- ప్రయాణికులకు తప్పిన ప్రమాదం
విధాత, వరంగల్: టూరిస్ట్ బస్సు నడుపుతుండగానే డ్రైవర్‌కు కార్డియాటిక్ అరెస్ట్ కావడంతో మరణించిన విషాద సంఘటనలో ప్రయాణికులు ప్రమాదం నుంచి సేఫ్‌గా బయటపడ్డారు.
ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రాపురం శివారులో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. ప్రయాణికులు ఆలయాలను సందర్శించేందుకు వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని కాణిపాకం వాస్తవ్యులుగా తెలుస్తోంది.
యాదాద్రికి వెళుతున్న క్రమంలో బస్సు డ్రైవర్ బాబుకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి మృతిచెందాడు. బస్సు వేగంలో ఉండగానే ఈ ఘటన చోటు చేసుకోవడంతో రోడ్డు మీద నుంచి కింద పొదల్లోకి దూసుకెళ్లి ఆగిపోయింది.
ఈ సంఘటనలో అదృష్టవశాత్తు ప్రయాణికులెవరికి తీవ్ర గాయాలు కాలేదు. 20 మందికి పైగా స్వల్పంగా గాయపడ్డారు. ఘటన సమాచారం అందిన వెంటనే చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
బస్సు మరికొంతదూరం ముందుకెళ్తే పడిపోయే ప్రమాదం ఉండేది. అదృష్టవశాత్తు 45మంది ప్రయాణికులు ప్రమాదం నుంచి బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు.