- ఈ ఔషధాల వల్ల 18మంది చిన్నారులు చనిపోయారని ఉబ్జెకిస్థాన్ ఆరోపణ
- నాసిరకం ఔషధ ఉత్పత్తులతో దేశ ప్రతిష్ఠను మంటగలిపిన మరియన్ బయోటెక్
విధాత: దేశ రాజధాని ఢిల్లీ శివారు నోయిడాలోని మరియన్ బయోటెక్ కంపెనీ ఉత్పత్తి చేసిన మందులు నాసిరకమైనవని, వాటిని వాడరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) సూచించింది. ఉబ్జెకిస్థాన్‌లో ఈ కంపెనీలో తయారైన దగ్గు మందులు అబ్రానాల్, డాక్-1 మ్యాక్స్ సిరప్‌ల కారణంగా తమ దేశంలో 18మంది చిన్నారులు చనిపోయారని ఉబ్జెకిస్థాన్ ఆరోపించింది.
ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన డబ్ల్యూహెచ్ఓ మరియన్ బయోటిక్ ఔషధ ఉత్పత్తులు నాసిరకంగా ఉన్నాయని, నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని తెలిపి, వాటిని ఉపయోగించరాదని హెచ్చరించింది.
మరియన్ బయోటెక్ ఉత్పత్తి చేసిన దగ్గు సిరప్‌లలో ‘డై ఇథిలిన్ గ్లైకాల్’, ‘ఇథిలిన్’ మోతాదుకు మించి ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.
ఇలాంటి సిరప్‌లను చిన్నపిల్లలకు వినియోగించినప్పుడు వారిలో శ్వాసకోశ సంబంధ సమస్యలు ఉత్పన్నమై వారు చనిపోయే ప్రమాదమున్నది. డాక్టర్ల సరియైన పర్యవేక్షణ లేకుండా వాటిని వినియోగించటం వల్లనే చిన్న పిల్లలు చనిపోయారని అంటున్నారు.
భారతీయ ఉత్పత్తులపై ఇలాంటి ఆరోపణలు రావటం ఇదే మొదటి సారి కాదు. ఈ మధ్యకాలంలోనే సోనెపట్ కేంద్రంగా ఉన్న మైడెన్ ఫార్మా కంపెనీలో తయారైన ఔషధాలను వినియోగించి గాంబియాలో 66 మంది చిన్నారులు మృతిచెందటం గమనార్హం.
ప్రపంచ వ్యాప్తంగా భారతీయ ఔషధ రంగానికి ఎంతో కీర్తి ప్రతిష్ఠలున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా.. నాణ్యత విషయంలో భారత్‌కు ఘనమైన చరిత్ర ఉన్నది. అంతేకాకుండా.. చవక ధరలకు అన్ని రకాల ఔషధాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. మరీ ముఖ్యంగా కరోనా వైరస్ ప్రపంచాన్నంతా వణికిస్తున్న సమయంలో భారతీయ ఫార్మా రంగం ప్రపంచాన్ని ఆదుకున్నది.
కరోనా నివారణకు అవసరమైన వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసి వ్యాక్సిన్ల రారాజుగా ఖ్యాతి గాంచింది. అట్లాంటి పరిస్థితుల్లో.. భారత ఔషధ ఉత్పత్తులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించే స్థితి రావటం విషాదం.
దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో ఉన్న కంపెనీల్లో నాసిరకం మందులు తయారవటం, వాటితో ప్రాణనష్టం జరగటం దేశ ప్రతిష్టకు తీవ్ర భంగకరం.
ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి కంపెనీలు చేపడుతున్న ఉత్పత్తుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలి. నాసిరకం మందుల ఉత్పత్తులకు బాధ్యులైన కంపెనీ యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలి.