Mancherial | విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: మంచిర్యాల ప్రభుత్వాసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యం ఓ బాలింత ప్రాణాలమీదకొచ్చింది. గర్భిణి ప్రసవం కోసం ఆసుపత్రికి రాగా, వైద్యులు ఆపరేషన్ చేసి పురుడు పోశారు. కానీ కడుపులో కాటన్ ప్యాడ్ మరిచిపోయి కుట్లు వేసి, ఇంటికి పంపించారు. తీవ్ర అస్వస్థతతో బాలింత మంచాన పడింది. వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామానికి చెందిన గిరిజన మహిళ కీర్తిలయకు పురిటి నొప్పులు వచ్చాయి. ఐదు రోజుల క్రితం కాన్పు కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో […]

Mancherial | విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: మంచిర్యాల ప్రభుత్వాసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యం ఓ బాలింత ప్రాణాలమీదకొచ్చింది. గర్భిణి ప్రసవం కోసం ఆసుపత్రికి రాగా, వైద్యులు ఆపరేషన్ చేసి పురుడు పోశారు. కానీ కడుపులో కాటన్ ప్యాడ్ మరిచిపోయి కుట్లు వేసి, ఇంటికి పంపించారు. తీవ్ర అస్వస్థతతో బాలింత మంచాన పడింది.

వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామానికి చెందిన గిరిజన మహిళ కీర్తిలయకు పురిటి నొప్పులు వచ్చాయి. ఐదు రోజుల క్రితం కాన్పు కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్లు చిన్న ఆపరేషన్ చేయగా, పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం తర్వాతా ఆసుపత్రిలోనే చికిత్స పొందిన బాలింతను డాక్టర్లు సోమవారం డిశ్చార్జ్ చేశారు. బాలింత స్వగ్రామం నీల్వాయి గ్రామానికి చేరుకుంది.

ఇంటికి వెళ్లిన తర్వాత అస్వస్థతకు గురైంది. కడుపు నొప్పి భరించలేకపోయింది. రాత్రి ఆరోగ్య పరిస్థితి తీవ్రం కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.108 అంబులెన్స్ లో హుటాహుటిన చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. డాక్టర్లు బాలింతను పరీక్షించారు. ఆపరేషన్ చేసి అందులోనే కాటన్ ప్యాడ్ మర్చిపోయినట్టు గుర్తించి, తొలగించారు.

ప్రస్తుతం ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్యం మెరుగుపడినట్లు వైద్యులు తెలిపారు. వైద్యుల నిర్వాకంపై కీర్తిలయ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు

Updated On 29 Aug 2023 1:46 PM GMT
somu

somu

Next Story