విధాత బ్యూరో, కరీంనగర్: మా పార్టీలో ఎవరి పని వారు చేసుకుపోవాల్సిందేనని ఒకరి కోసం మరొకరు ఎదురు చూడడం, అనుమతులు తీసుకోవడం వంటివి ఉండవని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి బిజెపిలో చేరికపై గురువారం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలోకి ఎవరు వచ్చినా స్వాగతిస్తామన్నారు.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంచి నాయకుడు.. ప్రజల్లో పలుకుబడి ఉన్న నేత.. నిత్యం ప్రజల కోసం పని చేసే వ్యక్తి.. ఆయనను నమ్మించి ఎలా మోసం చేశారో ఖమ్మం ప్రజలందరికీ తెలుసునని ఆయన అన్నారు. బిజెపి తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్రజలు ఆశీర్వదిస్తున్నారని చెప్పారు.
గత ఆరు రోజులుగా స్థానిక కలెక్టరేట్ ముందు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న సమ్మె శిబిరాన్ని సందర్శించి సంజయ్ వారికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ మీద విశ్వాసంతో, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నమ్మి అందరూ పార్టీలోకి రావాల్సిందే అన్నారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బిజెపి చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ కలిశారన్న విషయంపై
సంజయ్ స్పందిస్తూ పార్టీలో ఎవరి పని వారు చేసుకుపోతారని చెప్పారు. ఈటెల పొంగులేటి శ్రీనివాసరెడ్డి వద్దకు వెళ్లారన్న సమాచారం తనకు లేదన్నారు. ‘నా వద్ద మోబైల్ లేదు.. అందుకే నాకు ఇప్పటిదాకా సమాచారం ఇవ్వలేదన్నారు.
అయితే తనకు చెప్పకపోవడం తప్పేం కాదన్నారు. పొంగులేటి పార్టీలోకి వస్తానంటే ఆహ్వానిస్తామని తెలంగాణలో రాక్షస రాజ్యం, కుటుంబరాజ్యం పోయి పేదల రాజ్యం వచ్చే వరకు జరిగే పోరాటంలో ఎవరినైనా కలుపుకు పోతామన్నారు.
పార్టీలోఎవరి పని వాళ్ళు చేసుకుపోవల్సిదేనని,’నాకు తెలిసిన వారితో నేను మాట్లాడతా..ఈటెలకు తెలిసినవారితో ఆయన మాట్లాడతారు’..అందులో తప్పేంలేదన్నారు. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుతున్నారని, అధికార పార్టీని ఎదుర్కొనే దమ్ము బిజెపికి ఉందని విశ్వసిస్తున్నారని చెప్పారు.
కాంగ్రెస్‌కు ఓటు వేస్తే, అది బీఆర్ఎస్‌కు వేసినట్టే అని ప్రజలు భావిస్తున్నారన్నారు. బీఆర్ఎస్‌తో కలుస్తామని కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యల్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
Live from Karimnagar https://t.co/H2im6S6D6E
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) May 4, 2023