విధాత: టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజీని నిరసిస్తూ శుక్రవారం ఏబీవీపీ (ABVP) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తలపెట్టిన కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు ముందస్తు అరెస్టుల పర్వం కొనసాగించారు. నల్లగొండ సూర్యపేట యాదాద్రి భువనగిరి జిల్లాల కలెక్టర్ల ముట్టడికి సన్నద్ధమైన ఏబీవీపీ నాయకులను, కార్యకర్తలను, విద్యార్థులను తెల్లవారు జామున వారి ఇళ్లల్లోకి వెళ్లి మరి ముందస్తుగా అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. వారిని ఈ సాయంత్రం విడుదల చేసే అవకాశం ఉంది.
కాగా తమ ముందస్తు అరెస్టు పట్ల ఏబీవీపీ నాయకులు పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు చత్రపతి (Chatrapati), రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అభినవ్, జిల్లా కన్వీనర్ సంపత్ లు మాట్లాడుతూ నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిన టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజ్ స్కామ్ లో బాధ్యులైన అందరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లీకేజీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. పేపర్స్ లీక్ కారణంగా నిరుద్యోగులు నష్టపోకుండా ఎగ్జామ్స్ రీ షెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశారు.