ఆదివారం విజయనగరం రాక విధాత: విశాఖ పర్యటనలో మోడీతో కలిసిన తరువాత ఏం జరిగిందో.. లోపల ఏం మాట్లాడుకున్నారో తెలీదు కానీ మొత్తానికి పవన్ కళ్యాణ్ జోరు పెంచారు. ప్రభుత్వం మీద దూకుడుగా పోరాటం చేసేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారేమో తెలీదుగానీ ముందుగా అయితే జగనన్న పథకాల్లో అవినీతిని బయట పెట్టే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం విజయనగరంలో జగనన్న కాలనీని సందర్శించనున్నారు. మొన్నామధ్య ఇప్పటం గ్రామంలో రోడ్ల విస్తరణలో భాగంగా కొంత […]

ఆదివారం విజయనగరం రాక

విధాత: విశాఖ పర్యటనలో మోడీతో కలిసిన తరువాత ఏం జరిగిందో.. లోపల ఏం మాట్లాడుకున్నారో తెలీదు కానీ మొత్తానికి పవన్ కళ్యాణ్ జోరు పెంచారు. ప్రభుత్వం మీద దూకుడుగా పోరాటం చేసేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారేమో తెలీదుగానీ ముందుగా అయితే జగనన్న పథకాల్లో అవినీతిని బయట పెట్టే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం విజయనగరంలో జగనన్న కాలనీని సందర్శించనున్నారు.

మొన్నామధ్య ఇప్పటం గ్రామంలో రోడ్ల విస్తరణలో భాగంగా కొంత స్థలాన్ని, గోడలు, ఇల్లు కోల్పోయినవారిని పరామర్శించిన పవన్ ఇప్పుడు జగనన్న కాలనీల్లో అవినీతిని వెలికితీసే లక్ష్యంతో ముందుకు వెళుతున్నారు. వాస్తవానికి అందరికీ ఇల్లు పేరిట రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల కాలనీలు నిర్మించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా 30 లక్షల ఇల్లు నిర్మిస్తారు. ఇప్పటికే భూ సేకరణ పూర్తవగా లబ్ధిదారుల ఎంపిక కూడా జరిగింది. కాలనీల్లో ఇళ్ళ నిర్మాణాలు మొదలవుతున్నాయి.

అయితే వీటికోసం భూములను సేకరించడంలో భారీ అవినీతి జరిగిందని జనసేన ఆరోపిస్తోంది. ఎక్కడెక్కడ కాలనీలు వస్తాయో ముందే తెలుసుకున్న నాయకులు అక్కడి భూములను రైతుల దగ్గర నుంచి తక్కువ ధరకు తీసుకుని ఆ వెంటనే ప్రభుత్వానికి రెట్టింపు ధరకు అమ్ముకుని భారీగా లాభ పడ్డారని జనసేన ఆరోపిస్తోంది.

మరోవైపు జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు.. విద్యుత్ నీటి సౌకర్యం డ్రైనేజీ వసతులు రోడ్లు కల్పించకపోవడంతో పేదలకు ఆ స్థలాలు ఎందుకూ పనికి రాకుండా పోతున్నాయని జనసేన పార్టీ చెబుతోంది.

ఈ నేపథ్యంలో జగనన్న ఇళ్లు–పేదలకు కన్నీళ్లు పేరిట ఆ పార్టీ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా నవంబర్ 12 13 14తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగనన్న కాలనీలు/టిడ్కో ఇళ్ల వద్ద జనసేన సామాజిక పరిశీలనా కార్యక్రమం చేపడుతోంది. దీంతో పెద్ద ఎత్తున పార్టీ నేతలు కార్యకర్తలు ఆయా నియోజకవర్గాల్లో జగనన్న కాలనీల్లో ఇళ్ల పరిస్థితిని ఫొటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.

ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ స్వయంగా విజయనగరం జిల్లా గుంకలాంలో పర్యటించనున్నారు. అక్కడ 397 ఎకరాల్లో జగనన్న ఇళ్లు నిర్మిస్తామని జగన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు అక్కడ సీఎం జగన్ గతంలోనే శంకుస్థాపన చేసి పైలాన్‌ను కూడా ఆవిష్కరించారు. అక్కడ రోడ్లు తాగునీరు డ్రైనేజీ సదుపాయం విద్యుత్ తదితర అన్ని వసతులు కల్పిస్తామని జగన్ చెప్పారు. గుంకలాంను నగర పంచాయతీని కూడా చేస్తామన్నారు.

ఈ నేపథ్యంలో గుంకలాంలో సీఎం జగన్ ఇచ్చిన హామీలు అమలయ్యాయా? అక్కడ ఇళ్ల పరిస్థితి ఎలా ఉంది? తదితర అంశాలను పవన్ కల్యాణ్ స్వయంగా పరిశీలించనున్నారు. పథకం అమలు తీరుని తెలుసుకోవడానికి లబ్ధిదారులతో మాట్లాడతారు. ఇక్కడ దాదాపు 12వేల ఇంటి ప్లాట్లు వేస్తున్నారు. రాష్ట్రంలో అతిపెద్దదైన గుంకలాం లే అవుట్ కు పవన్ వస్తున్న నేపథ్యంలో ఇటు జన సైనికుల్లో ఉత్సాహం నెలకొంది.

అంతకుమునుపు జనసేపనాని పవన్ కళ్యాణ్ రిషికొండను వీక్షించారు. విశాఖపట్నం పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం రుషికొండను పరిశీలించడానికి వెళ్లగా, కొండ చుట్టూ బారికేడ్లు పెట్టి లోపల పనులు చేస్తుండటంతో బయట నుంచే కొండపై జరుగుతున్న పనులను పరిశీలించారు.

Updated On 12 Nov 2022 5:06 PM GMT
krs

krs

Next Story