జాతీయ నాయకత్వం పట్టించుకోవడం లేదా? రాష్ట్ర నాయకత్వం దూరం పెడుతున్నదా? ఈటలకు అధ్యక్ష పదవి అందని ద్రాక్షేనా? బండి సంజయ్ అధ్యక్షుడుగా కొనసాగుతారా? విధాత: సేవ సచ్చిన రాష్ట్ర బీజేపీకి జవసత్వాలు నింపిన ఈటల రాజేందర్‌ ఆ పార్టీలో ఒంటరి అయ్యారా? రాష్ట్ర నాయకత్వానికి కంటగింపుగా తయారయ్యారా? అన్న సందేహాలు సర్వత్రా వెలువడుతున్నాయి. విద్యార్థి దశ నుంచి విప్లవ విద్యార్థి రాజకీయాలలో పాల్గొని ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా ఎదిగిన ఈటల రాజేందర్‌.. కేసీఆర్‌తో జత కట్టి […]

  • జాతీయ నాయకత్వం పట్టించుకోవడం లేదా?
  • రాష్ట్ర నాయకత్వం దూరం పెడుతున్నదా?
  • ఈటలకు అధ్యక్ష పదవి అందని ద్రాక్షేనా?
  • బండి సంజయ్ అధ్యక్షుడుగా కొనసాగుతారా?

విధాత: సేవ సచ్చిన రాష్ట్ర బీజేపీకి జవసత్వాలు నింపిన ఈటల రాజేందర్‌ ఆ పార్టీలో ఒంటరి అయ్యారా? రాష్ట్ర నాయకత్వానికి కంటగింపుగా తయారయ్యారా? అన్న సందేహాలు సర్వత్రా వెలువడుతున్నాయి. విద్యార్థి దశ నుంచి విప్లవ విద్యార్థి రాజకీయాలలో పాల్గొని ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా ఎదిగిన ఈటల రాజేందర్‌.. కేసీఆర్‌తో జత కట్టి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించారు. కేసీఆర్‌కు అత్యంత నమ్మకస్తుడిగా ఎదిగారు. కీలకమైన ఆర్థిక శాఖను, తదుపరి వైద్యారోగ్య శాఖను నిర్వహించారు. ఆ తరువాత ఎందుకో గాని అదే కేసీఆర్‌ ఆగ్రహానికి గురై టీఆర్‌ఎస్‌ను వీడారు.

కేసీఆర్‌ను ఎదిరించే శక్తి, మాస్‌ ఫాలోయింగ్‌ ఈటలకు బాగా ఉందని గమనించిన బీజేపీ నాయకత్వం ఆయనను దగ్గరకు తీసుకుంది. ఈటల తన మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి హుజూరాబాద్ లో గెలిచిన ఈటల.. తన సత్తా నిరూపించుకున్నారు. రాజేందర్‌ గెలుపుతో రాష్ట్రంలో బీజేపీకి మంచి పాజిటివ్‌ వాతావరణం ఏర్పడింది. ఒక దశలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అన్న టాక్‌ కూడా వచ్చింది. కానీ ఆ తరువాతనే రాజేందర్‌కు అసలు సమస్య ఎదురైంది.

ఆర్‌ఎస్‌ఎస్‌ భావజలంతో మొదటి నుంచీ బీజేపీలో ఉన్న వారికి, వివిధ రాజకీయ పార్టీల్లో నుంచి బీజేపీలోకి వచ్చిన వారికీ మధ్య సమన్వయ లేమి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన వారికి మొదటి నుంచీ పార్టీలో ఉన్న వారు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మాస్‌ లీడర్‌గా ఉన్న ఈటల రాజేందర్‌ను బీజేపీ రాష్ట్ర నాయకులు అడుగడుగునా కట్టడి చేస్తున్నారన్న ఆరోపణలు ఈటల వర్గీయుల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో విభేదాలు పొడ చూపడంతోనే ఈటల పార్టీలో ఒంటరి అయ్యారని పలువురు అంటున్నారు.

రాష్ట్రంలో పార్టీ అభివృద్ధి కోసం, కేసీఆర్‌పై పోరాటం కోసం బీసీ నేత ఈటలకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తారన్న ప్రచారం సంక్రాంతి పండుగకు ముందు బలంగా జరిగింది. పండుగ తరువాత జరిగే జాతీయ కార్యవర్గ సమావేశంలో బీజేపీ అధిష్ఠానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంటుందని ఈటల వర్గీయులు ఆశించారు. కానీ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగి రోజులు గడుస్తున్నా.. ఈటలను పలకరించిన వాళ్లు లేరు.

ఈటలకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వడం లేదన్న విషయాన్ని శుక్రవారం రాష్ర్ట కార్యాలయంలో జరిగిన ఒక సభలో విజయశాంతి చేత చాలా జాగ్రత్తగా పరోక్షంగా చెప్పించారన్న వాదన వినిపిస్తున్నది. దీని ద్వారా ఎన్నికల వరకు బండి సంజయ్‌నే రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతారనే సంకేతాలను అధిష్ఠానం ఇచ్చిందన్న అభిప్రయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఇలా ఉండగా ఈ సభకు ఈటల రాజేందర్‌కు ఆహ్వానం లేకపోవడం కూడా చర్చకు దారితీసింది.

బీజేపీలో తనను దూరం పెట్టారని భావించిన ఈటల రాజేందర్‌ ఈ మధ్య కాలంలో తన ఇంటి వద్ద మీడియా సమావేశం నిర్వహించి మరీ అన్ని పార్టీల్లో కేసీఆర్‌ కోవర్టులున్నారని బాంబ్‌ పేల్చారు. ఇది బయటి పార్టీ వారినుద్దేశించి అనేకన్నా.. బీజేపీలోనే కేసీఆర్‌ కోవర్టులున్నారనే అర్థంలో మాట్లాడి ఉంటారన్న చర్చ రాజకీయ వర్గాలలో జరుగుతోంది. అదే సమయంలో సదరు కోవర్టులు బీజేపీలో ఎవరు ఉన్నారన్న చర్చ మొదలైంది.

విజయశాంతి 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై రాష్ర్ట బీజేపీ కార్యాలయంలో జరిగిన సభకు ఢిల్లీ నుంచి పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్‌ చుగ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వచ్చారు. కానీ స్థానికంగా బలమైన నేత, పార్టీ చేరికల కమిటీ చైర్మన్‌గా ఉన్న ఈటల రాజేందర్‌కు ఆహ్వానం లేకపోవడం ఏమిటి? ఆయన సడన్‌గా ఒక వివాహ ఫంక్షన్‌ పేరుతో ఢిల్లీకి వెళ్లటం ఏమిటన్న చర్చ జరుగుతోంది.

ఎలాగూ ఢిల్లీ వచ్చాం కాబట్టి పార్టీ అధిష్ఠానాన్ని కలుద్దామని ఈటల ప్రయత్నాలు చేసినా.. అవి ఫలించ లేదని తెలుస్తున్నది. ఢిల్లీ నాయకులు ఈటల కంటే.. బండిపైనే ఎక్కువ విశ్వాసం ఉంచారన్న చర్చ కాషాయ పార్టీలో నడుస్తున్నది. అందుకే ఉద్దేశపూర్వకంగానే ఢిల్లీ నాయకత్వం ఈటలకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని సమాచారం.

Updated On 28 Jan 2023 1:16 PM GMT
krs

krs

Next Story