విధాత: మనకు శక్తిని, పోషకాలను అందించేందుకు అనేక రకాల ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో ఒక్కో పదార్థం ఒక్కో రకమైన ఆరోగ్య ఫలితాన్ని ఇస్తుంది. మరో గమ్మత్తైన విషయం ఏంటంటే.. కొన్ని ఆహార పదార్థాలు మన శరీర అవయవాల నిర్మాణాన్ని పోలి ఉండి, ఆయా భాగాలకు ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు సంరక్షణ బాధ్యత కూడా తీసుకుంటాయి. మరి ఏ పదార్థం ఏ శరీర భాగాన్ని పోలి ఉంది..? ఎలా రక్షిస్తుంది..? ఎలాంటి ఆరోగ్యాన్ని మనకు […]

విధాత: మనకు శక్తిని, పోషకాలను అందించేందుకు అనేక రకాల ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో ఒక్కో పదార్థం ఒక్కో రకమైన ఆరోగ్య ఫలితాన్ని ఇస్తుంది. మరో గమ్మత్తైన విషయం ఏంటంటే.. కొన్ని ఆహార పదార్థాలు మన శరీర అవయవాల నిర్మాణాన్ని పోలి ఉండి, ఆయా భాగాలకు ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు సంరక్షణ బాధ్యత కూడా తీసుకుంటాయి. మరి ఏ పదార్థం ఏ శరీర భాగాన్ని పోలి ఉంది..? ఎలా రక్షిస్తుంది..? ఎలాంటి ఆరోగ్యాన్ని మనకు అందిస్తుందో తెలుసుకుందామా.
అశ్వగంథ
మానవ శరీర నిర్మాణం ఎలా ఉంటుందో అలా అశ్వగంథ మొక్క వేర్లు ఉంటాయి. ఇవి శరీరం మొత్తానికి ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను చేకూరుస్తాయి. యాంటీ ఏజింగ్, యాంటీ ఇన్‌ప్లామేటరీ వంటి లక్షణాలు వీటిలో పుష్కలంగా ఉన్నాయి. అలాగే రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. డిప్రెషన్, నిద్రలేమి, లైంగిక సామర్థ్యం, సంతాన సాఫల్యత వంటి సమస్యలను కూడా దూరం చేస్తాయి.
ఆకుకూరలు
ఆకుకూరల కాండాలు మానవ శరీరంలోని ఎముకల లాగే ఉంటాయి. వీటిలో కొలెస్ట్రాల్ ఉండదు. ఫైబర్ అధికంగా ఉంటుంది. విటమిన్-కె, కాల్షియం, మెగ్నిషియం, పాస్ఫరస్ వంటివి అధిక మోతాదులో లభిస్తాయి. ఎముకలను దృఢంగా చేయడంతో పాటు ఎముకలకు ఆరోగ్యాన్ని ఇవ్వడంలో వీటికి మించింది లేదు. అందుకే డాక్టర్లు సైతం ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలని సలహా ఇస్తుంటారు.
ఉల్లిపాయలు
పొరలు పొరలుగా ఉండే ఉల్లిపాయలు మానవ శరీరంలోని చర్మ పొరలను పోలి ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్ లో లభిస్తున్న అనేక రకాల చర్మ రక్షణ ఉత్పత్తుల్లో ఉల్లిపాయల నుంచి తీసిన వివిధ పదార్థాలను ఎక్కువగా వాడుతున్నారట. ఉల్లిపాయలు చర్మ సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాదు చర్మంపై మచ్చలను తొలగించేందుకు ఇవి ఔషధంగా పనిచేస్తాయి.
వాల్‌నట్స్
వాల్‌నట్స్ ని చూస్తే మన మెదడు నిర్మాణం మదిలో మెదులుతుంది. ఎందుకంటే వాల్‌నట్స్ మన మెదడు లాగే ఉంటాయి మరి. వాల్‌నట్స్ తీసుకుంటే ప్రోటీన్లు, ఒమెగా-3, ఒమెగా-6 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఈ, బీ6 వంటివి పుష్కలంగా లభిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల నాడీ మండల వ్యవస్థకు, మెదడుకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది.
క్యారెట్
అడ్డంగా కట్ చేసిన క్యారెట్ ముక్కలను ఒక సారి చూడండి. అవి మన కళ్లలాగే ఉంటాయి. క్యారెట్లు తింటే కళ్లకు మంచిది అనే విషయం అందరికీ తెలిసిందే. క్యారెట్ లో విటమిన్ ఏ కావల్సినంత దొరుకుతుంది. ఇది దృష్టి సంబంధ సమస్యలను దూరం చేస్తుంది. అంతేకాదు క్యారెట్లలో ఉండే బీటా కెరోటిన్ కంటికి సంబంధించిన కణాల నాశనాన్ని అడ్డుకుంటుంది.
పుట్ట గొడుగులు
మానవ చెవుల లాంటి నిర్మాణాన్ని పుట్టగొడుగులు కలిగి ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకుంటే వినికిడి శక్తి పెరుగుతుందట. శక్తివంతమైన యాంటీ బయోటిక్‌గాను పని చేస్తాయి. శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు ట్యూమర్లు వృద్ధి చెందకుండా పోరాటం చేస్తాయి.
