- షిప్ శకలాల త్రీడి స్కాన్ చిత్రాల వెల్లడి
- డాక్యుమెంటరీ చిత్రీకరించిన అట్లాంటిక్ ప్రొడక్షన్స్
విధాత: టైటానిక్ (Titanic) షిప్ అదొక భూతల స్వర్గం.. ఇప్పటి తరానికి తెలియని విలాస సౌధం. మనకు తెలిసింది.. మనము చూసింది టైటానిక్ సినిమాయే. దానిని చూసి మనమంతా అబ్బుర పడిపోయాం. నిజంగా టైటానిక్ షిప్ ఇంత పెద్దగా ఉండేదా? ఇన్ని అంతస్థుల్లో, సకల సౌకర్యాలతో సముద్రంపై నడిచే స్వర్గలోకంగా ఉంటుందా? అని ఖిన్నులయ్యాం. మంచుపర్వతాన్నిఢీ కొని సగానికి విరిగిపోయి అంతమంది చనిపోయారా? అని బాధపడ్డాం.
నిజమైన టైటానిక్ సరిగ్గా 111 ఏండ్ల క్రితం తొలి ప్రయాణాన్ని పూర్తిచేయకుండానే మునిగిపోయింది. సముద్ర గర్భానికి చేరింది. ఇప్పడు సముద్రం అడుగున ఉన్న టైటానిక్ షిప్‌ను చూసే భాగ్యం మనకు కలిగింది. దానిని ఒకే ఫొటోలో చూడలేము కాబట్టి ఏడు లక్షల చిత్రాలను ఉపయోగించి 3డీ స్కాన్ ఫొటోను తయారు చేశారు. షిప్ శకలాల త్రీడి స్కాన్ చిత్రాలను ఓ సంస్థ వెల్లడించింది. ఆ స్కాన్ చిత్రాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
టైటానిక్ తొలి త్రీడీ చిత్రమిదే
టైటానిక్ తొలి త్రీడీ చిత్రాన్ని డాక్యుమెంటరీగా అట్లాంటిక్ ప్రొడక్షన్స్ రూపొందించింది. టైటానిక్‌కు సంబంధించి గతంలో తీసిన చిత్రాలు తక్కువ రెజల్యూషన్‌తో ఉన్నాయని, వీక్షకులు ఒక సమయంలో శిథిలాల ఒక ప్రాంతాన్ని మాత్రమే చూడటానికి వీలు కలిగేదని అట్లాంటిక్ ప్రొడక్షన్స్ సంస్థ హెడ్ ఆంథోనీ గెఫెన్ తెలిపారు.
కొత్తగా తాము విడుదల చేసిన త్రీడి చిత్రాలు నాణ్యతలో మెరుగ్గా ఉన్నాయని చెప్పారు. ఫొటోరియలిస్టిక్ 3D మోడల్‌లో రెండు విధాలుగా తీశామని తెలిపారు. దాదాపు 15,000 చిత్రాలను తీశామని వెల్లడించారు. నీటి అడుగున 3D మోడల్ కంటే 10 రెట్లు పెద్దదని పేర్కొన్నారు.
ఒక స్పెషలిస్ట్ షిప్ నుంచి రిమోట్‌గా నియంత్రించబడే సబ్‌మెర్సిబుల్స్ అట్లాంటిక్ దిగువన ఉన్న శిథిలాలను సర్వే చేయడానికి 200 గంటలకుపైగా గడిపాయి. షిప్ శిథిలాలను స్కాన్ చేయడానికి 700,000 కంటే ఎక్కువ చిత్రాలను తీసుకున్నాయి. శిథిలాలను పాడుచేయకుండా. దేనినీ తాకకుండా. ప్రతి చదరపు సెంటీమీటర్‌ను మ్యాప్ చేశారు. ప్రతివస్తువు స్పష్టంగా కనిపించేలా డాక్యుమెంటరీని రూపొందించారు.
తొలి ప్రయాణమే తీరం చేరలేదు
1912 ఏప్రిల్ 15న ఇంగ్లాండ్‌లోని సౌతాంప్టన్ నుంచి న్యూయార్క్‌కు టైటానిక్ షిప్ తన తొలి ప్రయాణాన్ని ప్రారంభించింది. ప్రయాణ మధ్యలో నార్త్ అట్లాంటిక్‌లోని న్యూఫౌండ్‌ల్యాండ్‌లో మంచుకొండను ఢీ కొట్టింది. విలాసవంతమైన ఓషన్ లైనర్ గంటల్లోనే మునిగిపోయింది. సుమారు 1,500 మంది మరణించారు. దాని శిథిలాల కోసం ఏండ్ల తరబడి గాలించారు. చివరికి 1985లో షిప్ శిథిలాలు కనుగొన్నారు. కెనడా తీరానికి దాదాపు 435 మైళ్ల (700 కిలోమీటర్లు) దూరంలో సముద్రం కింద 12,500 అడుగుల (3,800 మీటర్లు) టైటానిక్‌ను గుర్తించారు.