Whats App
విధాత: వాట్సప్ (WhatsApp) యూజర్ల ఖాతాల్లో ఉన్న డబ్బును కొట్టేయడానికి సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తు వేశారు. వివిధ దేశాల నుంచి చేస్తున్నట్లుగా వాట్సప్ కాల్స్ చేస్తున్నారు. వీటిని ఎత్తగానే ఆ ఫోన్‌లో ఉన్న వివరాలు వారి చేతికి చిక్కుతాయి. ఆ తర్వాత బ్యాంకు ఖాతాలో ఉన్న సొమ్మును చేజిక్కించుకుని మోసాలకు పాల్పడుతున్నారు.
ముఖ్యంగా ఇథియోపియా (+251), మలేషియా (+60), ఇండోనేషియా (+62), కెన్యా (+254) వియత్నాం (+84) తదితర నంబర్లతో మొదలయ్యే కాల్ వస్తే జాగ్రత్త పడాల్సిందే. ఈ ఫోన్లన్నీ విదేశాల నుంచి వచ్చినట్లు అనిపిస్తున్నా.. నిజానికి ఇవి మన దేశం నుంచి వచ్చే ఫోన్లే.. కొన్ని సార్లు అవి మీరు ఉంటున్న నగరం నుంచే వస్తూ ఉండొచ్చు.
ఇలా విదేశీ నంబర్లను సైబర్ దోపిడీ ముఠాలకు విక్రయించే సంస్థలు ఉన్నట్లు కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి. పైగా వీటిని వాట్సప్ లో కాల్స్ చేయడానికి ఉపయోగిస్తుండటంతో ..వారికి ఎటువంటి ఇంటర్నేషనల్ రోమింగ్ ఛార్జీలు పడవు.
మరేం చేయాలి?
ఏమీ సంబంధం లేకుండా సడెన్‌గా విదేశీ నంబరు నుంచి వాట్సప్ ఫోన్ వస్తే అనుమానించాల్సిందే. వాటిని ఎత్తకుండా అలా వదిలేయడమే మోసపోకుండా ఉండటానికి ఏకైక మార్గం.
ఉద్యోగాలంటూ ఎర
మరి కొన్ని ఘటనల్లో పార్ట్ టైం ఉద్యోగాలంటూ వాట్సప్‌లో సందేశాలు పంపుతూ.. సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు కేసులు నమోదవుతున్నాయి. తాము ఒక అంతర్జాతీయ కంపెనీ నుంచి మెసేజ్ చేస్తున్నామని, పార్ట్ టైం ఉద్యోగం ఆఫర్ ఉందని ఊరిస్తారు. ఇంటి నుంచే పని చేయొచ్చని చెబుతారు. వారిని నమ్మి ఓకే చెబితే… ముందు ఒక టాస్క్ ఇచ్చి పూర్తి చేస్తే డబ్బులిస్తామని చెప్పి నిజంగానే చెల్లిస్తారు. వారి మీద నమ్మకంతో అలా ముందుకు వెళ్తే భారీ మొత్తాలను ఆశ చూపి ముంచేస్తారు.
మరేం చేయాలి?
మీరు ఏ ప్రయత్నమూ చేయకుండా జాబ్ ఆఫర్‌లు వస్తుంటే ఆ నంబర్లను బ్లాక్ చేయడం మంచిది. పలానా కంపెనీ నుంచి అని చెబితే… కంపెనీ అఫిషియల్ మెయిల్ నుంచి సంప్రదించమని వారికి చెప్పాలి. నెట్‌లో వివరాలు అందుబాటులో ఉంటే సదరు సంస్థను సంప్రదించి ఆ మెసేజ్ నిజమా కాదా అనేది ధ్రువీకరించుకోవాలి.