టమాటోలు
సగానికి నిలువుగా కట్ చేసిన టమాటోను పరిశీలనగా చూడండి. మన శరీరంలోని గుండె అందులోని 4గదులను పోలి ఉంటుంది. గుండె నిర్మాణాన్ని పోలి ఉన్న టమాటోలు గుండెకు రక్షణ కల్పించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అంతేకాదు చెడు కొలెస్ట్రాల్‌ను, శరీరంలో ఏర్పడే ఫ్రీ ర్యాడికల్స్‌ను తరిమేస్తాయి. గుండె సంబంధ వ్యాధులు దరి చేరకుండా అడ్డుకుంటాయి.
ద్రాక్షలు
ద్రాక్ష పండ్ల గుత్తి ఊపిరితిత్తుల్లోని స్పాంజి లాంటి గదుల నిర్మాణాన్ని పోలి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు ద్రాక్షలలో అధికంగా ఉంటాయి. బీపీ, రక్తనాళాలు పూడుకుపోవడం వంటి సమస్యల నివారణలో ద్రాక్షలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే గుండె ఆరోగ్యాన్ని పదిలంగా చూసే నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని శరీరంలో వృద్ధి చేస్తాయి. ఆస్తమా వంటి వ్యాధులకు ఉపశమనంగా ద్రాక్షలు పనిచేస్తాయి. ఊపిరితిత్తుల వ్యాధుల నుంచి రక్షిస్తాయి. లంగ్ క్యాన్సర్ రాకుండా చేస్తాయి.
నారింజ
సగానికి నిలువుగా కట్ చేసిన నారింజ పండు ముక్క స్త్రీలలోని క్షీర గ్రంథులను పోలి ఉంటుంది. నారింజలోని విటమిన్ సీ మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా చేస్తుంది. క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడే గుణాలు నారింజలో పుష్కలంగా ఉన్నాయి.
అల్లం
మన శరీరంలోని జీర్ణాశయంలా అల్లం ఉంటుంది. వికారం, డయేరియా, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను అల్లం మాయం చేస్తుంది. పొట్టలో అల్సర్లు రాకుండా చూడడంలో దీనికి మించింది లేదంటారు ఆరోగ్య నిపుణులు.
గెణుసు గడ్డలు
క్లోమ గ్రంథి లాగా గెణుసు గడ్డలు(చిలగడ దుంపలు) ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల డయాబెటీస్ రోగుల చక్కెర స్థాయిని క్రమబద్ధీకరిస్తాయి. అలాగే క్లోమ గ్రంథి క్యాన్సర్ రాకుండా కూడా అడ్డుకుంటాయి.
కిడ్నీ బీన్స్
మన దగ్గర లభించే చిక్కుడు, రాజ్మా తదితర గింజలను కిడ్నీ బీన్స్ అంటారు. ఇవి అచ్చం మన శరీరంలోని మూత్రపిండాల నిర్మాణాన్ని పోలి ఉంటాయి. వీటిలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఫ్యాట్స్, సోడియం తక్కువగా ఉంటాయి. కిడ్నీ వ్యాధులు రాకుండా ఇవి చూస్తాయి. మూత్ర పిండాలను సంరక్షిస్తాయి.
ఆలివ్స్
స్త్రీలలోని అండాశయాలను పోలి ఆలివ్స్ ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఈ, మోనో అన్ సాచురేటెడ్‌ఫ్యాట్లు, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి అండాశయాలు సక్రమంగా పనిచేసేందుకు ఉపయోగపడతాయి.
అవకాడోలు
గర్భిణీ స్త్రీలలోని పిండాన్ని పోలి అవకాడోలు ఉంటాయి. ఇందులో పోషక పదార్థాలు మిక్కిలిగా ఉంటాయి. వీటిలోని ఫొలేట్ గర్భిణులకు ఎంతో మంచిది. ఇది బిడ్డ సక్రమంగా ఎదిగేందుకు ఉపయోగపడుతుంది. దీంతో పాటు గర్భధారణ సమయంలో కలిగే వికారం, వాంతుల వంటి లక్షణాలను అవకాడోలలోని విటమిన్ బీ6 నియంత్రిస్తుంది. శరీరంలోని వాపులను కూడా తగ్గిస్తుంది.
మేడి పండ్లు
పురుషుల్లోని ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ముఖ్యమైన వృషణాలను పోలి మేడిపండ్లు ఉంటాయి. వీటిని ఇంగ్లిష్‌లో ఫిగ్స్ అని తెలుగులో అత్తి పండ్లు అని కూడా పిలుస్తారు. వీటిని డ్రై ఫ్రూట్‌గా చేసి అంజీర్ పండ్లుగా మార్కెట్లలో విక్రయిస్తున్నారు. మేడి పండ్ల వల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. సంతాన సాఫల్యతకు ఇవి చక్కని పరిష్కారం చూపుతాయి.
నోట్: అవగాహన కోసం మాత్రమే.. సందేహాలు ఉంటే నిపుణుల సలహా తీసుకోవాలి.
