Homelateste-Panchayat Operators | సమ్మె తెచ్చిన గుర్తింపు..! పల్లె పాలనలో కీలకమైన ఈ-పంచాయతీ ఆపరేటర్లు.!

e-Panchayat Operators | సమ్మె తెచ్చిన గుర్తింపు..! పల్లె పాలనలో కీలకమైన ఈ-పంచాయతీ ఆపరేటర్లు.!

విధాత: తెలంగాణలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు సాగిస్తున్న సమ్మెతో గ్రామపంచాయతీల పాలనలో ఈ-పంచాయతీ ఆపరేటర్ల ప్రాధాన్యత వెలుగులోకి వచ్చినట్లయ్యింది. కేంద్రం 2015లో తెచ్చిన ఈ-పంచాయతీ వ్యవస్థతో పంచాయతీలలో జరిగే ప్రతి పనిని ఆన్లైన్ చేసేందుకు కొన్ని పంచాయతీలను క్లస్టర్‌గా ఏర్పాటు చేసి ఈ – పంచాయతీ ఆపరేటర్ల (e-Panchayat Operators ) ను నియమించారు.

ఈ పంచాయతీ ఆపరేటర్ల నియామకాలతో పంచాయతీల్లో పాలనలో పారదర్శకత పెరిగిపోవడంతో పాటు పనులన్నీ ఆన్ లైన్ రికార్డు కాబడుతున్నాయి. ఇందుకు ఈ – పంచాయతీ ఆపరేటర్లు కనీస పనిగంటల కంటే అధికంగా శ్రమిస్తూ తమ పరిధిలోని పంచాయతీల ప్రగతి నివేదికలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేసే విధులు నిర్వహిస్తున్నారు. ఈ-పంచాయతీ వ్యవస్థ రాకముందున్న లక్షలాది ఇండ్ల వివరాలను ఈ -పంచాయతీ ఆపరేటర్లు రాత్రి పగలు శ్రమించి ఆన్లైన్ చేసి ప్రభుత్వ మన్ననలు పొందారు.

ప్రస్తుతం ఈ- పంచాయతీ ఆపరేటర్లు పంచాయతీలలో అభివృద్ధి పనుల వివరాల ఆన్లైన్ తో పాటు ఇంటి అనుమతులు, పేరు మార్పిడిలు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియను, ఇంటి పన్నుల, నల్ల పన్నుల, ఇతర పన్నుల వివరాలను ఆన్లైన్ నమోదు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు నిత్యం పంచాయతీల వారీగా మండలాల, వారీగా ఆన్లైన్ రిపోర్టులను ఏరోజుకారోజు మండల, డివిజన్, జిల్లా పంచాయతీ అధికారులకు అందిస్తున్నారు.

ప్రభుత్వం తాజాగా జూనియర్ , అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు సమ్మెకు దిగడంతో వారి బాధ్యతలను సీనియర్ పంచాయతీ కార్యదర్శులకు, ఎంపీడీవోలకు ఇన్చార్జీలుగా అప్పగించారు. వారికి కావలసిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఈ-పంచాయతీ ఆపరేటర్లు సమర్ధవంతంగా అందిస్తూ సమ్మె ప్రభావంతో పనులు ఆగకుండా పంచాయతీల పాలనలో వారి ప్రాధాన్యతను చాటుకున్నారు.

ఇంచార్జీలు అడిగిన సమాచారం అందిస్తూనే, ఇంకోవైపు అత్యవసరమైన జిపిడిపి ఆన్లైన్ నమోదును కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఈ- పంచాయతీ ఆపరేటర్ల పనితీరు జిల్లా, డివిజనల్ పంచాయతీ అధికారుల ప్రశంసలు అందుకుంటుంది.

గ్రామపంచాయతీల పరిపాలనలో గత ఎనిమిదేళ్లుగా కీలకంగా మారిన ఈ-పంచాయతి ఆపరేటర్ల పై జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మొదలుకొని జిల్లా పంచాయతీ అధికారుల వరకు ఆధారపడుతున్న తీరు వారి అవసరాన్ని చాటి చెబుతుంది.

అయితే కనీస పని గంటల కంటే అధికంగా పనిచేస్తూన్న ఈ-పంచాయతి ఆపరేటర్లకు, ఇచ్చే అరకొర వేతనాలను సైతం రెగ్యులర్‌గా ఇవ్వకపోవడం ఇబ్బందికరంగా తయారైంది. సెలవులు కూడా ఇవ్వకుండా పై అధికారులు అప్పగించే పని ఒత్తిడితో అనేక ఇబ్బందులకు గురవుతున్నామంటూ ఈ- పంచాయతి ఆపరేటర్లు వాపోతున్నారు.

ప్రభుత్వం పంచాయతీల్లో ఈ- పంచాయతీ ఆపరేటర్ల సేవలను, విధులను గుర్తించి వారికి ఇచ్చే జీతాలు అయినా రెగ్యులర్‌గా ట్రెజరీ ద్వారా చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు. అలాగే అర్హులైన వారందరి ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, పనిగంటలు, సెలవు దినాలను ఇతర ఉద్యోగులకు మాదిరిగా నిర్ణయించి మరింత ఉత్సాహంగా పనిచేసేలా చూడాలని ఈ-పంచాయితీ ఆపరేటర్లు కోరుకుంటున్నారు.

spot_img
spot_img
RELATED ARTICLES
spot_img

Latest News

Cinema

Politics

Most Popular