనధికార ప్రముఖులు, వివిధ సంఘాల ప్రతినిధులు అందించిన దుప్పట్లు, నోట్ బుక్కులను కలెక్టర్ సి.నారాయణరెడ్డి స్వీకరించారు. వాటిని హాస్టల్ విద్యార్థులకు అందజేశారు. పూల బొకేలకు బదులుగా పేద విద్యార్థుల సౌకర్యార్థం బ్లాంకెట్లు, నోట్ బుక్కులు తేవాలని జిల్లా కలెక్టర్ చేసిన విజ్ఞప్తికి అనూహ్య స్పందన లభించింది.

    కలెక్టర్ ను కలిసేందుకు వచ్చిన వారందరు పెద్ద ఎత్తున దుప్పట్లు, నోట్ బుక్కులు తీసుకురాగా కలెక్టర్ వాటిని విద్యార్థులకు పంపిణీ చేయాల్సిందిగా వివిధ సంక్షేమ శాఖల అధికారులను అందజేశారు. కలెక్టర్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వసతి గృహాల విద్యార్థులకు ఎంతో మేలు చేకూరుతుందని, ప్రత్యేకించి ప్రస్తుత చలికాలంలో దుప్పట్లు ఉపయోగంగా వుంటాయని పలువురు అభినందించారు.

    RELATED ARTICLES

    Latest News

    Cinema

    Politics

    Most Popular